
తెలుగు దర్శకుడికి అత్యున్నత పురస్కారం
న్యూఢిల్లీ: భారతీయ సినీ రంగానికి సంబంధించి అత్యున్నత పురస్కారమైన "దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు" మరోసారి తెలుగువారిని వరించింది. ప్రముఖ దర్శకుడు 'కళాతపస్వి' కె. విశ్వనాథ్‌కు 2016 సంవత్సరానికిగానూ ఫాల్కే అవార్డు దక్కింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఢిల్లీలో మే 3న జరిగే కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ప్రణభ్‌ముఖర్జీ.. విశ్వనాథ్‌కు అవార్డును అందజేస్తారు. ఫాల్కే అవార్డు దక్కడంపై కళాతపస్వి విశ్వనాథ్ స్పందిస్తూ.. 'నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు'అని అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ మోహన్ రెడ్డి.. కె.విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం కళాతపస్వికి అభినందనలు తెలుపుతున్నారు. గతంలో విశ్వనాథ్ రూపొందించిన 'శంఖరాభరణం' సినిమాకు జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే.
ఏమిటీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు? భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారం. దేశ సినిమా పరిశ్రమ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ అవార్డు అందజేస్తారు. దీన్ని భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1969లో ఏర్పాటు చేసింది. ఈ బహుమతి కింద స్వర్ణ కమలం,శాలువా, రూ. పది లక్షలు ఇస్తారు. 1969లో తొలి అవార్డును దేవికా రాణికి ప్రదానం చేశారు. ఇప్పటివరకు పురస్కారాన్ని 45 మందికి అందజేశారు.భారత చలన చిత్ర పితామహుడైన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరిట ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఆయన్నే దాదా సాహెబ్ ఫాల్కే అంటారు. భారతదేశంలో మొదటి మూకీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను ఆయన 1913లో నిర్మించారు.
ఆరుగురు తెలుగు వారికి:
దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఇప్పటి వరకు ఆరు గురు(విశ్వనాథ్‌తో కలిపి) తెలుగువారికి దక్కింది.
1. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (1974)
2. ఎల్.వి.ప్రసాద్ (1982)
3. బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986)
4. అక్కినేని నాగేశ్వరరావు (1990)
5. డి.రామానాయుడు (2009)
6. కె. విశ్వనాథ్ (2016)