చైనాలో 'దంగల్' రికార్డు వసూళ్లు
ముంబయి: బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా ’దంగల్’ మూవీ భారత్‌లోనే కాదు చైనాలోనూ రికార్డుల మోత మోగిస్తోంది. 7వేల స్క్రీన్లలో విడుదలైన తొలిరోజే రూ.15 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం తొలి వారం రోజుల్లో ఊహించని వసూళ్లతో బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తొలి వారంలో రూ. 187.42 కోట్లతో దంగల్ హవా కొనసాగిస్తోంది. చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ (భారత్) సినిమాగానూ దంగల్ నిలిచింది. ఈ వివరాలను బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్వీట్లో వెల్లడించారు. కళ్లు చెదిరే కలెక్షన్లతో మూవీ ఆడుతుందని హర్షం వ్యక్తంచేశారు.
హరియాణాకి చెందిన రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవిత కథాంశం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం చైనాలోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లో రూ. 120 కోట్లు రాబట్టిన దంగల్ తొలి వారాంతానికి రూ.187.42 కోట్ల వసూళ్లు సాధించింది. గతంలో ఆమీర్ పీకే చిత్రంలో చైనాలోరూ.100 కోట్లు కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. చైనాలో దంగల్ సినిమా విడుదల చేయడానికి ముందు దాని ప్రమోషన్ కోసం బీజింగ్, షాంఘై, చాంగ్‌డు నగరాల్లో ఆమిర్ ఖాన్ పర్యటించడం మూవీగా కలిసొచ్చిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమిర్, దర్శకుడు నితీశ్ తివారీలు చైనా ప్రేక్షకుల అభిమానంపై హర్షం వ్యక్తంచేశారు.
#Dangal ends *Week 1* on a PHENOMENAL note... Collects an ASTONISHING $ 29.13 million [₹ 187.42 cr] in China... MIND-BOGGLING!
— taran adarsh (@taran_adarsh) 12 May 2017