
రెండు చోట్ల కళ్లు చెమర్చాయి! - దాసరి నారాయణరావు
‘‘నేను దర్శకత్వం వహించిన ‘బంట్రోతు భార్య’ చిత్రంతో గీతా ఆర్ట్స్ బేనర్ ప్రారంభమైంది. ‘మాయాబజార్’ చిత్రంలో అల్లు అర్జున్ (బాల నటుడు)ని నేను నటుడిగా పరిచయం చేసిన విషయం చాలామందికి తెలియదు. అర్జున్ కంటే శిరీశ్‌నే నటుడిగా చూడాలని అల్లు రామలింగయ్య అనుకునేవారు. అరవింద్ పెంపకం వల్లో, చిరంజీవి అడుగుజాడల్లో నడవడం వల్లో ఏమో శిరీష్‌కు మంచి క్రమశిక్షణ ఉంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి జంటగా పరశురామ్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ చిత్రం అభినందన సభలో దాసరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘శ్రీరస్తు శుభమస్తు’ని దర్శకుడు బాగా తీర్చిదిద్దాడు. సినిమా చూస్తున్నప్పుడు నేను రెండు చోట్ల కన్నీళ్లు పెట్టుకున్నా.
కమర్షియల్‌గా కాకుండా ఓ మంచి చిత్రం తీయాలని అరవింద్ ఈ చిత్రం చేయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘దాసరిగారిలాంటి ప్రతిభ గల దర్శకుణ్ణి శిరీష్ తన నటనతో ఇంప్రెస్ చేశాడంటే అదో పెద్ద అచీవ్‌మెంట్’’ అని వీవీ వినాయక్ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులు మా చిత్రాన్ని ఇంత ఘన విజయం చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని పరశురామ్ చెప్పారు. ‘‘నాకు ఇంత మంచి హిట్ ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు’’ అని అల్లు శిరీష్ పేర్కొన్నారు. దర్శకులు సుకుమార్, నందినీరెడ్డి పాల్గొన్నారు.