
అలాంటి మగవాళ్ల కోసమే మై చాయిస్
‘‘మహిళలను హీనంగా చూసే పురుషులు ఇంకా ఉన్నారు. సంకుచిత స్వభావంతో ఉన్నవారు కోకొల్లలు. అలాంటి మగవాళ్ల కోసమే ‘మై చాయిస్’. స్త్రీ, పురుష సమానత్వం అనే అంశం మీద ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది’’ అంటున్నారు దీపికా పదుకొనే. ‘‘ప్రేమలో పడితే అది నా చాయిస్, బ్రేకప్ అయితే అది నా చాయిస్, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో అది నా చాయిస్. నా జీవితం నా చాయిస్’’ అంటూ దీపికా నటించిన డాక్యుమెంటరీ ‘మై చాయిస్’ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ డాక్యుమెంటరీ ప్రశంసలతో పాటు విమర్శలను కూడా దక్కించుకుంది. కొంతమంది యువకులైతే ఏకంగా ‘మై చాయిస్’ వీడియోకి కౌంటర్‌గా ‘మై చాయిస్ - మేల్ వెర్షన్’ పేరుతో ఓ డాక్యుమెంటరీ కూడా తీశారు. ఇన్నాళ్లూ తన డాక్యుమెంటరీ గురించి మౌనం వహించిన దీపికా ఇప్పుడు నోరు విప్పారు. ‘‘మా ఈ చిన్న ప్రయత్నాన్ని అభినందించినవారికి థ్యాంక్స్. విమర్శించినవాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తున్నా.
కానీ ఈ చిత్రం ద్వారా ఇచ్చిన సందేశం అస్పష్టంగా వెళ్లిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే చాలా మందికి నా ఉద్దేశం సరిగ్గా అర్థం కాలేదు. ఇలాగే చేయమని ఎవరికీ చెప్పడం లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలో ప్రతి మహిళా తెలుసుకోవాలనీ, ఎవరి ఇష్టం మేరకు వాళ్లు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాలన్నదే నా ఉద్దేశం’’ అన్నారు.