
చిన్న చూపు చూడొద్దు!
‘‘మగవాళ్లతో పోల్చితే ఆడవాళ్లు శారీరకంగా బలహీనులు కావచ్చు.. కానీ వాళ్లకి బుద్ధిబలం ఎక్కువ. అలాగని, నేను మగవాళ్లను తక్కువ చేసి మాట్లాడటంలేదు. కానీ, స్త్రీని చిన్న చూపు చూడొద్దంటున్నాను’’ అని సోనమ్ కపూర్ అంటున్నారు. ఇటీవల ‘మై చాయిస్’ పేరుతో దీపికా పదుకొనె ఆడవాళ్ల హక్కుల గురించి ప్రస్తావిస్తూ నటించిన వీడియో బయటికొచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియోకు విమర్శలూ, ప్రశంసలూ రెండూ లభిస్తున్నాయి. స్త్రీ హక్కుల గురించి మాట్లాడుతున్నారు కదా.. మీక్కూడా అలాంటి వీడియో ఏదైనా చేసే ఉద్దేశం ఉందా? అనే ప్రశ్న సోనమ్ కపూర్ ముందుంచితే - ‘‘నాకా ఆలోచన లేదు. ఎందుకంటే, మనోభావాలు చెప్పడానికి వీడియో అవసరంలేదు. ఎప్పుడనిపిస్తే అప్పుడు...
ఎక్కడ అనిపిస్తే అక్కడ నిర్భయంగా నేను చెప్పేస్తా.. మా ఇంట్లో ‘నువ్వు ఆడపిల్లవు...’ అని అడుగడుగునా గుర్తు చేస్తూ, పెంచలేదు. అందుకని, మగవాళ్లకన్నా ఆడవాళ్లను తక్కువగా చూస్తారనే విషయం కూడా తెలియదు. కానీ, సినిమాల్లోకొచ్చాక తెలిసింది. హీరోలను ఒకలా.. హీరోయిన్‌లను వేరేలా చూస్తుంటారు. హీరోలకు బోల్డంత మర్యాద.. హీరోయిన్లకు అందులో కొంత. విచిత్రంగా అనిపించింది. అప్పట్నుంచే ఆడవాళ్ల హక్కుల విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ప్రపంచం ఎంత ఎదిగినా ఆడవాళ్ల హక్కుల విషయంలో పెద్దగా అభివృద్ధి లేదని తెలుసుకున్నా. ఇది విచారించదగ్గ విషయం. కానీ, విచారిస్తే లాభం లేదు. ప్రతి స్త్రీ తన హక్కుల కోసం పోరాడాలి. అప్పుడే మార్పు వస్తుంది’’ అని చెప్పారు.