
చుట్టూ బాడీగార్డులు లేకుండా ఒంటరిగా దీపికా పదుకోన్ బయటికొస్తే ఏమవుతుంది? జనాలు చుట్టుముట్టేస్తారు. అభిమాన తారను చూసిన ఆనందంలో క్రేజీ ఫ్యాన్స్ అయితే హద్దులు దాటే అవకాశం కూడా ఉంది. అలాంటి దీపికా పదుకోన్ ముంబైలో ఏకంగా సూపర్ మార్కెట్‌కి, బట్టల దుకాణానికి, ఓ మొబైల్ షాప్‌కి, ఇతర రద్దీ ప్రాంతాలకు వెళితే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెను పట్టించుకోలేదు. ఎందుకంటే ఇలా వీధుల్లో తిరిగినది అందాల దీపికా కాదు. మాలతి (‘ఛపాక్’లో దీపికా పాత్ర పేరు) రూపంలో తిరిగిన దీపికా. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా రూపొందిన ‘ఛపాక్’లో లక్ష్మీ పాత్రను దీపికా పదుకోన్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దీపికా ఓ నిర్మాత కూడా.
మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యాసిడ్ దాడి బాధితులను సమాజం ఎలా చూస్తోంది? అనే విషయాన్ని తెలుసుకోవడానికి దీపికా సినిమాలో తాను చేసిన మాలతి గెటప్‌లో రద్దీ ప్రాంతాలకు వెళ్లారు. ఆమెతో పాటు కొందరు యాసిడ్ దాడి బాధితులు కూడా వెళ్లారు. దీపికాను ఎవరూ గుర్తుపట్టలేదు. అందవిహీనంగా ఉన్న వీళ్లను చూసి కొందరు ముఖాలు చిట్లించుకున్నారు. చిరాకు పడ్డారు కూడా. కొందరు మాత్రం మామూలుగానే మాట్లాడారు. ఇదంతా రహస్య కెమెరాల్లో షూట్ చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసి, ‘‘ఏ మార్పుని అయితే చూడాలనుకుంటున్నారో ముందు ఆ మార్పు మీరే అవ్వండి’’ అని దీపికా పదుకోన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment