వసూళ్లలో వెనుకబడ్డ ‘జైహో’
వసూళ్లలో వెనుకబడ్డ ‘జైహో’
Published Mon, Jan 27 2014 12:08 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
సల్మాన్‌ఖాన్ తాజా చిత్రం ‘జైహో’ వసూళ్లు ఆ చిత్ర నిర్మాతలకు నిరాశ కలిగిస్తున్నాయి. సల్లూభాయ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా వసూళ్లూ చాలా తగ్గాయి. దీంతో ఆశించినస్థాయిలో ఈ చిత్రం విజయం సాధించకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏమాత్రం కథ, కథనం బాగున్నా, కాసింత నవ్వించే సత్తా ఆ సినిమాకున్నా, ఫరవాలేదనిపించిన చిత్రాలు కూడా వందకోట్ల రూపాయల మార్కును దాటడం బాలీవుడ్‌లో మనం చూస్తూనే ఉన్నాం. అయితే సినీవిశ్లేషకులు మాత్రం ‘జైహో’ రూ.75 కోట్లకు మించి వసూళ్లు రాబట్టలేకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
అందుకు ఉదాహరణగా తొలిరోజు వసూళ్లను చూపుతున్నారు. తొలిరోజు ‘జైహో’ కేవలం రూ. 17.55 కోట్లే రాబట్టింది. ఈపాటి వసూళ్లు టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలు కూడా వసూలు చేస్తున్నాయి. మరి దేశవ్యాప్తంగా 4,500 థియేటర్లలో విడుదలైన సల్లూభాయ్ చిత్రం ఇంత తక్కువగా వసూలు చేయడంతో వందకోట్ల క్లబ్‌లో ఈ చిత్రం చేరలేకపోవచ్చని చెబుతున్నారు. ‘ప్రస్తుతం బాలీవుడ్‌లో బడా హీరోల సినిమాలు కూడా పోటీకి లేవు. ఈ పరిస్థితుల్లో సల్లూభాయ్ సినిమా రికార్డుస్థాయిలో వసూళ్లు రాబట్టాలి. కాని తొలిరోజు వసూళ్లు చూస్తే అందుకు విరుద్ధంగా ఉంది.
భారీ పోటీ ఉన్నప్పుడే ‘ఏక్ థా టైగర్’ సినిమా తొలిరోజు రూ.30 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ‘జైహో’ అంచనాలను అందుకోలేకపోవచ్చని చెప్పకతప్పద’ని ప్రముఖ విశ్లేషకులు రాజేశ్ థడానీ అన్నారు. సల్మాన్ సోదరుడు సోహైల్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో డైసీ షా బాలీవుడ్‌కు పరిచయమైంది. రాజకీయాలే నేపథ్యంగా సాగే చిత్రంలో యాక్షన్‌కు కూడా అధికంగా ప్రాధాన్యతనిచ్చారు. కథ, సంభాషణలు బాగున్నా కామెడీ లోపించడమే ఈ చిత్రంలో ప్రధానమైన లోటుగా కనిపిస్తుందని సినీపండితులు చెబుతున్నారు. వాంటెడ్, దబంగ్, దబంగ్-2, ఏక్ థా టైగర్ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న సల్మాన్‌కు ఈ సినిమాతో కాస్త బ్రేక్ పడినట్లేనని కూడా చెబుతున్నారు.
Advertisement
Advertisement