ఆమె పక్కన నిలబడటమే ఛాలెంజ్‌: హీరో | Dhanush opens up about working with Kajol in VIP 2 | Sakshi
Sakshi News home page

ఆమె పక్కన నిలబడటమే ఛాలెంజ్‌: హీరో

Published Mon, Jun 26 2017 6:03 PM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

Dhanush opens up about working with Kajol in VIP 2

తమిళ సినిమా: నటి కాజోల్‌ పక్కన ఫ్రేమ్‌లో నిలబడటమే ఛాలెంజ్‌గా భావించానని హీరో ధనుష్‌ పేర్కొన్నారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రాల్లో వేలై ఇల్లాపట్టాదారి 2 (వీఐపీ 2) ఒకటి. ఇంతకు ముందు ధనుష్‌ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం వేలై ఇల్లాపట్టాదారి చిత్రానికి సీక్వెల్‌ ఇది. వీ.క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.ధాను, ధనుష్‌ వండర్‌బార్‌ ఫిలింస్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నటుడు ధనుష్‌నే కథ, మాటలు అందించడం విశేషం.

ఇంతకు ముందు రజనీకాంత్‌ హీరోగా కోచ్చడైయాన్‌ అనే తొలి 3డీ యానిమేషన్‌ చిత్రాన్ని తెరకెక్కించిన సౌందర్యరజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం వీఐపీ 2. నటి అమలాపాల్‌ కథానాయకిగా నటిస్తున్న ఇందులో బాలీవుడ్‌ ప్రముఖ నటి కాజల్‌ ప్రధాన పాత్ర పోషించారు. శాన్‌రోల్డన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం తమిళం, తెలుగు భాషలతో పాటు హిందిలోనూ తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తమిళం, తెలుగు భాషల్లో వీఐపీ 2 పేర్లతోనూ హిందిలో పాల్కర్‌ పేరుతోనూ విడుదలకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ చిత్ర మూడు భాషల ఆడియో, టీజర్‌ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ముంబాయిలోని పీవీఆర్‌ సినీమాల్‌లో నిర్వహించారు. ఇదే రోజు నిర్మాత కలైపులి ఎస్‌.ధాను పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు బాల్కీ, ఆనంద్‌.ఎల్‌.రాయ్‌లతో పాటు లతారజనీకాంత్‌ తదితరులు అతిధులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాఆంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర కథకుడు, మాటల రచయిత, కథానాయకుడు ధనుష్‌ విలేకరులతో ముచ్చటించారు.

ప్ర : వీఐపీ 2 చిత్రం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
జ : వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ) చిత్రం మంచి విజయాన్ని మించి అమ్మ సెంటిమెంట్, ప్రేమ ,తమ్ముడుతో అనుబంధం, యాక్షన్‌ అంటూ జనరజకమైన అంశాలతో కూడిన చిత్రం. దాన్ని అలా వదిలేయకూడదని ఆ చిత్ర విడుదలయిన సమయంలోనే అనిపించింది. అయితే అలాంటి కథను సిద్ధం చేయడం సవాల్‌గానే మారింది .దానికి మించిన స్థాయిలో కాన్సెప్ట్స్‌ కోసం ఏడాదిన్నర ఆలోచించాను. అలా పొల్లాచ్చిలో కొడి చిత్ర షూటింగ్‌ సమయంలో వచ్చిన థాట్‌తో తయారు చేసిన కథతో రూపొందించిన చిత్రం వీఐపీ 2. వీఐపీ చిత్రంలో మాదిరిగానే ఇందులోనూ అమ్మసెంటిమెంట్, నాన్న, తమ్ముడు, అర్ధాంగి, స్నేహితులు అంటూ అన్ని అంశాలు ఉంటాయి.

ప్ర : వీఐపీ 2 చిత్రాన్ని తమిళం, తెలుగుతో పాటు హిందిలోనూ విడుదల చేయాలనుకోవడానికి కారణం?
జ : నిజం చెప్పాలంటే ఈ చిత్రాన్ని హిందిలో విడుదల చేయాలని ముందు అనుకోలేదు. ఇటీవల బాహుబలి, దంగల్‌ లాంటి చిత్రాలు అన్ని భాషల్లోనూ పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. వీఐపీ 2 చిత్రంపైనా మంచి అంచనాలు నెలకొనడంతో తాము అలాంటి ప్రయత్నం చేయాలనుకున్నాం. అందుకే తాము ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు,హింది భాషల్లో విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చాం.

ప్ర : హిందీ నటి కాజోల్‌తో నటించిన అనుభవం గురించి?
జ : నేను చదువుకునే రోజుల్లోనే ఆమె నటించిన చిత్రాలను చేసేవాడిని. ఇప్పటికీ 14, 15 ఏళ్ల వయసు ఎనర్జీ కలిగిన నటి కాజోల్‌. వీఐపీ 2లో తమిళ భాషలో సంభాషణలు చెప్పి నటించడానికి మొదటి రెండు రోజులు కష్టపడినా, ఆ తరువాత వాటిని బట్టీపట్టి అద్భుతంగా నటించారు. కాజోల్‌ చాలా మంచి నటి. ఆమె పక్కన ఫ్రేమ్‌లో నిలబడటమే నాకు ఛాలేంజ్‌ అనిపించింది. కాజోల్‌తో కలిసి నటించడం మంచి అనుభవం.

ప్ర : 3 చిత్రాన్ని మీ భార్య ఐశ్వర్య దర్శకత్వంలోనూ, వీఐపీ 2 చిత్రాన్ని ఆమె చెల్లెలు సౌందర్యరజనీకాంత్‌ దర్శకత్వంలోనూ నటించారు. ఇద్దరిలో వ్యత్యాసం గురించి?
జ : ఇద్దరి మధ్య వ్యత్యాసం గురించి కంటే ఏకత్వం గురించి చెప్పాలి. సినిమాపై వారి నిజాయితీ, అంకితభావం, తమ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలనే తపన, కఠిన శ్రమను గుర్తించాను. ఇద్దరూ వైవిధ్యంగా ఆలోచిస్తారు. మహిళా దర్శకురాళ్లను ప్రోత్సహించడం నేనూ ఘనతగా భావిస్తున్నాను.

ప్ర : పవర్‌పాండి 2 చిత్రాన్ని చేస్తానన్నారు.అదెప్పుడుంటుంది?
జ : పవర్‌పాండి 2 చిత్రానికి కథను సిద్ధం చేశాను.అందులో నటించడానికి రాజ్‌కిరణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు.అయితే ఆ చిత్రాన్ని వెంటనే ప్రారంభిద్దామా? వేరే చిత్రం చేసిన తరువాత పవర్‌పాండి 2ను చేద్దామా,అన్న ఆలోచనలో ఉన్నాను.

ప్ర : కోడి తరువాత మళ్లీ ద్విపాత్రాభినయం ఎప్పుడే చేయనున్నారు?
జ : ఏదైనా వైవిధ్యంగా ఉండాలని ఆశిస్తాను. కోడి చిత్రంలో ద్విపాత్రాభినయం చేసిన పాత్రల రూపాలు ఒకేలా ఉన్నా, వాటి అభినయంలో వైవిధ్యంగా ఉంటుంది. అలాంటి మంచి కథ లభిస్తే ద్విపాత్రాయానికి రెడీ.

ప్ర : నటుడు, కథారచయిత, గాయకుడు, నిర్మాత, దర్శకుడిగా రాణిస్తున్నారు. మీలో ఇంత ఎనర్జీకి కారణం?
జ : నా కుమారులు యాత్ర, లింగాలే నాకు ఎనర్జీ. వారు పెరిగి 18 ఏళ్ల వయసుకు చేరే సరికి వారు గర్వపడేలా నేను ఉన్నత స్థాయికి చేరుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement