![Dhanush Release First Look Poster Of Prabhudeva Bagheera Movie - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/16/bagheera.jpg.webp?itok=6mr1K6hk)
చెన్నై : నటుడు, నృత్యదర్శకుడు, దర్శకుడు ప్రభుదేవా నటిస్తున్న తాజా చిత్రానికి భగీర అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈయన నెవర్ బిఫోర్ లాంటి పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల తెలియజేసిన విషయం తెలిసిందే. త్రిష ఇల్లన్నా నయనతార, శింబు హీరోగా అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ వంటి సంచలన చిత్రాలను తెరకెక్కించిన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం భగీర. నటి అమైనా దస్తూర్ నాయకిగా నటిస్తోంది. ఈ అమ్మడు చాలా కాలం తరువాత కోలీవుడ్‌లో నటిస్తున్న చిత్రం ఇదే. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రేమికుల రోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. నటుడు ధనుష్ ఈ పోస్టర్‌ను ఆన్‌లైన్‌లో ఆవిష్కరించారు.
కాగా చిత్ర వివరాలను దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ తెలుపుతూ భగీర అనేది కామిక్ పుస్తకాల్లో వచ్చే కల్పిత పాత్ర అని చెప్పారు. జంగిల్‌బుక్ చిత్రంలో మోగ్లీ పాత్రకు ఫ్రెండ్‌గా కనిపించే చిరుతపులి పాత్ర లాంటిదన్నారు. ఆపదలో ఉన్న అబలలను మరో ఆలోచన లేకుండా కాపాడే ఈ పాత్రలో నటుడు ప్రభుదేవా నటిస్తున్నారని చెప్పారు. ఇది సైకో థ్రిల్లర్ ఇతివృత్తంతో కూడిన సస్పెన్స్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. వరుస హత్యల నేపథ్యంలో సాగే విభిన్న కథా చిత్రంగా భగీర ఉంటుందన్నారు. ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి కథ, కథనాలతో, ఆశ్యర్యకరమైన అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. ప్రస్తుతానికి భగీర గురించి ఏమీ చెప్పదలచుకోలేదని, షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని చెప్పారు. దీన్ని ఆవీ.భరతన్ బీఏబీఎల్, ఎస్‌వీఆర్.రవిశంకర్ కలిసి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నటించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు తెలిపారు. కాగా భగీర చిత్ర పోస్టర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రభుదేవా గెటప్ చాలా వింతగా ఉండి చిత్రంపై అంచనాలను పెంచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment