ధూమ్-3లో హీరో నేనే: అభిషేక్ బచ్చన్
ముంబై: ధూమ్, ధూమ్ 2లో నటించిన అభిషేక్ బచ్చన్ మూడో దాంట్లోనూ చాన్స్ కొట్టేశాడు. ఇందులో తానే హీరోనని చెప్పాడు. తాను, ఉదయ్‌చోప్రా లేకుండా ధూమ్3 తీయడం సాధ్యపడేది కాదని స్పష్టం చేశాడు. అభిషేక్, ఉదయ్ గతంలో మాదిరిగానే జైదీక్షిత్, అలీ అక్బర్‌గా కనిపిస్తారు. ప్రత్యర్థివర్గంలో ఆమిర్‌ఖాన్, కత్రినాకైఫ్ ఉంటారు. ‘ఇది పూర్తిగా నా సినిమా. ఎవరూ నా దగ్గరి నుంచి దీనిని తీసుకోలేరు. జై, అలీ చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ రెండు పాత్రలే లేకుంటే సినిమానే లేదు’ అని అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ధూమ్3 ప్రచారతీరు, ఆమిర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంపై అభిషేక్ సంతృప్తిగా లేడంటూ వార్తలు వచ్చాయి. దీనికి మనోడు స్పందిస్తూ సినిమా మార్కెటింగ్ చేసేవాళ్లను ఈ ప్రశ్న అడగాలని, ఇలాంటి పుకార్లతో తనకు పనిలేదని స్పష్టం చేశాడు. మిగతా విషయాలైతే తనతో మాట్లాడవచ్చని అన్నాడు.
ఈ సినిమా ప్రచారం తక్కువగా ఉంటేనే మేలని ధూమ్ 3లో విలన్‌గా కనిపిస్తున్న ఆమిర్ ఇటీవల ప్రకటించాడు. అభిషేక్ కూడా ఈ వాదనను సమర్థిస్తూ ధూమ్ సినిమాకు ఇది వరకే ఎంతో పేరుంద ని, ఇందులో తారలు లేకున్నా హిట్ కొడుతుందని చెప్పాడు. ఏ ఒక్కరికీ ఇందులో అధిక ప్రాధాన్యం లేదని, అందరూ సమానమేనని అభిషేక్ అన్నాడు. ఇదిలా ఉంటే నటుడిగా ఇది తన ఆఖరి చిత్రమని ఉదయ్‌చోప్రా ప్రకటించాడు. ఇక నుంచి తాను సినిమాల నిర్మాణానికి మాత్రమే పరిమితమవుతానని తెలిపాడు. దీనిపై జూనియర్ బచ్చన్ మాట్లాడుతూ ఉదయ్ తనకు మంచి స్నేహితుడని, సినిమాల్లో కొనసాగాల్సిందిగా అతనికి సూచిస్తానని అన్నాడు. ఉదయ్ అన్న ఆదిత్యచోప్రా ధూమ్ 3ని నిర్మించాడు. ఈ నెల 20న ఇది విడుదలవుతోంది.