
హయ్యస్ట్ పెయిడ్ హీరో అతడే!
ముంబై: విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసులవర్షం కురిపిస్తుంటాయి. బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఎక్కువ అతడివే ఉంటాయి. సినిమా కలెక్షన్ల విషయంలోనే కాదు వ్యక్తిగత రెమ్యునరేషన్ లోనూ 'మిస్టర్ పర్ఫెక్ట్' ముందున్నాడు. ఆమిర్ తాజా చిత్రం 'దంగల్'తో అతడు రూ.175 కోట్లు ఆర్జించినట్టు 'డీఎన్ఏ' పత్రిక వెల్లడించింది. విశ్వసనీయ వర్గాల ద్వారా సంపాదించిన సమాచారం ప్రకారం ఈ వివరాలు వెల్లడించింది.
'దంగల్ సినిమా ద్వారా ఆమిర్ ఖాన్ దాదాపు రూ. 175 కోట్లు ఆర్జించాడు. పారితోషికంగా కింద రూ. 35 కోట్లు తీసుకున్నాడు. సినిమా కలెక్షన్లలో 33 శాతం ఆమిర్ తీసుకుంటాడు. అంతకాదు తన సినిమా భవిష్యత్ వసూళ్లలోనూ రాయల్టీ కింద 33 శాతం తీసుకుంటాడ'ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా ఆమిర్ ఖాన్ గుర్తింపు పొందాడు. దంగల్ నటి జైరా వసీం ప్రధానపాత్రలో నటించిన 'సీక్రెట్ స్టార్' సినిమాలో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు.