
భయం వేసింది!
‘‘వాస్తవానికి ‘దిక్కులు చూడకు రామయ్య’ కథ వినగానే చాలా బాగుందనిపించింది. వెంటనే భయం కూడా వేసింది. ఇరవయ్యేళ్ల కొడుక్కి తండ్రిగా చేస్తూ ప్రేమలో పడటమనేది రిస్కే కదా. చిత్రీకరణ ఏమాత్రం తేడాగా ఉన్నా బోల్డన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ, దర్శకుడు త్రికోటి అద్భుతంగా తెరకెక్కించారు.’’ అని అజయ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన పత్రికలవారితో ‘దిక్కులు చూడకు రామయ్య’లో తన పాత్ర గురించి మాట్లాడుతూ -‘‘నాలా ఎక్కువగా నెగటివ్ రోల్స్ చేసేవాళ్లు అంత త్వరగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి రీచ్ కారు. కానీ, ‘దిక్కులు చూడకు రామయ్య’లో చేసిన పాత్ర ఫ్యామిలీస్‌కి దగ్గరవుతుందని నమ్మి, చేశాను. అదే నిజమైంది’’ అన్నారు. తనలాంటి ఆర్టిస్టులు మాస్ కమర్షియల్ చిత్రాల్లో హీరోగా నటిస్తే, ప్రేక్షకులు అంగీకరించరని ‘సారాయి వీర్రాజు’తో అర్థమైందని, అందుకే ఆ తర్వాత ఆ తరహా చిత్రాలొచ్చినా చేయలేదని అజయ్ అన్నారు. కేరక్టర్ నటుడిగా కొనసాగుతూనే, కొత్త తరహా కుటుంబ కథా చిత్రాల్లో అవకాశం వస్తే, హీరోగా చేస్తానని అన్నారు.