Dikkulu Choodaku Ramayya
-
భయం వేసింది!
‘‘వాస్తవానికి ‘దిక్కులు చూడకు రామయ్య’ కథ వినగానే చాలా బాగుందనిపించింది. వెంటనే భయం కూడా వేసింది. ఇరవయ్యేళ్ల కొడుక్కి తండ్రిగా చేస్తూ ప్రేమలో పడటమనేది రిస్కే కదా. చిత్రీకరణ ఏమాత్రం తేడాగా ఉన్నా బోల్డన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ, దర్శకుడు త్రికోటి అద్భుతంగా తెరకెక్కించారు.’’ అని అజయ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన పత్రికలవారితో ‘దిక్కులు చూడకు రామయ్య’లో తన పాత్ర గురించి మాట్లాడుతూ -‘‘నాలా ఎక్కువగా నెగటివ్ రోల్స్ చేసేవాళ్లు అంత త్వరగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి రీచ్ కారు. కానీ, ‘దిక్కులు చూడకు రామయ్య’లో చేసిన పాత్ర ఫ్యామిలీస్‌కి దగ్గరవుతుందని నమ్మి, చేశాను. అదే నిజమైంది’’ అన్నారు. తనలాంటి ఆర్టిస్టులు మాస్ కమర్షియల్ చిత్రాల్లో హీరోగా నటిస్తే, ప్రేక్షకులు అంగీకరించరని ‘సారాయి వీర్రాజు’తో అర్థమైందని, అందుకే ఆ తర్వాత ఆ తరహా చిత్రాలొచ్చినా చేయలేదని అజయ్ అన్నారు. కేరక్టర్ నటుడిగా కొనసాగుతూనే, కొత్త తరహా కుటుంబ కథా చిత్రాల్లో అవకాశం వస్తే, హీరోగా చేస్తానని అన్నారు. -
ఊహించడానికే భయంగా ఉంది!
బుల్లితెరపై కొంతమంది అమ్మాయిలను చూసినప్పుడు ’హీరోయిన్ మెటీరియల్‌లా ఉందే’ అనుకుంటాం. సనా మక్బూల్‌ని చూసి, చాలామంది అలానే అనుకున్నారు. టీనేజ్లోనే బుల్లితెర రంగప్రవేశం చేసిన సనా మక్బూల్ పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించారు. ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు తెరపై మెరిసిన ఈ అందానికి మంచి మార్కులే పడ్డాయి. ఇక, సనా మక్బూల్‌తో మాట్లాడదాం... ఫోన్ చాలాసేపటి నుంచీ బిజీగా ఉంది.. బహుశా ప్రశంసల కాల్స్ అనుకుంటా? కరెక్ట్‌గానే ఊహించారు. ‘దిక్కులు చూడకు రామయ్య’ విడుదలై, దాదాపు వారం కావస్తున్నా ఇంకా అభినందనలు అందుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఎలాంటి అంచనాలూ లేకుండా ఈ సినిమా చేశాను. ముంబయ్ అమ్మాయిలను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు కాబట్టి, నన్ను కూడా ఇష్టపడతారనుకున్నాను. ఆ ఊహ నిజమైంది. ఈ చిత్రంలో తండ్రి, కొడుకు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు కదా.. ఆ కథ విన్నప్పుడు నెగటివ్ అవుతుందని భయపడలేదా? లేదు. చాలా కొత్తగా అనిపించింది. పైగా, ఎలాంటి అసభ్యతకూ తావు లేకుండా సినిమా సాగుతుందని స్క్రీన్‌ప్లే విన్నప్పుడు అనిపించింది. అందుకే ఒప్పుకున్నా. మరి.. నిజజీవితంలో ఓ తండ్రి, కొడుకు ఇద్దరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే విషయం తెలిస్తే, ఎలా ఎదుర్కొంటారు? వామ్మో.. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఊహించడానికే భయంగా ఉంది. ఏమో అలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొంటానో చెప్పలేను. అసలీ చిత్రానికి ఎలా అవకాశం వచ్చింది? నిర్మాత సాయి కొర్రపాటి తన చిత్రంలో కథానాయిక కోసం అన్వేషిస్తున్నారని తెలిసింది. ముంబయ్‌లోనే ఉన్నారని తెలిసి, కలిశాను. ఆడిషన్స్‌కి రమ్మంటే హైదరాబాద్ వచ్చాను. దర్శకుడు త్రికోటి గారి ఆధ్వర్యంలో ఆడిషన్స్ జరిగాయి. తర్వాత ఆ షూట్‌ని రాజమౌళిగారికి పంపించారు. ఆయన కూడా చూసి, నన్ను ఓకే చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత రాజమౌళి ఏమన్నారు? చాలా బాగా యాక్ట్ చేశావని అభినందించారు. మొదటి సినిమాకే అంత పెద్ద దర్శకుడి నుంచి అభినందనలు అందుకోవడం అంటే మాటలు కాదు కదా. బుల్లితెర నుంచి వెండితెరకు.. ఈ ప్రయాణం ఎలా అనిపిస్తోంది? నటిగా పెద్ద తెరకు ప్రమోట్ అయ్యాను. వ్యక్తిగా నాలో మార్పు రాలేదు. నేనెవరో ఎవరికీ తెలియనప్పుడు నన్ను నలుగురికీ పరిచయం చేసింది బుల్లితెర. ఇప్పుడు వెండితెర మరింత గుర్తింపు తెచ్చింది. ప్రాథమికంగా నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. ఇప్పుడూ అలానే ఫీలవుతున్నా. మొదటి సినిమాలో హోమ్లీగా కనిపించారు.. మరి పాత్ర డిమాండ్ చేస్తే భవిష్యత్తులో బికినీ ధరిస్తారా? నాకు తెలిసి సౌత్‌లో బికినీ వేయరనుకుంటా. అయినా, హీరోయిన్గా నా అనుభవం ఒకే ఒక్క సినిమా. ఎలాంటి పాత్రలు చేయాలి, ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలనే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. చూద్దాం.. భవిష్యత్తు ఎలా ఉంటుందో? కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను. అసలు సిసలు దక్షిణాది అమ్మాయిగా మారిపోయి, నటిస్తాను. అంతవరకూ గ్యారంటీ. మీ బుగ్గలు భలే సొట్టపడతాయి... అవునండి. ఈ విషయం చాలామంది చెప్పారు. ‘నీ నవ్వు బాగుంటుంది’ అని అభినందిస్తుంటారు. అప్పుడు ఇంకా నవ్వాలనిపిస్తుంటుంది. ‘మిస్ బెస్ట్ స్మైల్’ టైటిల్ కూడా గెల్చుకున్నట్లున్నారు? అవును. రెండేళ్ల క్రితం ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ఆ టైటిల్ గెల్చుకున్నా. ముంబయ్ అమ్మాయి కాబట్టి హిందీ చిత్రాలు ట్రై చేస్తారా లేక తెలుగులో కొనసాగుతారా? ఇప్పుడప్పుడే హిందీ సినిమాలు చేసే ఆలోచన నాకు లేదు. మా అమ్మగారు మలయాళీ. అందుకని దక్షిణాది భాషా చిత్రాలు బాగా చూసేదాన్ని. అదృష్టవశాత్తూ, దక్షిణాది చిత్ర పరిశ్రమ ద్వారానే హీరోయిన్ అయ్యాను. తెలుగు పరిశ్రమ బాగా నచ్చింది. అందుకే ఇక్కడి చిత్రాలపై దృష్టి సారించాలనుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, ఓ మంచి చిత్రం ద్వారా పరిచయం అయ్యాను కాబట్టి, నా తదుపరి చిత్రం కూడా అలానే ఉండాలనుకుంటున్నాను. అందుకే, రెండో సినిమా ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నా. -
రామయ్య ఎటు చూసాడు?
-
అందుకే ముందు పువ్వు పట్టుకుని వస్తున్నా!
‘కత్తి పట్టేంత వయసు, స్థాయి... నాకిప్పుడు లేవు. అందుకే... ముందు పువ్వు పట్టుకుని వస్తున్నా. కుటుంబ ప్రేక్షకులను రంజింపజేయడమే నా ముందున్న లక్ష్యం’ అంటున్నారు యువ నటుడు నాగశౌర్య. చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే... చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య ‘దిక్కులు చూడకు రామయ్య’తో నేడు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే... తండ్రి, కొడుకు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే : ఈ కథే గమ్మత్తుగా ఉంటుంది. తండ్రీ, కొడుకు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. పర్యవసానం ఏంటి? అనేది ఈ సినిమా కథ. నా తండ్రి పాత్రను అజయ్ పోషించారు. మా ఇద్దరి సన్నివేశాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇంద్రజ చాలా రోజుల తర్వాత నటించిన సినిమా ఇది. ప్రతి సన్నివేశాన్నీ కలర్ఫుల్గా, మనసుల్ని తాకేలా తెరకెక్కించారు త్రికోటి. ‘ఈ సినిమా నీకు మంచి బ్రేక్ అవుతుంది’ అని చూసిన వెంటనే నిర్మాత సాయి కొర్రపాటి తొలి ప్రశంస అందించారు. కీరవాణిగారి చేతులమీదుగా తొలి చెక్ అందుకున్నా: నేను సోలో హీరోగా చేస్తున్న తొలి సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’కు కీరవాణిగారు సంగీతం అందించినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నేను నటునిగా తొలి చెక్కు ఆయన నుంచే అందుకున్నాను. ‘ఊహలు గుసగుసలాడే’ ఆడిషన్స్‌లో నేను హీరోగా సెలక్టయ్యానని నాకు తెలీదు. పిలిస్తే, ఆఫీస్‌కి వచ్చాను. కొబ్బరికాయ చేతికిచ్చి కొట్టమన్నారు. అందరూ బాగుండాలని కొబ్బరికాయ కొట్టాను. అప్పుడు కీరవాణిగారే చెక్కు నాకిచ్చారు. అప్పుడర్థమైంది సెలక్టయ్యానని. ఆ సినిమా మంచి పేరు తెచ్చింది. కుటుంబ ప్రేక్షకులకు చేరువ అవ్వడమే నా లక్ష్యం: కత్తులు పట్టుకోవడానికి, యుద్ధాలు చేయడానికి చాలామంది హీరోలున్నారు. కానీ... పువ్వులు పట్టుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారనేది నా అభిప్రాయం. అందుకే... ప్రస్తుతానికి ఇలాంటి పాత్రలే చేస్తాను. నాకు ఇమేజ్‌తో పనిలేదు. ఎలాంటి పాత్ర అయినా నాగశౌర్య చేయగలడు అనిపించుకుంటే చాలు. ఆమిర్‌ఖాన్ నాకు ఆదర్శం. ఆయనలా ఇమేజ్‌కి భిన్నంగా పేరు తెచ్చుకోవాలనుంది. -
కొన్ని లిరిక్స్ వినిపించకపోవడమే మన అదృష్టం : కీరవాణి
‘‘ఇతర సంగీత దర్శకుల గురించి వ్యాఖ్యానించడం నా అభిమతం కాదు. ఎవరిష్టం వచ్చినవాళ్లతో వాళ్లు పాడించుకుంటారు. బేసిక్‌గా నాకు తెలుగువాళ్లతో పాడించడం ఇష్టం. ఇప్పుడీ చిత్రంలోని పాటలన్నీ పాడింది తెలుగు గాయనీ గాయకులే. ఫలానా సింగర్ పాడితేనే బాగుంటుందని నాకనిపించే ఏకైక గాయకుడు ‘బాలుగారు’. ఆయన కోసం మాత్రమే ఆగిన సందర్భాలున్నాయి’’ అని కీరవాణి చెప్పారు. త్రికోటి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి శివాని సమర్పణలో సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘దిక్కులు చూడకు రామయ్య’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రానికి స్వరాలందించిన కీరవాణి సోమవారం పత్రికలవారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. నా కెరీర్ ఆరంభం నుంచి అవసరాన్ని బట్టి పెద్ద, చిన్న సినిమాలు చేస్తున్నాను. నాకు చిన్నా, పెద్దా అనే వ్యత్యాసం లేదు. ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాకి ఏం అవసరమో ఆ పరిధిలో ఒదిగిపోయి చేశాను. నా దృష్టిలో పెద్ద సినిమా, చిన్న సినిమా అనేది నిర్మాణ వ్యయాన్నిబట్టి ఉండదు. 100 కోట్లతో తీసిన సినిమా కూడా సరైన సమయానికి విడుదల కాకపోతే అది చిన్న సినిమా కిందే లెక్క. అదే 50 లక్షలతో తీసిన సినిమా అయినా సరైన సమయానికి విడుదలవుతుందనే భరోసా ఉన్నప్పుడు అది పెద్ద సినిమానే. ఈ చిత్రదర్శకుడు త్రికోటి ఎప్పట్నుంచో తెలుసు. ఆయనతో ఏమైనా చెప్పొచ్చు.. ఏమైనా మాట్లాడొచ్చు. ఈ సినిమా విషయంలో సౌలభ్యం ఏంటంటే... ‘మాకిలా కావాలి.. అలా కావాలి’ అని అడిగే హీరో లేరు. దాంతో కావాల్సినంత స్వేచ్ఛ లభించింది. హాయిగా పాటలు చేయగలిగాను. నేనిచ్చిన స్వరాలు కథానుసారం ఉండటంతో కోటి వాటినే తీసుకున్నారు. ఈ చిత్రంలో అందరూ అద్భుతంగా నటించారు. అజయ్ నంబర్ వన్ అంటాను. ఇప్పటివరకు తను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే, ఈ సినిమా మరో ఎత్తు అవుతుంది. ‘ఈగ’లో సుదీప్ నటన నాకే స్థాయిలో నచ్చిందో, ఈ చిత్రంలో అజయ్ నటన అంత బాగా నచ్చింది. సాయి కొర్రపాటితో ‘ఈగ’ సమయంలోనే నాకు మంచి అవగాహన ఏర్పడింది. ఏ నిర్మాత అయినా నన్ను నమ్మితే నేను సౌకర్యవంతంగా సినిమా చేయగలను. సాయి కొర్రపాటి ఆ కోవకు చెందిన నిర్మాతే. ఈ సినిమా చేయడానికి అదొక కారణం అయితే మరో కారణం కథ. ఇందులో ఉన్నవన్నీ సందర్భానుసారంగా సాగే పాటలు కావడంతో చాలా హాయి అనిపించింది. ట్యూన్ రిపీట్ కావడం అనేది సహజం. ఆర్టిస్టులు వేసుకున్న మేకప్పే వేసుకుంటున్నారు. రచయితలు రాసిందే రాస్తున్నారు. సాహిత్యం గురించి తీసుకుందాం.. మనసు, ప్రేమ, ఆరాధన.. ఇలాంటి పదాలు లేకుండా పాటలొస్తున్నాయా? కొన్ని లిరిక్స్ అదృష్టవశాత్తు వాయిద్యాల హోరులో వినిపించలేదంటే సంతోషపడాలి. అవి వినపడితే బాధపడాలి. నాకు తెలిసి.. స్వరాలే నవ్యంగా ఉంటున్నాయి. ఫలానా పాట ఎక్కడో విన్నట్లుందే అని అనిపించిందనుకోండి.. అది కూడా దర్శక, నిర్మాతలకో, హీరోకో అలాంటి పాట కావాలని చెప్పడంవల్లే జరుగుతుంది. ఒక్కోసారి సరిపోనంత టైమ్ లేకపోవడంవల్లా రిపిటీషన్ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన సంగీతదర్శకుల్లో నాకు ‘స్వామి రారా’ సంగీతదర్శకుడు ఎం.ఆర్. సన్నీ నచ్చాడు. నాకు నేనుగా సినిమాలు తగ్గించలేదు. నా దగ్గరికొచ్చి అడిగితే, చేస్తున్నాను. ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు, ఆ చిత్ర సంగీతదర్శకుడికి ‘ఆల్ ది బెస్ట్’ చెబుతాం. ఓ పది ఆడియో రిలీజులకు వెళ్లినప్పుడు పది ఆల్ ది బెస్ట్‌లు చెబుతాం. ఆ పది సంగీతదర్శకులకు మూడేసి సినిమాలకు అవకాశం వచ్చినా.. మనకు తగ్గుతాయి. నేనెవరికి ఆల్ ది బెస్ట్ చెప్పినా మనస్ఫూర్తిగా చెబుతాను. సో.. ఒకవైపు వారికి ఆల్ ది బెస్ట్ చెబుతూ, నేను కూడా బిజీగా ఉండాలని కోరుకోవడం హాస్యాస్పదం. -
10న వస్తున్న 'దిక్కులు చూడకు రామయ్య'
నాగ శౌర్య, సనా ముక్బుల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం దిక్కులు చూడకు రామయ్య. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించారు. మంచి కథతో రోమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పలువురు ప్రముఖులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కోర్రపాటి సాయి నిర్మాతగా వరాహి చలన చిత్రం బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మరో విశేషం ఏమిటంటే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా ఈ చిత్రంలోని పాటలను రచించారు. ఈ చిత్రంలో అజయ్, ఇంద్రజా కూడా నటించారు.