సనా మక్బూల్
బుల్లితెరపై కొంతమంది అమ్మాయిలను చూసినప్పుడు ’హీరోయిన్ మెటీరియల్‌లా ఉందే’ అనుకుంటాం. సనా మక్బూల్‌ని చూసి, చాలామంది అలానే అనుకున్నారు. టీనేజ్‌లోనే బుల్లితెర రంగప్రవేశం చేసిన సనా మక్బూల్ పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించారు. ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు తెరపై మెరిసిన ఈ అందానికి మంచి మార్కులే పడ్డాయి. ఇక, సనా మక్బూల్‌తో మాట్లాడదాం...
ఫోన్ చాలాసేపటి నుంచీ బిజీగా ఉంది.. బహుశా ప్రశంసల కాల్స్ అనుకుంటా?
కరెక్ట్‌గానే ఊహించారు. ‘దిక్కులు చూడకు రామయ్య’ విడుదలై, దాదాపు వారం కావస్తున్నా ఇంకా అభినందనలు అందుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఎలాంటి అంచనాలూ లేకుండా ఈ సినిమా చేశాను. ముంబయ్ అమ్మాయిలను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు కాబట్టి, నన్ను కూడా ఇష్టపడతారనుకున్నాను. ఆ ఊహ నిజమైంది.
ఈ చిత్రంలో తండ్రి, కొడుకు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు కదా.. ఆ కథ విన్నప్పుడు నెగటివ్ అవుతుందని భయపడలేదా?
లేదు. చాలా కొత్తగా అనిపించింది. పైగా, ఎలాంటి అసభ్యతకూ తావు లేకుండా సినిమా సాగుతుందని స్క్రీన్‌ప్లే విన్నప్పుడు అనిపించింది. అందుకే ఒప్పుకున్నా.
మరి.. నిజజీవితంలో ఓ తండ్రి, కొడుకు ఇద్దరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నారనే విషయం తెలిస్తే, ఎలా ఎదుర్కొంటారు?
వామ్మో.. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఊహించడానికే భయంగా ఉంది. ఏమో అలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొంటానో చెప్పలేను.
అసలీ చిత్రానికి ఎలా అవకాశం వచ్చింది?
నిర్మాత సాయి కొర్రపాటి తన చిత్రంలో కథానాయిక కోసం అన్వేషిస్తున్నారని తెలిసింది. ముంబయ్‌లోనే ఉన్నారని తెలిసి, కలిశాను. ఆడిషన్స్‌కి రమ్మంటే హైదరాబాద్ వచ్చాను. దర్శకుడు త్రికోటి గారి ఆధ్వర్యంలో ఆడిషన్స్ జరిగాయి. తర్వాత ఆ షూట్‌ని రాజమౌళిగారికి పంపించారు. ఆయన కూడా చూసి, నన్ను ఓకే చేశారు.
ఈ సినిమా చూసిన తర్వాత రాజమౌళి ఏమన్నారు?
చాలా బాగా యాక్ట్ చేశావని అభినందించారు. మొదటి సినిమాకే అంత పెద్ద దర్శకుడి నుంచి అభినందనలు అందుకోవడం అంటే మాటలు కాదు కదా.
బుల్లితెర నుంచి వెండితెరకు.. ఈ ప్రయాణం ఎలా అనిపిస్తోంది?
నటిగా పెద్ద తెరకు ప్రమోట్ అయ్యాను. వ్యక్తిగా నాలో మార్పు రాలేదు. నేనెవరో ఎవరికీ తెలియనప్పుడు నన్ను నలుగురికీ పరిచయం చేసింది బుల్లితెర. ఇప్పుడు వెండితెర మరింత గుర్తింపు తెచ్చింది. ప్రాథమికంగా నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. ఇప్పుడూ అలానే ఫీలవుతున్నా.
మొదటి సినిమాలో హోమ్లీగా కనిపించారు.. మరి పాత్ర డిమాండ్ చేస్తే భవిష్యత్తులో బికినీ ధరిస్తారా?
నాకు తెలిసి సౌత్‌లో బికినీ వేయరనుకుంటా. అయినా, హీరోయిన్‌గా నా అనుభవం ఒకే ఒక్క సినిమా. ఎలాంటి పాత్రలు చేయాలి, ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోవాలనే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. చూద్దాం.. భవిష్యత్తు ఎలా ఉంటుందో? కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను. అసలు సిసలు దక్షిణాది అమ్మాయిగా మారిపోయి, నటిస్తాను. అంతవరకూ గ్యారంటీ.
మీ బుగ్గలు భలే సొట్టపడతాయి...
అవునండి. ఈ విషయం చాలామంది చెప్పారు. ‘నీ నవ్వు బాగుంటుంది’ అని అభినందిస్తుంటారు. అప్పుడు ఇంకా నవ్వాలనిపిస్తుంటుంది.
‘మిస్ బెస్ట్ స్మైల్’ టైటిల్ కూడా గెల్చుకున్నట్లున్నారు?
అవును. రెండేళ్ల క్రితం ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ఆ టైటిల్ గెల్చుకున్నా.
ముంబయ్ అమ్మాయి కాబట్టి హిందీ చిత్రాలు ట్రై చేస్తారా లేక తెలుగులో కొనసాగుతారా?
ఇప్పుడప్పుడే హిందీ సినిమాలు చేసే ఆలోచన నాకు లేదు. మా అమ్మగారు మలయాళీ. అందుకని దక్షిణాది భాషా చిత్రాలు బాగా చూసేదాన్ని. అదృష్టవశాత్తూ, దక్షిణాది చిత్ర పరిశ్రమ ద్వారానే హీరోయిన్ అయ్యాను. తెలుగు పరిశ్రమ బాగా నచ్చింది. అందుకే ఇక్కడి చిత్రాలపై దృష్టి సారించాలనుకుంటున్నా. ప్రస్తుతం కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, ఓ మంచి చిత్రం ద్వారా పరిచయం అయ్యాను కాబట్టి, నా తదుపరి చిత్రం కూడా అలానే ఉండాలనుకుంటున్నాను. అందుకే, రెండో సినిమా ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నా.