
అందుకే ముందు పువ్వు పట్టుకుని వస్తున్నా!
‘కత్తి పట్టేంత వయసు, స్థాయి... నాకిప్పుడు లేవు. అందుకే... ముందు పువ్వు పట్టుకుని వస్తున్నా. కుటుంబ ప్రేక్షకులను రంజింపజేయడమే నా ముందున్న లక్ష్యం’ అంటున్నారు యువ నటుడు నాగశౌర్య. చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే... చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య ‘దిక్కులు చూడకు రామయ్య’తో నేడు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే...
తండ్రి, కొడుకు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే : ఈ కథే గమ్మత్తుగా ఉంటుంది. తండ్రీ, కొడుకు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. పర్యవసానం ఏంటి? అనేది ఈ సినిమా కథ. నా తండ్రి పాత్రను అజయ్ పోషించారు. మా ఇద్దరి సన్నివేశాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇంద్రజ చాలా రోజుల తర్వాత నటించిన సినిమా ఇది. ప్రతి సన్నివేశాన్నీ కలర్‌ఫుల్‌గా, మనసుల్ని తాకేలా తెరకెక్కించారు త్రికోటి. ‘ఈ సినిమా నీకు మంచి బ్రేక్ అవుతుంది’ అని చూసిన వెంటనే నిర్మాత సాయి కొర్రపాటి తొలి ప్రశంస అందించారు.
కీరవాణిగారి చేతులమీదుగా తొలి చెక్ అందుకున్నా: నేను సోలో హీరోగా చేస్తున్న తొలి సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’కు కీరవాణిగారు సంగీతం అందించినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నేను నటునిగా తొలి చెక్కు ఆయన నుంచే అందుకున్నాను. ‘ఊహలు గుసగుసలాడే’ ఆడిషన్స్‌లో నేను హీరోగా సెలక్టయ్యానని నాకు తెలీదు. పిలిస్తే, ఆఫీస్‌కి వచ్చాను. కొబ్బరికాయ చేతికిచ్చి కొట్టమన్నారు. అందరూ బాగుండాలని కొబ్బరికాయ కొట్టాను. అప్పుడు కీరవాణిగారే చెక్కు నాకిచ్చారు. అప్పుడర్థమైంది సెలక్టయ్యానని. ఆ సినిమా మంచి పేరు తెచ్చింది.
కుటుంబ ప్రేక్షకులకు చేరువ అవ్వడమే నా లక్ష్యం: కత్తులు పట్టుకోవడానికి, యుద్ధాలు చేయడానికి చాలామంది హీరోలున్నారు. కానీ... పువ్వులు పట్టుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారనేది నా అభిప్రాయం. అందుకే... ప్రస్తుతానికి ఇలాంటి పాత్రలే చేస్తాను. నాకు ఇమేజ్‌తో పనిలేదు. ఎలాంటి పాత్ర అయినా నాగశౌర్య చేయగలడు అనిపించుకుంటే చాలు. ఆమిర్‌ఖాన్ నాకు ఆదర్శం. ఆయనలా ఇమేజ్‌కి భిన్నంగా పేరు తెచ్చుకోవాలనుంది.