సినిమా రివ్యూ :దిక్కులు చూడకు రామయ్య
విభిన్న ప్రయత్నం
ప్రస్తుతం పెద్ద సినిమాలన్నీ దాదాపు ఒకే ఫార్ములాతో ముందుకెళ్తుంటే, చిన్న సినిమాలేమో ప్రేమ నెపంతో అశ్లీల హాస్యం చుట్టూ తిరుగున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరైనా ఓ కొత్త ప్రయత్నంతో ముందుకొస్తే వాళ్లను అభినందించాల్సిందే. అలాంటి ప్రయత్నమే.. ‘దిక్కులు చూడకు రామయ్య’. ‘అమెరికన్ బ్యూటీ’ అనే ఇంగ్లిష్ సినిమా ప్రేరణతో తయారు చేసుకున్న కథ ఇదని కొందరి అభిప్రాయం. అంతదూరం ఎందుకూ... మన తెలుగు నాటిక ‘ఇప్పుడు’ పోలికలు కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నాయని ఇంకొందరు క్రిటిక్స్ అంటున్నారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా విశేషాల్లోకి వెళ్తే...
కథ: కొన్ని కారణాల వల్ల పదిహేనేళ్లకే గోపాలకృష్ణ అలియాస్ క్రిష్ (అజయ్)కు భవాని (ఇంద్రజ)తో పెళ్లయిపోతుంది. చిన్న వయసులోనే ఇద్దరి బిడ్దల తండ్రి అయిపోతాడు. యుక్తవయసులోనే బాధ్యతల్ని తలకెత్తుకోవడంతో టీనేజ్‌ని సరిగ్గా ఎంజాయ్ చేయలేపోయాననే బాధ క్రిష్‌లో అంతర్లీనంగా ఉంటుంది. ఈలోపే తనకు 36 ఏళ్లు వచ్చేస్తాయి.
తన పెద్ద కొడుకు మధు (నాగశౌర్య)కు ఇప్పుడు పద్దెనిమిదేళ్లు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాడు. అయితే... తన వయసునీ, కుటుంబ వివరాలను గోప్యంగా ఉంచుతూ ఈ వయసులో కూడా అమ్మాయిలకు బీట్ వేస్తూ క్రిష్ కోల్పోయిన ఆనందాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో అతనికి సమీత (సనా మక్బూల్) తారసపడుతుంది. తప్పుడు వయసు చెప్పి, తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఆ అమ్మాయితో స్నేహం పెంచుకుంటాడు క్రిష్.
అనుకోకుండా సమీతను క్రిష్ పెద్ద కొడుకు మధు కూడా ప్రేమిస్తాడు. అయితే ఒకానొక సమయంలో... తన తండ్రి సమీతతో చనువుగా ఉంటున్నాడని తెలుస్తుంది. సమీత కూడా తన తండ్రిని పెళ్లాడటానికి రెడీగా ఉందని తెలుసుకున్న మధు, తన తల్లి కోసం ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు? ఏ విధంగా తన తండ్రిని మార్చాడు? అనేది ఈ సినిమా కథ.
ఎలా చేశారంటే: ఈ చిత్రానికి హీరో నాగశౌర్య అయినా, కథాపరంగా అసలు హీరో అజయ్. తన కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ పాత్రను ఇందులో అజయ్ చేశారు. చక్కగా అభినయించారు కూడా. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, యుక్తవయసులోని ఆనందాలన్నింటినీ కోల్పోయిన వ్యక్తి ్రఫస్టేషన్‌ని చక్కగా ఆవిష్కరించారు. తన కొడుకు క్యారేజ్ తీసుకొచ్చి ఇచ్చే సన్నివేశంలో, ఇంట్లో చిన్నకొడుకుతో, బయట బ్రహ్మాజీతో వచ్చే కామెడీ, సీన్స్, హీరోయిన్‌ని ట్రాప్‌లోకి లాగే సన్నివేశాల్లో అజయ్ నటన అభినందనీయంగా ఉంది. అయితే... కేవలం తన అభినయం వల్లే పండాల్సిన పతాక సన్నివేశంలోనే అజయ్ నటన తేలిపోయింది.
కొడుకుని కంటిముందే కొడుతుంటే తండ్రిగా స్పందించాల్సినంత స్పందించలేదు. పశ్చాత్తాపాన్ని కూడా సరిగ్గా పలికించలేదనే చెప్పాలి. దర్శకుడు ఈ విషయంలో కాస్త జాగ్రత్తపడితే బాగుండేది. తల్లి బాగుకోసం పరితపిస్తూ, తండ్రికి బుద్ధి చెప్పే పాత్రలో నాగశౌర్య చక్కగా ఇమిడిపోయాడు. తన పాత్రకు అన్ని విధాలుగా న్యాయం చేశాడు. తప్పకుండా తన కెరీర్‌కి ఈ సినిమా మంచి మలుపనే చెప్పాలి. కథానాయిక సనా మక్బూల్ అందానికీ, అభినయానికీ ఆస్కారమున్న పాత్ర చేసింది. చాలాకాలం తర్వాత వెండితెరపై మెరిసిన ఇంద్రజ తల్లి పాత్రలో భళా అనిపించారు. బ్రహ్మాజీ చక్కని వినోదాన్ని పంచారు.
ఎలా తీశారంటే: దర్శకుడు త్రికోటి తొలి సినిమాకే మంచి మార్కులు సొంతం చేసుకున్నారు. ప్రత్యేకమైన కామెడీ ట్రాక్‌ల జోలికి పోకుండా, ఒక భిన్నమైన కథను ఎంచుకొని, అందులోనే కావల్సినంత వినోదాన్ని నింపి సమర్థవంతంగా ప్రేక్షకులకు అందించారు. ప్రేమ, బంధాలు, భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించారు. కథనం కాస్త నిదానించినా... ఎక్కడా ప్రేక్షకులకు విసుగు రాకుండా జాగ్రత్త పడ్డారు. రాజశేఖర్ కెమెరా పనితనం బాగుంది. సంభాషణలు కూడా అశ్లీలత లేకుండా డీసెంట్‌గా ఉన్నాయి. ఇక ఇందులో సాంకేతిక నిపుణులందరూ ఓ ఎత్తు అయితే, కీరవాణి సంగీతం మరో ఎత్తు. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయిలో నిలబెట్టారాయన. కీలక సన్నివేశాల్లోనూ, ఇంటర్వెల్ బ్యాంగ్‌లోనూ వచ్చే రీ-రికార్డింగ్ కథలోని ఉత్కంఠను ప్రతిబింబిస్తుంది.
బలాలు: కథ నటీనటుల అభినయం దర్శకత్వం, ముఖ్యంగా కీరవాణి సంగీతం
బలహీనత: నిదానించిన కథనం.
తారాగణం: నాగశౌర్య, సనా మక్బూల్,అజయ్, ఇంద్రజ, బ్రహ్మాజీ తదితరులు
దర్శకుడు: త్రికోటి,
సంగీతం: కీరవాణి,
నిర్మాత: రజనీ కొర్రపాటి.