Trikoti
-
‘జువ్వ’ మూవీ రివ్యూ
టైటిల్ : జువ్వ జానర్ : కమర్షియల్ ఎంటర్టైనర్ తారాగణం : రంజిత్, పాలక్ లల్వాని, అర్జున్, పోసాని కృష్ణమురళీ, మురళీశర్మ సంగీతం : ఎమ్.ఎమ్. కీరవాణి దర్శకత్వం : త్రికోటి.పి నిర్మాత : డా. భరత్ సోమి నువ్వు నేను ఒకటవుదాం సినిమాతో హీరోగా పరిచయం అయిన రంజిత్ సోమి, లాంగ్ గ్యాప్ తరువాత హీరోగా నటించిన సినిమా జువ్వ. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన త్రికోటి రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమాలో పాలక్ లల్వాణీ హీరోయిన్గా నటించింది. రంజిత్ అన్న భరత్ నిర్మాణంలో కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన జువ్వ.. రంజిత్‌ను హీరోగా నిలబెట్టిందా..? త్రికోటికి దర్శకుడిగా సక్సెస్ అందించిందా..? కథ : 14 ఏళ్ల వయసులో బసవరాజు పాటిల్ (మలయాళ నటుడు అర్జున్) తన క్లాస్మేట్ శృతి(పాలక్ లల్వాణి)ని ప్రేమిస్తున్నాని వేధిస్తాడు. తప్పని మందలించిన స్కూల్ ప్రిన్సిపల్‌ను చంపేస్తాడు. ఈ కేసులో బసవరాజుకు 14 ఏళ్ల శిక్ష పడుతుంది. జైలుకు వెళ్లేప్పుడు కూడా శృతితో నీ కోసం తిరిగొస్తా అనటంతో శృతి కుటుంబం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేస్తుంది. తన పేరును కూడా ఆధ్యగా మార్చుకొని ప్రశాంతంగా ఉంటుంది. రానా జనాలను మోసం చేస్తూ డబ్బులు సంపాందించే అల్లరి కుర్రాడు. (సాక్షి రివ్యూస్) ఆధ్యను చూసిన రానా తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెకు దగ్గరయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అదే సమయంలో 14 ఏళ్ల తరువాత జైలు నుంచి విడుదలైన బసవరాజు శృతి కోసం వెతుకుతున్నాడని తెలిసి ఆమెకు సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. రానా... బసవరాజు నుంచి శృతిని ఎలా కాపాడాడు..? ఈ ప్రయత్నంలో రానాకు ఎవరెవరు సాయం చేశారు..? చివరకు బసవరాజు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : హీరోగా నటించిన రంజిత్ తొలి సినిమాతో పోలిస్తే మంచి పరిణతి చూపించాడు. ఫైట్స్, డ్యాన్స్‌లలో మంచి ఈజ్ చూపించాడు. హీరోయిన్గా పాలక్ లల్వాణీ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. విలన్‌గా కనిపించిన మలయాళ నటుడు అర్జున్ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. (సాక్షి రివ్యూస్) సైకో ప్రేమికుడి పాత్రలో అర్జున్ పర్ఫెక్ట్గా సరిపోయాడు. ఫస్ట్‌హాఫ్ లో సప్తగిరి, భద్రం నవ్వించే ప్రయత్నం చేశారు. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళీ, మురళీశర్మ, సన, అలీ తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : రంజిత్‌ను హీరోగా రీ లాంచ్ చేసేందుకు దర్శకుడు త్రికోటి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను ఎంచుకున్నాడు. రత్నం అందించిన కథ ఆకట్టుకునేలా ఉన్నా.. దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కిచటంలో దర్శకుడు తడబడ్డాడు. తొలి భాగం అంతా హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి కేటాయించిన దర్శకుడు ఇంటర్వెల్ సమయానికి గానీ అసలు కథలోకి ఎంటర్ కాలేదు. ద్వితీయార్థంలో హీరో, విలన్ల మధ్య జరిగే సన్నివేశాలను ఆసక్తికరంగా రూపొందించాడు.(సాక్షి రివ్యూస్) సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి నిరాశపరిచాడు. పాటలు పరవాలేదనిపించినా కీరవాణి స్థాయిలో మాత్రం లేవు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాత భరత్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : కథ నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్ : రొటీన్ టేకింగ్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
కీరవాణి మార్క్ మెలోడి ‘ఓ కల’
‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేం త్రికోటి దర్శకత్వంలో రంజిత్, పలక్ లల్వాని జంటగా తెరకెక్కుతున్న సినిమా జువ్వ. ఇటీవల ఈ సినిమా పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. భరత్ సోమి నిర్మిస్తున్న ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతమందించారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్రయూనిట్ మేకింగ్ వీడియోతో పాటు ‘ఓ కల’ అంటూ సాగే మెలోడి సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. వశిష్ట్ వర్మ సాహిత్య మందించిన ఈ పాటను కీరవాణి తనయుడు కాలభైరవతో కలిసి దామిని ఆలపించారు. -
అన్నదమ్ముల అనుబంధానికి ఈ సినిమా ప్రతీక – చిరంజీవి
‘‘సాధారణంగా యాక్టర్ కాబోయి డాక్టర్ అయ్యాడనే మాటలను వింటుంటాం. కానీ తమ్ముడు రంజిత్ కోసం డాక్టర్ భరత్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఈ విధంగా అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా ఈ సినిమా నిలబడింది’’ అన్నారు చిరంజీవి. రంజిత్, పాలక్ లల్వానీ జంటగా ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేమ్ త్రికోటి పేట దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జువ్వ’. ఎస్వీ రమణ సమర్పణలో సొమ్మి ఫిలింస్ పతాకంపై డాక్టర్ భరత్ సోమి నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ అండ్ టీజర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘భరత్, రంజిత్ల నాన్నగారితో నాకు మంచి పరిచయం ఉంది. టీజర్లో రంజిత్ డైనమిక్‌గా, హుషారుగా కనిపిస్తున్నాడు. రంజిత్‌ది పక్కా మాస్ క్యారెక్టర్ అని అర్థం అవుతోంది. పాలక్ లల్వానీ రొమాంటిక్‌గా, అందంగా కనిపించింది. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించిన ఈ జువ్వ సినిమాను ఈ అన్నదమ్ముల కోసం తప్పకుండా చూస్తా. త్రికోటి మరో హిట్ అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌ను రిలీజ్ చేసిన చిరంజీవిగారికి థ్యాంక్స్. గతేడాదే మా సినిమా పూర్తయింది. ఈ నెల చివర్లో ఆడియోను, వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు భరత్. ‘‘చిరంజీవిగారి చేతుల మీదగా ఈ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉంది. ప్రేమకథా చిత్రమిది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు నచ్చుతాయన్న నమ్మకం ఉంది’’ అన్నారు త్రికోటి. ‘‘చిరంజీవిగారు నా రోల్ మోడల్ అండ్ ఇన్స్పైరింగ్. నేను హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆయన రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. నేనెప్పుడైనా లోన్లీగా ఉన్నప్పుడు చిరంజీవిగారి పాటలే వింటాను’’ అన్నారు రంజిత్. -
మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లో సుధీర్
తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ సత్తా చాటిన యంగ్ హీరో సుధీర్ బాబు. వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు 2015లో రిలీజ్ అయిన భలే మంచి రోజు తరువాత సుధీర్ హీరోగా తెరకెక్కిన ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం వీర భోగవసంత రాయలు, శమంతకమణి లాంటి మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తున్న సుధీర్ బాబు, సోలో హీరోగా ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌కు సైన్ చేశాడు. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి త్రికోటి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు సుధీర్. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన దిక్కులు చూడకు రామయ్య సినిమాతో దర్శకుడిగా మారిన త్రికోటి.., తొలి ప్రయత్నంలో ఆకట్టుకోలేకపోయాడు. అందుకే లాంగ్ గ్యాప్ తరువాత సుధీర్ బాబు హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి అమైరా దస్తర్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
సినిమా రివ్యూ :దిక్కులు చూడకు రామయ్య
విభిన్న ప్రయత్నం ప్రస్తుతం పెద్ద సినిమాలన్నీ దాదాపు ఒకే ఫార్ములాతో ముందుకెళ్తుంటే, చిన్న సినిమాలేమో ప్రేమ నెపంతో అశ్లీల హాస్యం చుట్టూ తిరుగున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరైనా ఓ కొత్త ప్రయత్నంతో ముందుకొస్తే వాళ్లను అభినందించాల్సిందే. అలాంటి ప్రయత్నమే.. ‘దిక్కులు చూడకు రామయ్య’. ‘అమెరికన్ బ్యూటీ’ అనే ఇంగ్లిష్ సినిమా ప్రేరణతో తయారు చేసుకున్న కథ ఇదని కొందరి అభిప్రాయం. అంతదూరం ఎందుకూ... మన తెలుగు నాటిక ‘ఇప్పుడు’ పోలికలు కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నాయని ఇంకొందరు క్రిటిక్స్ అంటున్నారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా విశేషాల్లోకి వెళ్తే... కథ: కొన్ని కారణాల వల్ల పదిహేనేళ్లకే గోపాలకృష్ణ అలియాస్ క్రిష్ (అజయ్)కు భవాని (ఇంద్రజ)తో పెళ్లయిపోతుంది. చిన్న వయసులోనే ఇద్దరి బిడ్దల తండ్రి అయిపోతాడు. యుక్తవయసులోనే బాధ్యతల్ని తలకెత్తుకోవడంతో టీనేజ్‌ని సరిగ్గా ఎంజాయ్ చేయలేపోయాననే బాధ క్రిష్‌లో అంతర్లీనంగా ఉంటుంది. ఈలోపే తనకు 36 ఏళ్లు వచ్చేస్తాయి. తన పెద్ద కొడుకు మధు (నాగశౌర్య)కు ఇప్పుడు పద్దెనిమిదేళ్లు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాడు. అయితే... తన వయసునీ, కుటుంబ వివరాలను గోప్యంగా ఉంచుతూ ఈ వయసులో కూడా అమ్మాయిలకు బీట్ వేస్తూ క్రిష్ కోల్పోయిన ఆనందాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో అతనికి సమీత (సనా మక్బూల్) తారసపడుతుంది. తప్పుడు వయసు చెప్పి, తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఆ అమ్మాయితో స్నేహం పెంచుకుంటాడు క్రిష్. అనుకోకుండా సమీతను క్రిష్ పెద్ద కొడుకు మధు కూడా ప్రేమిస్తాడు. అయితే ఒకానొక సమయంలో... తన తండ్రి సమీతతో చనువుగా ఉంటున్నాడని తెలుస్తుంది. సమీత కూడా తన తండ్రిని పెళ్లాడటానికి రెడీగా ఉందని తెలుసుకున్న మధు, తన తల్లి కోసం ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు? ఏ విధంగా తన తండ్రిని మార్చాడు? అనేది ఈ సినిమా కథ. ఎలా చేశారంటే: ఈ చిత్రానికి హీరో నాగశౌర్య అయినా, కథాపరంగా అసలు హీరో అజయ్. తన కెరీర్లోనే చెప్పుకోదగ్గ పాత్రను ఇందులో అజయ్ చేశారు. చక్కగా అభినయించారు కూడా. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని, యుక్తవయసులోని ఆనందాలన్నింటినీ కోల్పోయిన వ్యక్తి ్రఫస్టేషన్ని చక్కగా ఆవిష్కరించారు. తన కొడుకు క్యారేజ్ తీసుకొచ్చి ఇచ్చే సన్నివేశంలో, ఇంట్లో చిన్నకొడుకుతో, బయట బ్రహ్మాజీతో వచ్చే కామెడీ, సీన్స్, హీరోయిన్ని ట్రాప్‌లోకి లాగే సన్నివేశాల్లో అజయ్ నటన అభినందనీయంగా ఉంది. అయితే... కేవలం తన అభినయం వల్లే పండాల్సిన పతాక సన్నివేశంలోనే అజయ్ నటన తేలిపోయింది. కొడుకుని కంటిముందే కొడుతుంటే తండ్రిగా స్పందించాల్సినంత స్పందించలేదు. పశ్చాత్తాపాన్ని కూడా సరిగ్గా పలికించలేదనే చెప్పాలి. దర్శకుడు ఈ విషయంలో కాస్త జాగ్రత్తపడితే బాగుండేది. తల్లి బాగుకోసం పరితపిస్తూ, తండ్రికి బుద్ధి చెప్పే పాత్రలో నాగశౌర్య చక్కగా ఇమిడిపోయాడు. తన పాత్రకు అన్ని విధాలుగా న్యాయం చేశాడు. తప్పకుండా తన కెరీర్‌కి ఈ సినిమా మంచి మలుపనే చెప్పాలి. కథానాయిక సనా మక్బూల్ అందానికీ, అభినయానికీ ఆస్కారమున్న పాత్ర చేసింది. చాలాకాలం తర్వాత వెండితెరపై మెరిసిన ఇంద్రజ తల్లి పాత్రలో భళా అనిపించారు. బ్రహ్మాజీ చక్కని వినోదాన్ని పంచారు. ఎలా తీశారంటే: దర్శకుడు త్రికోటి తొలి సినిమాకే మంచి మార్కులు సొంతం చేసుకున్నారు. ప్రత్యేకమైన కామెడీ ట్రాక్‌ల జోలికి పోకుండా, ఒక భిన్నమైన కథను ఎంచుకొని, అందులోనే కావల్సినంత వినోదాన్ని నింపి సమర్థవంతంగా ప్రేక్షకులకు అందించారు. ప్రేమ, బంధాలు, భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించారు. కథనం కాస్త నిదానించినా... ఎక్కడా ప్రేక్షకులకు విసుగు రాకుండా జాగ్రత్త పడ్డారు. రాజశేఖర్ కెమెరా పనితనం బాగుంది. సంభాషణలు కూడా అశ్లీలత లేకుండా డీసెంట్‌గా ఉన్నాయి. ఇక ఇందులో సాంకేతిక నిపుణులందరూ ఓ ఎత్తు అయితే, కీరవాణి సంగీతం మరో ఎత్తు. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయిలో నిలబెట్టారాయన. కీలక సన్నివేశాల్లోనూ, ఇంటర్వెల్ బ్యాంగ్‌లోనూ వచ్చే రీ-రికార్డింగ్ కథలోని ఉత్కంఠను ప్రతిబింబిస్తుంది. బలాలు: కథ నటీనటుల అభినయం దర్శకత్వం, ముఖ్యంగా కీరవాణి సంగీతం బలహీనత: నిదానించిన కథనం. తారాగణం: నాగశౌర్య, సనా మక్బూల్,అజయ్, ఇంద్రజ, బ్రహ్మాజీ తదితరులు దర్శకుడు: త్రికోటి, సంగీతం: కీరవాణి, నిర్మాత: రజనీ కొర్రపాటి. -
10న వస్తున్న 'దిక్కులు చూడకు రామయ్య'
నాగ శౌర్య, సనా ముక్బుల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం దిక్కులు చూడకు రామయ్య. ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించారు. మంచి కథతో రోమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో పలువురు ప్రముఖులు వెల్లడించిన సంగతి తెలిసిందే. కోర్రపాటి సాయి నిర్మాతగా వరాహి చలన చిత్రం బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. మరో విశేషం ఏమిటంటే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా ఈ చిత్రంలోని పాటలను రచించారు. ఈ చిత్రంలో అజయ్, ఇంద్రజా కూడా నటించారు. -
‘దిక్కులు చూడకు రామయ్య’ ఆడియో
-
రాజమౌళిని ఒరే పొట్టోడా...
ప్రముఖ దర్శకుడు రాజమౌళిని పొట్టోడా అని పిలిచే గట్స్ ఎవరికైనా ఉన్నాయా?... అవును ఉన్నాయట... అయితే అది ఒకప్పుటి మాట. ఇప్పుడు మాత్రం మౌళి గారూ అంటూ గౌరవంగా పిలుస్తాడు. ఈ విషయాన్ని రాజమౌళే స్వయంగా 'దిక్కులు చూడకు రామయ్య' ఆడియో వేడుకలో చెప్పారు. ఆ చిత్ర దర్శకుడు త్రికోటి గురించి రాజమౌళి డిటైల్డ్‌గా వివరించారు. దర్శకుడు క్రాంతికుమార్ దగ్గర తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసేవాడినని, అక్కడ కోటి తనకన్నాసీనియర్ అని చెప్పారు. కోటి సినిమా పిచ్చోడని... సాధారణంగా కాస్త ఎక్కువ సినిమాలు చూసేవాడినే సినిమా పిచ్చోడు అంటాం గానీ, కోటి లాంటి సినిమా పిచ్చోడిని తన జీవితంలో చూడలేదని చెప్పారు. చేతిలో డబ్బులున్నా లేకపోయినా... తినడానికి తిండి లేకున్నా కోటి సినిమా చూడాల్సిందే. పది రూపాయలు చేతిలో ఉంటే మనం ఆకలిగా ఉంటే ఏదైనా తింటామని, అయితే కోటి మాత్రం ఎంత దూరమైనా నడిచి వెళ్లి ప్రతిరోజూ సెకండ్ షో చూస్తాడన్నారు. హైదారాబాద్‌లో షూటింగ్ అయిపోయిన తర్వాత... అమీర్‌పేటలోని శేష్‌మహల్ థియేటర్లో పాత సినిమాలకు ఇద్దరం వెళ్లేవాళ్లమని చెప్పారు. సినిమా చూసి తిరిగి వస్తూ ఒరే పొట్టోడా ఆ సినిమాలో.... ఆ సీను... అనేవాడని... తాను హైట్‌గా ఉన్నా పొట్టోడా అని ఎందుకు పిలుస్తున్నారని అడిగితే... పొట్టోడా అంటే చిన్నోడురా... అని కోటి చెప్పారట. తనకు సీనియర్‌గా ఉన్నప్పుడు ఏరా, ఒరే, పొట్టోడా అని పిలిచినా, తన దగ్గర అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసేందుకు వస్తానన్నప్పుడు... ఏ మౌళీ... ఏ మౌళీ అని పిలిచేవాడని... సీన్ కట్ చేస్తే ఇప్పుడు సార్ అని పిలుస్తున్నాడని రాజమౌళి చెప్పాడు. కోటి సీనియర్, తాను జూనియర్ని అంటూ జక్కన్న తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పారు. త్రికోటికి ఐదుసార్లు దర్శకుడిగా చేసే అవకాశం వచ్చి చివరి నిమిషంలో చేజారిపోయినా నిరుత్సాహపడలేదని.... ఇప్పటికీ అదే ఉత్సాహంతో ఉన్నాడని రాజమౌళి తెలిపారు. కోటి పెద్ద దర్శకుడు కావాలని, దిక్కులు చూడకు రామయ్యా చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.