జువ్వ మూవీ స్టిల్
టైటిల్ : జువ్వ
జానర్ : కమర్షియల్ ఎంటర్‌టైనర్
తారాగణం : రంజిత్, పాలక్ లల్వాని, అర్జున్, పోసాని కృష్ణమురళీ, మురళీశర్మ
సంగీతం : ఎమ్.ఎమ్. కీరవాణి
దర్శకత్వం : త్రికోటి.పి
నిర్మాత : డా. భరత్ సోమి
నువ్వు నేను ఒకటవుదాం సినిమాతో హీరోగా పరిచయం అయిన రంజిత్ సోమి, లాంగ్ గ్యాప్ తరువాత హీరోగా నటించిన సినిమా జువ్వ. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన త్రికోటి రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమాలో పాలక్ లల్వాణీ హీరోయిన్‌గా నటించింది. రంజిత్ అన్న భరత్ నిర్మాణంలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన జువ్వ.. రంజిత్‌ను హీరోగా నిలబెట్టిందా..? త్రికోటికి దర్శకుడిగా సక్సెస్ అందించిందా..?
కథ :
14 ఏళ్ల వయసులో బసవరాజు పాటిల్ (మలయాళ నటుడు అర్జున్) తన క్లాస్‌మేట్ శృతి(పాలక్ లల్వాణి)ని ప్రేమిస్తున్నాని వేధిస్తాడు. తప్పని మందలించిన స్కూల్ ప్రిన్సిపల్‌ను చంపేస్తాడు. ఈ కేసులో బసవరాజుకు 14 ఏళ్ల శిక్ష పడుతుంది. జైలుకు వెళ్లేప్పుడు కూడా శృతితో నీ కోసం తిరిగొస్తా అనటంతో శృతి కుటుంబం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేస్తుంది. తన పేరును కూడా ఆధ్యగా మార్చుకొని ప్రశాంతంగా ఉంటుంది. రానా జనాలను మోసం చేస్తూ డబ్బులు సంపాందించే అల్లరి కుర్రాడు. (సాక్షి రివ్యూస్) ఆధ్యను చూసిన రానా తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెకు దగ్గరయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అదే సమయంలో 14 ఏళ్ల తరువాత జైలు నుంచి విడుదలైన బసవరాజు శృతి కోసం వెతుకుతున్నాడని తెలిసి ఆమెకు సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. రానా... బసవరాజు నుంచి శృతిని ఎలా కాపాడాడు..? ఈ ప్రయత్నంలో రానాకు ఎవరెవరు సాయం చేశారు..? చివరకు బసవరాజు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
హీరోగా నటించిన రంజిత్ తొలి సినిమాతో పోలిస్తే మంచి పరిణతి చూపించాడు. ఫైట్స్, డ్యాన్స్‌లలో మంచి ఈజ్ చూపించాడు. హీరోయిన్‌గా పాలక్ లల్వాణీ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. విలన్‌గా కనిపించిన మలయాళ నటుడు అర్జున్ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. (సాక్షి రివ్యూస్) సైకో ప్రేమికుడి పాత్రలో అర్జున్ పర్ఫెక్ట్‌గా సరిపోయాడు. ఫస్ట్‌హాఫ్ లో సప్తగిరి, భద్రం నవ్వించే ప్రయత్నం చేశారు. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళీ, మురళీశర్మ, సన, అలీ తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ :
రంజిత్‌ను హీరోగా రీ లాంచ్ చేసేందుకు దర్శకుడు త్రికోటి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నాడు. రత్నం అందించిన కథ ఆకట్టుకునేలా ఉన్నా.. దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కిచటంలో దర్శకుడు తడబడ్డాడు. తొలి భాగం అంతా హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి కేటాయించిన దర్శకుడు ఇంటర్వెల్ సమయానికి గానీ అసలు కథలోకి ఎంటర్ కాలేదు. ద్వితీయార్థంలో హీరో, విలన్‌ల మధ్య జరిగే సన్నివేశాలను ఆసక్తికరంగా రూపొందించాడు.(సాక్షి రివ్యూస్) సీనియర్ సంగీత దర్శకుడు కీరవాణి నిరాశపరిచాడు. పాటలు పరవాలేదనిపించినా కీరవాణి స్థాయిలో మాత్రం లేవు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాత భరత్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు.
ప్లస్ పాయింట్స్ :
కథ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
రొటీన్ టేకింగ్
- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment