‘అమ్మ’ నిర్ణయం.. హీరో వెనకడుగు | Dileep Says Not Return To AMMA Till Innocence Proved | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 29 2018 12:04 PM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

Dileep Says Not Return To AMMA Till Innocence Proved - Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ నిర్ణయంపై మహిళా లోకం భగ్గుమంది. నటి భావనపై లైంగిక దాడి కేసులో హీరో దిలీప్‌ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అతనిపై నిషేధం ఎత్తేస్తూ అసోసియేషన్‌ ఆఫ్‌ మళయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ) తీసుకున్న నిర్ణయం హీరోయిన్లలో ఆగ్రహం రగిల్చింది. బాధిత నటి భావనతోపాటు రిమా కలింగల్‌, రమ్య నంబిసన్‌, గీత్‌ మోహన్‌దాస్‌లు కూడా అమ్మకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం కేరళను షేక్‌ చేసేసింది. 

ఈ నేపథ్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌(డబ్ల్యూసీసీ) తరపున నటీమణులు రేవతి, పార్వతి, పద్మప్రియాలు అమ్మను కోరారు.  దిలీప్‌కు తిరిగి అమ్మ సభ్యత్వం ఇవ్వటంపై సమీక్షించాలని కోరారు. దీనికితోడు పలువురు మంత్రులు కూడా అమ్మ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ పరిణాల నేపథ్యంలో తాను తిరిగి సభ్యత్వం స్వీకరించబోనని హీరో దిలీప్‌ ప్రకటించాడు. ‘ జరుగుతున్న పరిణామాలు నన్ను బాధించాయి. ఈ వ్యవహారంలో నా పేరు ఉండటం దురదృష్టకరం. ఈ కేసులో నన్ను ఇరికించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నేను తిరిగి సభ్యత్వం తీసుకోలేను. నాపై ఆరోపణలు అబద్ధమని తేలి, నా నిర్దోషిత్వం రుజువయ్యాకే నేను తిరిగి అమ్మలో అడుగుపెడతా’ అంటూ అమ్మ కార్యదర్శి ఎడవేల బాబుకు దిలీప్‌ ఓ లేఖ రాశాడు.

నటి భావన లైంగిక వేధింపుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నటుడు దిలీప్‌ను అరెస్ట్‌ చేయడంతో అమ్మ అతనిపై నిషేధం విధించింది.​ అయితే ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉండటం, పైగా సినిమాలు చేస్తుండటంతో అమ్మ(కొన్ని ఒత్తిళ్లు కూడా పని చేశాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి)  అతనిపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ నిర్ణయం కొందరు హీరోయిన్లకు మంటపుట్టించింది. దిలీప్‌ వల్ల గతంలో నేను ఎన్నో అవకాశాలు కొల్పోయాను.. కానీ అమ్మ​ ఏం చేయలేకపోయిందని భావన విమర్శించగా.. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మలో కొనసాగడం అనవసరమంటూ మరో నటి రిమా ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement