కె.వి.ఆర్. మహేంద్ర
‘‘నిశీధి’ అనే షార్ట్ ఫిల్మ్ తర్వాత మూడేళ్లు ఏ పనీ చేయకుండా ‘దొరసాని’ కథ రాశాను. దాదాపు 42 వెర్షన్స్ రాశాను. ఈ స్టోరీ వరల్డ్‌ను అర్థం చేసుకోవడానికి, బుక్స్ చదవడానికి దాదాపు ఎనిమిది నెలలు పట్టింది. కథకు ఉన్న బలం వల్లే నేడు ‘దొరసాని’ సినిమా విడుదలవుతోంది’’ అని దర్శకుడు కె.వి.ఆర్. మహేంద్ర అన్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ‘దొరసాని’ సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా కె.వి.ఆర్. మహేంద్ర మాట్లాడుతూ– ‘‘మాది వరంగల్ జిల్లాలోని జయగిరి. అందరిలాగే ఎన్నో సినిమా కష్టాలు పడ్డాను. నేను చేసిన ‘నిశీధి’ షార్ట్ ఫిల్మ్ చూసి, నా దర్శకత్వాన్ని ప్రశంసిస్తూ ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనెగల్‌గారు నాకు మెయిల్ చేశారు. దాంతో నా మీద నాకు నమ్మకం పెరిగింది. కొత్తగా చేయాలనే ఉద్దేశంతో ఇలా ‘దొరసాని’ సినిమాతో మీ ముందుకు వచ్చాను. రెండు గంటల పదిహేను నిమిషాలు మా సినిమాతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళతాం.
ఆ రోజుల్లో దొర వ్యవస్థ, పరిస్థితులకు ఓ అందమైన ప్రేమకథని జోడించాం. కథ, కథలోని స్వచ్ఛత, నిజాయతీ అందరికీ నచ్చుతుంది. రాజు పాత్రకి ఆనంద్, దొరసాని పాత్రకి శివాత్మిక చక్కగా సరిపోయారు. శివాత్మికలో నిజంగానే దొరసాని ఉంది. ‘నీ తర్వాతి సినిమా నాతోనే చెయ్యాలి’ అని రాజశేఖర్‌గారు ఇప్పటికే చాలాసార్లు నవ్వుతూ అడిగారు. ‘ఓ కథ ఉంటే చెప్పు’ అని విజయ్ దేవరకొండగారు కూడా అడిగారు. ‘దొరసాని’ రిలీజ్ అయ్యాక నా తర్వాతి సినిమా డిసైడ్ అవుతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment