ఆర్. రాజ్
‘‘ఒక సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఆ సినిమాకు స్టార్ ప్రొడ్యూసరైనా, స్టార్ డైరెక్టరైనా లేదా స్టార్ హీరో అయినా ఉండాలి. ఇవేవీ లేకపోయినా కథలో ఉన్న పవర్ వల్లే ‘మల్లేశం’ సినిమా గురించి అందరూ చర్చించుకుంటున్నారు’’ అని దర్శక–నిర్మాత ఆర్. రాజ్ అన్నారు. పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ఆర్. రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మల్లేశం’. నటుడు ప్రియదర్శి ‘మల్లేశం’ పాత్రలో నటించారు. శ్రీ అధికారి, రాజ్. ఆర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఆర్. రాజ్ మాట్లాడుతూ – ‘‘సినిమాలపై ఆసక్తితో పదకొండేళ్ల క్రితం తమిళంలో ‘సిల నేరంగళిల్’ అనే సినిమాను నిర్మించా.
మళ్లీ ఇప్పుడు ‘మల్లేశం’ సినిమాకు దర్శక–నిర్మాతగా వ్యవహరించాను. రెండున్నరేళ్ల క్రితం ‘మల్లేశం’గారి టెక్ టాక్ వీడియోను చూసి ఇన్‌స్పైర్ అయ్యి. సినిమాగా తీయాలనుకున్నాను. ఈ సినిమా ఎవరూ చూడరు అని కొందరు అభిప్రాయపడ్డారు. అందుకే నేనే నిర్మించాలనుకున్నాను. ఆ తర్వాత కథ కోసం నాలుగు వెర్షన్స్ రెడీ అయ్యాయి. చివరికి నా కథ మల్లేశంగారికి నచ్చడంతో ఈ సినిమాకు కథ కూడా నాదే అయ్యింది. ఒకదశలో ఈ సినిమాకు తరుణ్ భాస్కర్‌ను దర్శకుడిగా అనుకున్నమాట వాస్తవమే. కానీ నా విజన్ వేరుగా ఉంటుంది కదా అని నేనే చేద్దామనుకున్నా. ఇలా ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నిర్మాతగా చేశాను.
► మల్లేశంగారి పాత్రలో నాని, శర్వానంద్ ఇలా కొందరిని ఊహించుకున్నాను. కానీ వారి డేట్స్ దొరకవని అర్థమైంది. ఆ తర్వాత ప్రియదర్శిని తీసుకున్నాం. చాలా బాగా చేశాడు. నిజానికి ప్రియదర్శినిలో మంచి యాక్టింగ్ షేడ్స్ ఉన్నాయి. ఇక అనన్యను నేను అసలు హీరోయిన్‌గా అనుకోలేదు. కాకపోతే ఆ అమ్మాయి ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేసి వచ్చి, ఈ రోల్ కోసం ప్రిపేర్ అవుతాను అని చెప్పింది. పద్మ పాత్రలో అనన్య బాగా చేసింది. ఝాన్సీ బాగా నటించారు.
► అక్షయ్ కుమార్ ‘ప్యాడ్‌మ్యాన్’ (తమిళనాడుకు చెందిన అరుణాచలం మురుగనాథన్ బయోపిక్) సినిమా రిలీజ్ టైమ్‌లో కాస్త టెన్షన్ పడ్డాను. ‘ప్యాడ్‌మ్యాన్, మల్లేశం’ ఈ రెండు సినిమాల్లోని హీరోల జర్నీ ఒకేలా ఉంటుంది కదా అనుకుని ‘మల్లేశం’ కథను రాయడం మానేశాను. ఆ తర్వాత ‘ప్యాడ్‌మన్’ సినిమా చూసి నా విజన్ వేరుగా ఉంది కదా అని మళ్లీ సినిమాను స్టార్ట్ చేశాను. ఈ సినిమాను మల్లేశంగారు చూశారు. అక్కడక్కడ కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం. సినిమా చూసినప్పుడు ఆయన కూతురు కన్నీరు పెట్టుకున్నారు.
► నా సినిమాలోని నటీనటుల గౌరవానికి నా వంతు బాధ్యత వహించాలనుకుంటాను. అందుకే కాంట్రాక్ట్‌లో సెక్సువల్ హెరాస్‌మెంట్ గురించి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాను. ఎవరి కారణంగా అయినా హీరోయిన్ సినిమా నుంచి తప్పుకున్నట్లయితే.. ఆ హీరోయిన్‌కి ఇచ్చిన రెమ్యునరేషన్, కొత్త హీరోయిన్ ఖర్చులను సదరు వ్యక్తే భరించాలనేది ఆ నిబంధనల్లో ఒకటి.
Comments
Please login to add a commentAdd a comment