
నాయుడుగారుంటే ఆనందపడేవారు!
‘‘మా పిల్లలు ఓపెన్‌గా మాట్లాడతారు. ‘ఈ కథ తీస్తున్నావా? ఫ్లాపేలే! నువ్వెళ్లి వాళ్లతో సినిమా తీయొచ్చుగా’ అంటుంటారు. ‘మీరేమో ఇక్కడ కూర్చుని చెబుతారు. వాళ్లు డేట్స్ ఇవ్వరు. ఒక్క హిట్ సాధించాలి’ అనేవాణ్ణి. ఈ ట్రైలర్ విడుదలకు ముందు నేనొస్తుంటే కొందరు లోపలకు వెళ్లి తలుపులు వేసుకునేవారు. ఇప్పుడు ఎదురొచ్చి ‘ట్రైలర్ బాగుంది. కంగ్రాట్స్’ అంటుంటే... ‘ఇదేదో ఆడే సిన్మాలా ఉంది’ అనుకున్నా. మా పిల్లలూ ‘హిట్’ అంటున్నారు’’ అన్నారు తేజ. రానా, కాజల్ అగర్వాల్ జంటగా ఆయన దర్శకత్వంలో డి. సురేశ్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్ చౌదరిలు నిర్మించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. తేజ చెప్పిన సంగతులు...
♦ నేను, మా ఫ్యామిలీ పొలిటికల్ సిన్మాలకు వెళ్లం. నేను వెళ్లనప్పుడు అలాంటి సినిమా ఎందుకు తీస్తా? ట్రైలర్, అందులో డైలాగులను చూసి పొలిటికల్ థ్రిల్లర్ అనుకుంటున్నారు గానీ... ఇందులో మసాలాలన్నీ ఉన్నాయి. రాజకీయాలు పది శాతమే ఉన్నాయి. రాజకీయ నేపథ్యంలో తీసిన భార్యాభర్తల కథే ఈ సిన్మా. కమర్షియల్ మీటర్‌లో ఆర్ట్ ఫిల్మ్‌గా తీశా.
♦ ఈ సిన్మాలో జోగేంద్ర అనే వ్యక్తి ఐదేళ్ల జీవిత కథను, అందులో మంచి–చెడు, దేశానికి బాగు చేసే, చేటు చేసే పనులు... అన్నీ చూపించా. రేపు మనం ఈ సీన్ చేస్తున్నామని రానాకి చెబితే, మర్నాడు క్యారెక్టర్‌కు కావల్సిన మూడ్‌లో సెట్‌కి వచ్చేవాడు. చాలామంది ‘నాకు నటన బాగా వచ్చు. నేను సూపర్ స్టార్’ అన్నట్టు సెట్‌కి వస్తారు, అదే ఫీల్‌తో చేస్తారు. రానా అలా కాదు. పాత్రకు తగ్గట్టు మారతాడు.
♦ నేను దర్శకుడిగా ఫెయిల్ అయ్యానో? లేదో? కానీ... కథకుడిగా కొన్నిసార్లు ఫెయిలయ్యా! ఈసారి కథ బలంగా ఉండాలనుకున్నా. ఈ కథను రాజశేఖర్‌గారితో ‘అహం’గా తీయాలనుకున్నా.
♦ వర్కౌట్ కాలేదు. కథకు న్యాయం చేయాలేనేమోనని వెనక్కి వచ్చేశా. తర్వాత సురేశ్‌బాబుతో కూర్చున్నాక రానాకు సూట్ అయ్యేలా కథలో మంచి మార్పులు జరిగాయి. నాకు పర్‌ఫెక్ట్ ప్రొడ్యూసర్ ఆయన. నేను అనుకున్న లెవల్ కంటే సినిమా బాగా రావడానికి ఆయనే కారణం. ట్రైలర్ బాగుందని షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్లలో కొందరు ‘సురేశ్‌బాబు బాగుందని చెప్పారంటే తప్పకుండా బాగుంటుంది’ అంటున్నారు.
♦ మద్రాస్‌లో సురేశ్ ప్రొడక్షన్స్ ఆఫీసు వెనుక అవుట్ హౌస్‌లో మా ఫ్యామిలీ ఉండేది. నేను స్కూల్‌కి వెళుతూ, వస్తూ గోడపై పోస్టర్లలో రామానాయుడిగారి పేరు చూస్తుండేవాణ్ణి. ఇప్పుడు సురేశ్ సంస్థలో సినిమా చేయడం హ్యాపీ. నాయుడుగారుంటే ఆయన మనవడితో మంచి సినిమా తీసినందుకు సంతోషపడేవారు. రష్ చూసి రానాతో ‘మీ తాతగారు ఉండుంటే బాగుండేది’ అన్నాను.
♦ ‘‘ఆరో తరగతి, ఏడో తరగతి పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేశారు. దీన్ని సహించకూడదు. చిన్న పిల్లలను కాపాడండి. వాళ్లే ఫ్యూచర్ సిటిజన్స్’’ అన్నారు తేజ. డ్రగ్స్ అంశంలో సినీ ప్రముఖుల పేర్లు రావడం సినిమాలపై ప్రభావం చూపిస్తుందా? అని తేజను అడగ్గా... ‘‘కథ బాగుంటే ప్రేక్షకులు చూస్తారు. అన్నా హజారే గొప్ప వ్యక్తి. ఆయన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే చూస్తారా? చూడరు! ఫలానా వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నాడనేది అనవసరం. సినిమా బాగుంటే చూస్తారు. వ్యక్తిగత అభిరుచులు, అభిప్రాయాలతో మనం (ప్రేక్షకులు) కనెక్ట్ అవ్వం’’ అన్నారు.