ఈ ప్రశ్నలకు జవాబులు...అందులో ఉంటాయి
‘13బి’ నుంచి ‘మనం’ వరకూ నేను చేసిన సినిమాలన్నీ విభిన్న కథాంశాలతో తీసినవే. నాకు రాయడమంటే ఇష్టం. అందుకే డిఫరెంట్ జానర్స్ ఎంచుకుంటూ వస్తున్నా. ఆరు నుంచి ఏడు నెలల వరకూ స్క్రిప్ట్ వర్క్ చేస్తాను. ‘24’ సినిమా స్క్రిప్ట్‌కు ఏకంగా నాలుగేళ్లు కేటాయించా’’ అని విక్రమ్‌కుమార్ అన్నారు. సూర్య హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘24’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్‌కు మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని విక్రమ్‌కుమార్ అన్నారు. ఆయన పంచుకున్న మరిన్ని విశేషాలు...
‘24’లో ప్రతి సీన్ టైమ్‌తో ముడిపడి ఉంటుంది. చాలా టైమ్ తీసుకుని, ప్రతి సీన్‌ను తీర్చిదిద్దా. ఇలాంటి కథాంశాలు హాలీవుడ్‌లో చాలా వచ్చాయి. కానీ నాకు మనదైన సినిమా కావాలి. అదీ అందరికీ కనెక్ట్ అయ్యేలా తీయాలి. ప్రతి సీన్‌ను ఎంజాయ్ చేస్తూ రాశాను. ఏ సినిమా తీసినా దానికి మనదైన హంగులు అద్ది తీయడమంటే ఇష్టం. ఇప్పుడీ సినిమా పిల్లలకు తెగ నచ్చేసింది.
ఈ సినిమా చూసిన వాళ్లందరూ ఇంత క్లిష్టమైన కాన్సెప్ట్‌ను అంత సింపుల్‌గా ఎలా చెప్పగలిగారు అని అడిగారు. తెలుగులో ‘ఆదిత్య 369’ సినిమా టైమ్ మెషీన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిందని తెలిసింది. చాలా ఏళ్ల క్రితమే ఇలాంటి జానర్‌లో సినిమా తీశారంటే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగారికి హ్యాట్సాఫ్. త్వరలోనే ఆ సినిమా చూస్తా.
‘24’ కథను కొంత మంది స్టార్ హీరోలకు వినిపించా. ఈలోగా నాకు సూర్య దగ్గర నుంచి పిలుపు వచ్చింది. అప్పటికే ఆయన చాలా సినిమాల్లో డబుల్ రోల్స్ చేసి విసిగిపోయారు. ఈ సినిమాలో మూడో క్యారెక్టర్ ఆత్రేయ గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యారు. కథ విన్న నాలుగన్నర గంటల తర్వాత ఆయన ఈ చిత్రానికి ఓకే చెప్పేశారు.
ఈ సినిమా మేకింగ్ సరదాగా గడిచిపోయింది. కొంతమంది సినిమా నిడివి ఎక్కువైందంటున్నారు. అయినా రెండున్నర గంటల్లో ఒక కథను చూపించడమనేది అసాధ్యం. నాకెందుకో ఆ పద్ధతి నచ్చదు. ఎంత సేపు సినిమా ఉందని కాదు, ఎంత బాగా తీశామన్నది ముఖ్యం. అందుకే ఈ చిత్రం ప్రీక్వెల్‌కు స్క్రిప్ట్ రాస్తున్నా. ఎందుకంటే ‘24‘లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఆ జవాబు ప్రీక్వెల్లో ఉంటుంది.
అల్లు అర్జున్, మహేశ్ లకు కథలు వినిపించా. అల్లు అర్జున్ సినిమా తర్వాత మహేశ్‌తో చేస్తా. ఆ తర్వాత ‘24’ ప్రీక్వెల్ సూర్య నిర్మాణంలో ఉంటుంది.