'24 కథను ఆరేళ్లుగా నా దగ్గర పెట్టుకున్న'
చెన్నై: 'ప్రతి కథకు ఒక తలరాత ఉంటుంది. ఈ కథ నేను నా దగ్గర దాదాపు ఆరేళ్లు పెట్టుకున్నాను. చివరకు సూర్యాతో సినిమా పూర్తయింది. ఈ విషయం చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సూర్యాతో ఈ సినిమా చేయడం నిజంగా ఓ దైవ నిర్ణయం. చిత్ర నిర్మాణం పూర్తయిన '24' సినిమాను చూసిన తర్వాత నేను చెప్తున్నాను. ఈ సినిమాను ఒక్క సూర్య మాత్రమే చేయగలడు మరింకెవరూ చేయలేరని. ఒక వేళ అలా చేసినా ఇప్పుడు ఉన్న సినిమాలాగా మాత్రం ఉండదు' అని 24 చిత్ర దర్శకుడు మనం ఫేమ్ విక్రమ్ కుమార్ అన్నారు.
శుక్రవారం విడుదలకానున్న ఈ చిత్రానికి, చిత్ర హీరో సూర్యకు సంబంధించిన వివరాలు తెలిపారు. తానెప్పుడు సైన్స్ ఫిక్షన్ చిత్రాలు చేయడానికి ఇష్టపడతానని, కాలంలో ప్రయాణించడమనేది చాలా ఉత్సాహాన్ని ఇచ్చే అంశం అని, వీటిపై పనిచేసేందుకు తాను ఇష్టపడతానని చెప్పారు.
'మనుషులుగా మనమంతా కాలంలో ప్రయాణించేవాళ్లం. దేవుడు మనకు ఎన్నో అద్భుతాలు చేయగలిగే సామర్థ్యాన్ని ఇచ్చాడుగానీ, కాలాన్ని నియంత్రించే శక్తినివ్వలేదు. తాము తీసుకున్న కరడుగట్టిన నిర్ణయాలను పునరుద్ధరించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఒకసారి గతంలోకి వెళితే బాగుండు అని అనుకుంటారు' అని విక్రమ్ చెప్పారు. తాను తీసిన 24 అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదన్నారు. ఆరేళ్ల పిల్లాడికి కూడా ఈ సినిమా అర్థం అవుతుందని, ప్రతి క్లిష్టమైన అంశాన్ని సంశ్లిష్టం చేశామని చెప్పారు.