సాక్షి, హైదరాబాద్: దర్శక దిగ్గజం, నిర్మాత, నటుడు డాక్టర్ దాసరి నారాయణరావు 71వ జయంతి నేడు(మే 4). ఆ దివంగత దిగ్గజానికి నివాళిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అరుదైన గౌరవాన్ని అందించింది. ఆయన జయంతిని డైరెక్టర్స్ డేగా ప్రకటించింది. భౌతికంగా ఆయన దూరమైనా.. ఆయన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఈ సందర్భంగా ప్రకటించింది.
దాసరి జయంతి వేడుకలను నేడు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్‌లో నిర్వహించనున్నారు. ఇక పలువురు దర్శకులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ తమ సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు భీష్మాచార్యుడు, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ద్రోణాచార్యుడు , సినిమా ఇంటికి పెద్ద, దాసరి నారాయణ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఆయన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి అని.. ఇండస్ట్రీలో ఎందరికో మార్గదర్శి అని దర్శకుడు శీనువైట్ల పేర్కొన్నారు. ‘అందరం ఇక్కడే ఉన్నాం. కానీ ఆయనలేరు. దాసరి నారాయణ రావు గారు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది అని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. ఈ వేడుకలో భాగస్వామి అవుతున్నందుకు గర్వంగా ఉందని దర్శకులు హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, సంపత్ నందిలు ట్వీట్లు చేశారు. దర్శకరత్న , ఆదర్శమూర్తి , సినీపరిశ్రమలో పెద్దాయన అన్న పిలుపుకు న్యాయం చేసిన మా పెద్ద దిక్కు , కీర్తిశేషులు దాసరి నారాయణరావు గారికి జన్మదిన నివాళులు అర్పిస్తూ .. ఈరోజు దర్శకుల రోజుగా ప్రకటించడం గొప్ప ఆలోచన అని కోన వెంకట్ తెలిపారు. హీరో మంచు మనోజ్, నటి మంచు లక్ష్మీ దాసరితో తమ అనుబంధం గుర్తు చేసుకుంటూ ట్వీటర్‌లో పోస్టులు చేశారు.
ఇక ఈ ఉదయం దాసరి ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరగ్గా, దాసరి టాలెంట్ అకాడమి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని అభిమాన సంఘాలు ప్రకటించాయి. మరోవైపు ఫిల్మ్ నగర్ సోసైటీ కాంప్లెక్స్‌లో సాయంత్రం దాసరి నారాయణరావు విగ్రహావిష్కారణ కార్యక్రమం జరగనుంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నటశేఖర కృష్ణ, విజయనిర్మలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment