భారతీయ సంతతి కుర్రాడితో మళ్ళీ ‘జంగిల్ బుక్’
నటన అంటే ఏమిటో కూడా తెలియని ఈ పదేళ్ళ పిల్లాడు త్వరలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. వాల్ట్ డిస్నీ సంస్థ తీయనున్న ‘ది జంగిల్ బుక్’లో ప్రధాన పాత్ర మోగ్లీగా నటించే బంగారు అవకాశం న్యూయార్క్‌లో జన్మించిన భారతీయ - అమెరికన్ అయిన నీల్ సేథీని వరించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని వెతికాం. న్యూయార్క్ నుంచి న్యూజిలాండ్ వరకు, లండన్ నుంచి కెనడా వరకు, అమెరికా, భారతదేశం... మూలమూలలా వెదికిన తర్వాత పదేళ్ళ నీల్ సేథీని ఏకగ్రీవంగా ఎంపిక చేశాం’’ అని దర్శకుడు జాన్ ఫేవ్రౌ తెలిపారు. అడవిలోని జంతువులు పెంచి పెద్ద చేసిన ఓ పసివాడి కథగా రుడ్యార్డ్ కిప్లింగ్ ప్రసిద్ధ రచన ‘ది జంగిల్ బుక్’ సుప్రసిద్ధం.
ఈ కథ గతంలో యానిమేషన్ రూపంలో అలరించింది. కాగా, ఇప్పుడు లైవ్ - యాక్షన్, యానిమేషన్‌ల సమ్మిళిత రూపంగా 3డిలో ఈ సినిమా తీయనున్నారు. ఈ చిత్రంలో సేథీ ఒక్కడే మౌగ్లీగా నటిస్తున్నాడు. అతణ్ణి పెంచే అడవి జంతువుల పాత్రలన్నీ యానిమేషన్, గ్రాఫిక్సే. ఈ పాత్రలకు బెన్ కింగ్‌స్లే లాంటి ప్రసిద్ధులు గాత్రదానం చేయనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఒక సినిమా సక్సెస్ కావాలంటే నటీనటుల ఎంపిక బాగుండాలి. మోగ్లీ పాత్రకు సరిగ్గా సూటయ్యే కుర్రాడు దొరికాడు. నీల్ సేథీలో ప్రతిభ, ఆకర్షణ రెండూ ఉన్నాయి’’ అన్నారు దర్శకుడు. మరి, ఈ భారతీయ సంతతి కుర్రాడు రేపు తెరపై ఎంతగా ఆకట్టుకుంటాడో చూడాలి.