చెన్నై : అలాంటివి చేయను. చూడను అంటోంది నటి తమన్నా. ఇంతకీ ఈ అమ్మడు చెప్పేదేంటో చూద్దామా! సినిమాలో దశాబ్దన్నర అనుభవం ఈ మిల్కీబ్యూటీది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు అన్ని రకాల పాత్రల్లోనూ నటించేసింది. అందాలారబోత నుంచి ఆవేశభరిత పాత్రల వరకూ అన్నీ చేసేసింది. అయితే ఇంకా సినిమాలో తాను చేయాల్సింది చాలా ఉందనే చెప్పుకుంటోంది. ముఖ్యంగా నృత్యభరిత కథా పాత్రలో నటించాలని, అంత వరకూ నటిగా తన పయనం అవిరామంగా కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చింది. అదే విధంగా అందాలను కాపాడుకోవడంలో చాలా జాగ్రత్త వహిస్తున్న తమన్నా నిత్యం కసరత్తులను చేయడంలో మాత్రం బద్దకించదట. నటిగా గత ఏడాది కూడా నాలుగు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి ఈ ఏడాది అవకాశాలు తగ్గు ముఖం పట్టాయనే చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒకటి, టాలీవుడ్‌లో సిటీమార్ అనే చిత్రం మాత్రమే చేతిలో ఉన్నాయి. ఇక చాలా కాలం క్రితం నటించిన దటీజ్ మహాలక్ష్మీ చిత్రం ఇంకా విడుదలకు నోసుకోలేదు.
దక్షిణాదిలో అవకాశాల కోసం వెయిటింగ్ అంటోన్న తమన్నా.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ఒక కాలక్షేప మాధ్యమం అని పేర్కొంది. సినిమాలో ఏదైనా చెప్పండి, ఏదైనా చూపండి. అయితే ప్రేక్షకులు రెండున్నర గంటల పాటు బాహ్యప్రపంచాన్ని మరిచి సంతోషంగా ఉండాలి అని అంది. తాను ఏడిపించే చిత్రాలను చూడనని, అలాంటి చిత్రాల్లో నటించడానికి ఇష్టం ఉండదని చెప్పింది. అలాంటి చిత్రాలు చూస్తే తనలో వ్యతిరేక భావం చేరుతుందన్న భయం కలుగుతుందని అంది. దాంతో మనసు భారంగా మారుతుందని చెప్పింది. మనసు చెదిరి కన్నీళ్లు వస్తాయని అంది. అదేవిధంగా మహిళలను కించపరిచే కథా పాత్రల్లోనూ తాను నటించనని చెప్పింది. సినిమా ద్వారా తాము ఏమి నేర్చుకోకపోయినా పర్వాలేదని, అది ఉత్సాహాన్నిచ్చేదిగానూ, కష్టాలను మరచేలా ఉండాలని అంది. ఇకపోతే చిత్రాల్లో కొంచెం నీతి ఉండాలని, చెడును పెంచేవిధంగా, తెలియని వారికి చెడు విషయాలను తెలిపేవిధంగానే ఉండే చిత్రాలను చేయరాదని తమన్నా అంది. ఇంతకీ ఇదంతా ఈ జాణ ఇప్పుడెందుకు చెబుతుందో అర్థం కావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment