ప్రేమమ్ టీచర్‌కు డబుల్ చాన్స్
మలయాళ చిత్రం ప్రేమమ్ అందులో నటించిన నటులు చాలా మందికి కోలీవుడ్‌లో లైఫ్ ఇచ్చింది. ఒక్క నటి సాయిపల్లవికి మినహా. ప్రేమమ్ చిత్రంలో నటించిన మడోనా సెబాస్టియన్ తమిళంలో కాదలుమ్ కడందుపోగుం, కవన్, పా.పాండి వంటి మూడు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక మరో నటి అనుపమ పరమేశ్వరన్ ధనుష్‌కు జంటగా కొడి చిత్రంతో పాటు, తెలుగులోనూ ప్రేమమ్, శతమానంభవతి చిత్రాల్లో నటించి సక్సెస్ఫుల్ నటిగా పేరు తెచ్చుకుంది. మలయాళం చిత్రం ప్రేమమ్‌లో మలర్ టీచర్‌గా ప్రధాన నాయకిగా నటించిన నటి సాయిపల్లవి ఇంత వరకూ కోలీవుడ్‌లో ఎంట్రీ కాలేదు.
అయితే కార్తీకు జంటగా మణిరత్నం దర్శకత్వంలో కాట్రువెలియిడై చిత్రంలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది ఈ భామకు. అదే విధంగా సియాన్ విక్రమ్‌తో స్కెచ్ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. అదీ చివరి దశలో దూరం అయ్యింది. అయితే తాజాగా ఈ కేరళా కుట్టికి కోలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. ఒకటి కాదు ఏకంగా రెండు చిత్రాల్లో నటించే అవకాశాలను కొట్టేసింది సాయిపల్లవి. ఈ రెండూ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో నటించే అవకాశాలు కావడం విశేషం.
వనమగన్ చిత్రాన్ని పూర్తి చేసిన విజయ్ తాజాగా కరు అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కాగా మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ఛార్లీ చిత్రాన్ని విజయ్ తమిళంలో రీమేక్ చేయనున్నారు. ఇందులోనూ నాయకి సాయిపల్లవే అని సమాచారం.