
తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం కల్చరల్ : అమ్మ కడుపులో ఉన్నప్పుడు విన్న ఆమె గుండె చప్పుడే నా తొలి డ్రమ్ బీట్‌కు ప్రేరణ, భూమ్మీద పడ్డాక ఈ రంగంలో తన తండ్రి తొలిగురువని డ్రమ్స్ శివమణి చెప్పారు. బుధవారం గోదావరి డ్యాన్స్ అండ్ లాంటర్న్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వడానికి రాజమహేంద్రవరం వచ్చిన ఆయన మంగళవారం రాత్రి ఓ హోటల్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ‘సిరిసిరి మువ్వ’ సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభమైందని వివరించారు. జిల్లాతో ఆయనకున్న అనుబంధం, సినీ పరిశ్రమలో తనకు ప్రోత్సాహకులు, యువ సంగీత కళాకారులు అవలంబించాల్సిన మెళకువలు తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఇలా వ్యక్తపరిచారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
తమిళనాడులోని అరక్కోణంలో జన్మించాను. 1975లో నా 12వ ఏటా సినీ రంగంలోకి వచ్చా. ఎస్‌ఎస్‌ఎల్సీతో చదువు కొండెక్కింది. నా కుమారుడు కుమరన్ శివమణి తన సొంత బాణిలో వెళుతున్నాడు. నా అన్న కొడుకు నన్ను ఫాలో అవుతున్నాడు.
అందరూ గురువులే..
సినీ రంగంలో సంగీత దర్శకులు అందరూ నాకు గురువులే. ఎస్.రాజేశ్వరరావు, కేవీ మహదేవన్, పెండ్యాల, చలపతిరావు, చక్రవర్తి, రాజన్–నాగేంద్ర, బాలు సర్ నన్ను ప్రోత్సహించారు. యుగంధర్ సినిమాకు పని చేస్తున్నప్పుడు మహానటుడు ఎన్టీఆర్ నన్ను అభినందించారు. ఇప్పటి వరకూ ఎన్నో చిత్రాలు, ప్రదర్శనలు ఇచ్చాను.
తెలుగులో మాట్లాడితే కొట్టారు..
విశాఖలో తెలుగులో మాట్లాడాను. నాకు తెలియకుండానే నా స్నేహితులు చెప్పిన మేరకు అర్థం తెలియకుండా ఓ తప్పుడు పదం మాట్లాడాను. అక్కడ నన్ను ఓ వ్యక్తి కొట్టారు. తెలుగు అన్ని భాషలకంటే తీయని భాష. ఇప్పుడు ధారాళంగా మాట్లాడుతున్నా. సినిమాలో ‘ఎవరికి వారు ఈ లోకంలో.., జోరుమీదున్నావు తుమ్మెద, ‘ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను...’ నాకు నచ్చిన కొన్ని పాటలు.
ఆ రోజుల్లో...
ఆ రోజుల్లో పరిశ్రమలో అందరం ఓ కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్లం. కోడంబాక్కం స్టూడియోల్లో 18 భాషలకు సంబంధించిన సినిమా పాటల రికార్డింగ్ జరుగుతూ ఉండేది. ఎలక్ట్రానిక్ వాయిద్యాల ప్రవేశంతో సంగీత స్వరూప స్వభావాలు మారిపోతున్నాయి. ఇప్పుడు ఎవరికి వారే.
అప్పటి సైకిల్ రిక్షాలు.. గోలీ సోడాలు మాయం...
గోదావరితో ప్రత్యేక అనుబంధం ఉంది. రాజమహేంద్రవరం అనేకసార్లు వచ్చాను. గోదావరిపై ప్రత్యేక ఆల్బమ్ చేశాను. కోనసీమ సందర్శించాను. అప్పటి వాతావరణం ఇప్పుడు లేదు. రాజమహేంద్రవరం వచ్చినప్పుడు చూసిన సైకిల్ రిక్షాలు, గోలీ సోడాలు కనుమరుగయ్యాయి. గోలీ సోడా కొట్టేటప్పుడు వచ్చే శబ్దంలో మ్యూజిక్ ఉంది. అది ఇప్పుడు మిస్ అవుతున్నా.
ఆలయాలు కాదు... టాయిలెట్లు కట్టండి...
దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి చోటా కొత్తగా ఆలయాలు కడుతున్నారు. మరుగుదొడ్లు(టాయిలెట్) లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు వెంట ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి కిలోమీటర్‌కు ఒక టాయిలెట్ కట్టాలి. వాటికి ప్రముఖుల పేర్లు పెట్టి నిర్వహించాలి.
ఇగోతో ఏమీ నేర్చుకోలేరు..
సినీరంగమేకాదు ఏ రంగంలోనైనా ఇగో వదిలిపెట్టినప్పుడు ఎదగగలం. ఇఫ్ యూ ఆర్ రైట్.. యూ విల్ బీ బ్రైట్. పిల్లలు, యువత ప్రకృతిని మిస్ అవుతున్నారు. రైళ్లలో వెళుతున్నప్పుడు ఐపాడ్, ఫోన్ వాడుతున్నారు. నడుస్తున్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తి వస్తున్నారని గమనించలేనంతగా ఫోన్ వాడుతున్నారు. అవసరమైనప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో ప్రకృతిని ఆస్వాదించండి’’.