‘ద్యావుడా’ సినీ డైరెక్టర్ అరెస్ట్
హైదరాబాద్: ద్యావుడా సినిమా డైరెక్టర్ దాసరి సాయిరామ్‌ను హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సినిమాలో హిందూ దేవుళ్లపై అభ్యంతరకర సన్నివేశాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేసినందుకు గాను సాయిరామ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ రమేశ్ నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిరామ్ నగరంలోని ఫిలింనగర్‌లో నివసిస్తున్నారు. వైఎస్‌ఆర్ జిల్లా కడప నగరానికి చెందిన గజ్జల హరికుమార్‌రెడ్డి నిర్మిస్తున్న ద్యావుడా సినిమాకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
నూతన సంవత్సరం మొదటి రోజున యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా టీజర్ తీవ్ర అలజడి సృష్టించింది. అందులో హిందువుల ఆరాధ్య దైవమైన శివుడిపై అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. సాయిరామ్, హరికుమార్ రెడ్డిలపై బజరంగ్‌దళ్‌కు చెందిన యు.నవీన్ నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 4న ఫిర్యాదు చేశారు. దీంతో కుషాయిగూడ ఏసీపీ సయ్యద్ రఫీక్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ నర్సింగ్‌రావు, ఆంజనేయులు రంగంలోకి దిగి డైరెక్టర్ సాయిరామ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అభ్యంతరకర సన్నివేశాలను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు డీసీపీ తెలిపారు. కాగా హరికుమార్‌రెడ్డి పరారీలో ఉన్నారని.. త్వరలో అతడిని కూడా పట్టుకుంటామని తెలిపారు.