
డైనమైట్ హాలీవుడ్ స్టయిల్‌లో ఉంది
‘‘విష్ణు అద్భుతంగా నటించాడు. ఇంత మంచి సినిమా చేసినందుకు తనను అభినందించాలి’’ అని కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి అన్నారు. దేవా కట్టా దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన ‘డైన మైట్’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని టి. సుబ్బిరామిరెడ్డి కోసం ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ -‘‘హాలీవుడ్ స్టయిల్‌లో ఉన్న టాలీవుడ్ చిత్రంఇది. మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్. మొదట్నుంచీ చివరి వరకూ చక్కగా సస్పెన్స్ మెయిన్‌టైన్ చేశారు. ఫైట్స్ బాగా డిజైన్ చేశారు. పాటలు బాగున్నాయి’’ అన్నారు.
లవ్... యాక్షన్...
‘అనుక్షణం’, ‘రౌడీ’, ‘డైనమైట్’... ఇలా ఈ మధ్యకాలంలో మంచు విష్ణు చేసినవన్నీ సీరియస్ మూవీసే. ‘డైనమైట్’లో అయితే తక్కువ రొమాన్స్, ఎక్కువ యాక్షన్ చేశారు. అందుకే, ఈసారి లవ్, యాక్షన్ రెండూ సమపాళ్లల్లో ఉండే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండింటికీ అదనంగా వినోదం కూడా ఉంటుంది. జి. కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో డి. కుమార్, పల్లి కేశవరావు నిర్మించనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ నెల 10న జరగనుంది. ‘జాదుగాడు’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సోనారిక ఇందులో విష్ణు సరసన కథానాయికగా నటించనున్నారు. ‘‘ఇది లవ్ కమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఓ ప్రముఖ కథానాయిక కూడా ఇందులో నటిస్తారు’’ అని నిర్మాతలు తెలిపారు. బ్రహ్మానందం, రాజా రవీంద్ర, పృథ్వీ, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: విజయ్ సి. కుమార్, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఆర్ట్: రామాంజనేయులు, ఫైట్స్: విజయ్, నిర్మాణ నిర్వహణ: సోమా విజయప్రకాశ్.