
ఎన్నికల అవగాహన చిత్రంలో రజనీ?
తమిళనాడులో శాసన సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది.రాజకీయ వర్గాల్లో వాతావరణం వేడెక్కనుంది.ప్రజలకు తమకు నచ్చిన ముఖ్యంగా మంచి నేతలను ఎన్నుకునేందుకు మరో అవకాశం రాబోతోంది.సక్రమంగా ఓటు హక్కును ఉపయోగించుకుని తమ సంక్షేమంతో పాటు, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ప్రజల్లో అవగాహన కలిగించడానికి రాష్ట్ర ఎన్నికల సంస్థ పూనుకుంది.
అందులో భాగంగా పలు కార్యక్రమాలతో పాటు సినీస్టార్స్‌తో ప్రజల్లో అవగాహన కలిగించే విధంగా ప్రచార చిత్రాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే ప్రముఖ నటులు సూర్య, కార్తీ, సిద్ధార్థ్, శ్రుతిహాసన్, దీపికా పదుకునే, క్రికెట్ క్రీడాకారుడు దినేశ్ కార్తీక్, అశ్విన్ ఓటర్ల అవగాహనా ప్రచార చిత్రాల్లో నటించారు. క్రేజీ తార నయనతార నటించిన ప్రచార చిత్రం కూడా త్వరలో ప్రచారానికి సిద్ధం అవుతున్నట్లు ఎన్నికల అధికార ప్రతినిధులు వెల్లడించారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కూడా ఈ తరహా ప్రచార చిత్రంలో నటించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేశ్ లఖానీ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల అవగాహన చిత్రాల నిర్మాణం కోసం 10 లక్షలు, వాటిని సామాజిక మీడియాల్లో ప్రచారం చేయడానికి 10 లక్షలు, ఎఫ్‌ఎం.రేడియోలలో ప్రచారానికి 10 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. సాధారణంగా ఒక అవగాహన ప్రచార చిత్రాన్ని రూపొందించడానికి అతి తక్కువగా 50 వేలు అవుతుందన్నారు.అయితే ఇప్పుడు సినీ స్టార్స్, క్రికెట్ క్రీడాకారులు నటించడంలో నిర్మాణ ఖర్చు అధికం అవుతుందని ఎన్నికల అధికార ప్రతినిధులు పేర్కొన్నారు.