
‘‘118’ వంటి హిట్ చిత్రం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తోన్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ‘శత మానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వం వహిస్తున్నారు. మెహరీన్ కథానాయికగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఫిల్మ్స్ పతాకంపై ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఉమేష్ గుప్త, శివలెంక కష్ణ ప్రసాద్ మాట్లాడుతూ–‘‘మా సినిమా చాలా బాగా వస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 26 నుంచి మొదలు పెట్టిన షూటింగ్ ఈ నెల 25 వరకు ఉంటుంది. ఈ షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు.
తొర్రేడులో రూ.35 లక్షలతో భారీ జాతర సెట్ వేసి, కల్యాణ్‌రామ్, నటాషా దోషిలపై ఒక పాట చిత్రీకరించాం. పెండ్యాలలోని ఇసుక ర్యాంపుల మధ్య తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుంది. వంగలపూడి సమీపంలో గోదావరిలో 16 బోట్లతో తెరకెక్కించిన క్లైమాక్స్ అల్టిమేట్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘రాజమండ్రి పరిసరాల్లోని అందాలను మా సినిమాలో మరోసారి చూపించబోతున్నాం. అక్టోబర్ 9 నుంచి 22 వరకూ హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత నాలుగవ షెడ్యూల్‌లో కేరళ, కర్ణాటకల్లో కొన్ని ప్రధాన సన్నివేశాలను తెరకెక్కిస్తాం. దాంతో షూటింగ్ పూర్తవుతుంది’’ అని వేగేశ్న సతీష్ అన్నారు. వి.కె.నరేశ్, సుహాసిని, శరత్‌బాబు, తనికెళ్ల భరణి, పవిత్రాలోకేశ్, రాజీవ్ కనకాల, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: గోపీ సుందర్.
Comments
Please login to add a commentAdd a comment