
విజయేంద్ర పసాద్, సుకుమార్
‘ఘరానా బుల్లోడు, సమరసింహా రెడ్డి, సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, ఈగ... రీసెంట్‌గా భజరంగీ భాయిజాన్, బాహుబలి, మెర్సెల్’ వంటి విజయవంతమైన చిత్రాలకు కథలు అందించారు రచయిత విజయేంద్రప్రసాద్. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు నమోదు చేసుకున్న చిత్రాలకు కథలు అందించిన ఈ స్టార్ రైటర్ ‘రాజన్న, శ్రీవల్లి’ వంటి చిత్రాలకు దర్శకునిగా కూడా చేశారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌తో ఆయన పది సినిమాలకు కథ అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ విజయేంద్ర పసాద్‌ను సంప్రదించగా– ‘‘అవును.. నిజమే. ఈరోస్ సంస్థతో పది సినిమాలకు సంబంధించి సైన్ చేయడం జరిగింది. కథల రచన పూర్తయింది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాలు చేస్తాం. కోటి రూపాయల నుంచి వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాలు ఉంటాయి. కొత్తవాళ్లను ప్రోత్సహించాలన్నది కూడా మా ముఖ్య ఉద్దేశం. ఈ పది సినిమాల్లో కొత్తవాళ్లతో తీసే సినిమాలూ ఉంటాయి. రానున్న రెండు సంవత్సరాల్లో ఈ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది’’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. ఓ హిందీ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ పది చిత్రాల్లో ఆ సినిమా ఒకటన్నది పలువురి అభిప్రాయం. ఇదే విషయం గురించి విజయేంద్రప్రసాద్‌ని అడిగితే – ‘‘ఈరోస్‌తో సుకుమార్ సినిమా చేయనున్నది వాస్తవమే. సుకుమార్ సుముఖంగానే ఉన్నారు. అయితే ఈ పది సినిమాల్లో అది ఒకటి కాదు. వేరే సినిమా’’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment