Eros International Media Ltd.
-
కాస్తైనా సిగ్గుపడండి; మమ్మల్ని క్షమించండి!
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌కు చెందిన ఓటీటీ ఈరోస్ నౌ నెటిజన్లను క్షమాపణ కోరింది. మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. భారత్‌లోని విభిన్న సంస్కృతుల పట్ల తమకు గౌరవభావం ఉందని, తాము షేర్ చేసిన పోస్టుల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా వాటిని తక్షణమే తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఈరోస్ నౌ బృందం ఒక ప్రకటన విడుదల చేసింది. అసలేం జరిగిందంటే.. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో కొలుస్తారన్న విషయం తెలిసిందే. తొమ్మిది రకాల నైవేద్యాలు.. స్త్రోత్రాలతో దుర్గామాతను పూజిస్తారు. అలాగే ఈ నవరాత్రి ఉత్సవాల్లో నవ వర్ణాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. (చదవండి: నా ఒడి నింపే వేడుక..ఇప్పుడేంటి!?) ఆయా రోజుల్లో పసుపు, ఆకుపచ్చ, బూడిద, నారింజ, తెలుపు, ఎరుపు, నీలం, గులాబి, ఊదా తదితర రంగులు కలిగిన దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో చాలా మంది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, ఒక్కోరోజు ఒక్కో రంగు దుస్తులు వేసుకుని సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోస్ నౌ.. తమ మాతృసంస్థ నిర్మాణ సారథ్యంలో నిర్మించిన సినిమాల్లోని హీరోయిన్ల స్టిల్స్‌ను తమ సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తోంది. హీరోయిన్ల అవుట్‌ఫిట్ రంగులకు మ్యాచ్ అయ్యే డ్రెస్సులు ధరించి తమతో ఫొటోలు పంచుకోవాల్సిందిగా నెటిజన్లకు సూచించింది. అయితే ఈరోస్ నౌ టీం రూపొందించిన ఐడియా నుంచి పుట్టుకొచ్చిన ఈ ‘వినూత్న’థీమ్ చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. నవరాత్రి ఉత్సవాలను సెలబ్రేట్ చేసేందుకు ఇంతకంటే మంచి మార్గం దొరకలేదా అంటూ విరుచుకుపడుతున్నారు. (‘నాపై ఎప్పుడైనా దాడి జరుగవచ్చు’) ముఖ్యంగా.. ‘‘ఎరుపు అంటేనే అంతులేని విశ్వాసం. ప్రేమకు చిహ్నం. నవరాత్రి. నాలుగో రోజు రెడ్ కలర్. చూడండి ఎంత బాగున్నారో’’ అంటూ షేర్ చేసిన కత్రినా కైఫ్, కరీనా కపూర్ ఫొటోలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. ఇక పసుపు రంగు చీరలో ఉన్న కత్రినా ఫొటోతో వారి కోపం నశాళానికి అంటింది. దీంతో #BOYCOTTEROSNOWను ట్రెండ్ చేస్తూ ఆగ్రహం ప్రదర్శించారు. పిచ్చి పిచ్చి మీమ్స్‌తో ఫొటోలు పోస్ట్ చేస్తున్న ఈరోస్ నౌ కంటెంట్‌ను వీక్షించబోమని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాస్తైనా సిగ్గుపడండి అంటూ చురకలు అంటిస్తున్నారు. అంతేగాకుండా కత్రినాకు సంబంధించిన మరికొన్ని స్టిల్స్ షేర్ చేసి, పవిత్రమైన నవరాత్రుల సందర్భంగా ఇలాంటి ఫొటోలతో ఏం సందేశం ఇస్తున్నారంటూ ఏకిపారేశారు. అంతేగాక మతాలకు అతీతంగా ప్రతీ సందర్భంలోనూ ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయగల దమ్ముందా అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎట్టకేలకు దిగివచ్చిన ఈరోస్ బృందం తాము చేసిన పోస్టుల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నందున ఆ ఫొటోలు డెలిట్ చేసింది. కాగా ఇటీవల తనిష్క్ సైతం ట్రోలింగ్ బారిన పడటంతో తమ యాడ్‌ను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. pic.twitter.com/oKxyc2xfA2 — Eros Now (@ErosNow) October 22, 2020 Look At What Type Of Post Is Posted By Eros Now On Instagram Regarding Navaratri. #BoycottErosNow pic.twitter.com/qCxSYJqBtP — Narendra Modi fan (@narendramodi177) October 22, 2020 Okay people, today we're wearing white! Show us your outfits!#Navratri #Navrarti2020 #ENStyleIcons @priyankachopra @deepikapadukone @sonamakapoor pic.twitter.com/SNCv3Vsp7U — Eros Now (@ErosNow) October 19, 2020 -
మూడు భాషలు... పది కథలు
‘ఘరానా బుల్లోడు, సమరసింహా రెడ్డి, సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, ఈగ... రీసెంట్గా భజరంగీ భాయిజాన్, బాహుబలి, మెర్సెల్’ వంటి విజయవంతమైన చిత్రాలకు కథలు అందించారు రచయిత విజయేంద్రప్రసాద్. బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలు నమోదు చేసుకున్న చిత్రాలకు కథలు అందించిన ఈ స్టార్ రైటర్ ‘రాజన్న, శ్రీవల్లి’ వంటి చిత్రాలకు దర్శకునిగా కూడా చేశారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌తో ఆయన పది సినిమాలకు కథ అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ విజయేంద్ర పసాద్‌ను సంప్రదించగా– ‘‘అవును.. నిజమే. ఈరోస్ సంస్థతో పది సినిమాలకు సంబంధించి సైన్ చేయడం జరిగింది. కథల రచన పూర్తయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాలు చేస్తాం. కోటి రూపాయల నుంచి వంద కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాలు ఉంటాయి. కొత్తవాళ్లను ప్రోత్సహించాలన్నది కూడా మా ముఖ్య ఉద్దేశం. ఈ పది సినిమాల్లో కొత్తవాళ్లతో తీసే సినిమాలూ ఉంటాయి. రానున్న రెండు సంవత్సరాల్లో ఈ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది’’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. ఓ హిందీ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ పది చిత్రాల్లో ఆ సినిమా ఒకటన్నది పలువురి అభిప్రాయం. ఇదే విషయం గురించి విజయేంద్రప్రసాద్‌ని అడిగితే – ‘‘ఈరోస్‌తో సుకుమార్ సినిమా చేయనున్నది వాస్తవమే. సుకుమార్ సుముఖంగానే ఉన్నారు. అయితే ఈ పది సినిమాల్లో అది ఒకటి కాదు. వేరే సినిమా’’ అని స్పష్టం చేశారు. -
ఈరోస్‌లో రిలయన్స్ భారీ పెట్టుబడులు
సాక్షి,ముంబై: ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఈరోస్ ఇంటర్నేషనల్‌లో 5శాతం వాటాను కొనుగోలు చేసింది. అనుబంధ సంస్థ ద్వారా 4.875 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 320 కోట్లు) కొనుగోలు చేసింది. ఇటీవలికాలంలో మీడియా కంపెనీలలో విరివిగా పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్ తాజాగా ఈరోస్ ఇంటర్ నేషనల్‌పై దృష్టిపెట్టింది. (ఇప్పటికే ఇంటిగ్రేట్ వయాకామ్, బాలాజీ టెలీఫిల్మ్స్ ఇపుడు ఈరోస్‌లో వాటాను కొనుగోలు చేసింది) ఈ ఒప్పందం ప్రకారం ఏరోస్ ఒక్కో షేరుకు 15 డాలర్లను చెల్లించనుంది. ఈ వార్తలతో బుధవారం నాటి మార్కెట్లో ఏరోస్ భారీ లాభాలతో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఈరెండు కంపెనీల భాగస్వామ్యంలో కంటెంట్ నిర్మాణానికి రూ. 1,000 కోట్ల కార్పస్‌ను ఆర్ఐఎల్ ఏర్పాటు చేయనుంది. అన్ని భాషల్లో భారతీయ సినిమాలు, డిజిటల్ మూలాన్ని ఉత్పత్తి చేసేందుకు సమానంగా పెట్టుబడులు పెడతామని ఇరు కంపెనీలు ప్రకటించాయి. మరోవైపు ఏరోస్ సీఈవో, ఎండీ జ్యోతి దేశ్‌పాండే తన పదవికి రాజీనామా చేశారు. 17ఏళ్లకు పైగా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ఏరోస్కు సేవలందించిన ఆమె ఆర్ఐఎల్ మీడియా ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌కు హెడ్‌గా వ్యవహరించనున్నారు. 2018 ఏప్రిల్‌నుంచి తన బాధ్యతలను చేపట్టనున్నారు. అలాగే ఏరోస్ బోర్డ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ఏరోస్ భాగస్వామ్యం, రిలయన్స్ ఫ్యామిలీలకి జ్యోతి దేశ్‌పాండే ఆహ్వానించడం ఆనందంగా ఉందని ఆర్ఐఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఆమె కంపెనీ ప్రణాళికలకు ఊతమివ్వడమే కాకుండా , వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అటు రిలయన్స్‌తో భాగస్వామ్యం పట్ల ఏరోస్ ఛైర్మన కిషోర్ లుల్లా సంతోషం వ్యక్తం చేశారు. అటు లల్లూకు కతృజ్ఙతలు తెలిపిలు జ్యోతి దేశ్‌పాండే కూడా తన నూతన ప్రస్థానంపై ఆనందం వ్యక్తం చేశారు. 1998 నుండి ఎరోస్ గ్రూపుతో పనిచేయడం, ప్రొఫెషనల్ కెరీర్లో తనకు కీలకమన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో మీడియా కంపెనీ ఏరోస్ ఇంటర్నేషనల్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దాదాపు 7 శాతం జంప్ చేసింది. -
ఈరోస్ చేతికి లింగా
లింగా చిత్రం ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియూ లిమిటెడ్ సంస్థ ఖాతాలో చేరింది. ఈ సంస్థ ఇంతకుముందు సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కోచ్చడయాన్ యానిమేషన్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అదే సంస్థ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం లింగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల హక్కుల్ని సొంతం చేసుకుంది. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా అందాల భామలు సోనాక్షి సిన్హా, అనుష్క నటించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలందించారు. మునిరత్న సమర్పణలో రాక్‌లైన్ వెంకటేష్ రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న లింగా చిత్రం విడుదల హక్కుల్ని ఈరోస్ సంస్థ తన ఖాతాలో వేసుకుందని ఆ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. లింగా చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ర జనీకాంత్ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 12న విడుదల చేయనున్నట్టు వారు వెల్లడించారు. అదే విధంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఈ నెల 16న నిర్వహించనున్నట్టు హిందీ వర్షన్ ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ప్రిస్టీజియస్ చిత్రాన్ని తమ సంస్థ ద్వారా విడుదల చేయడం సంతోషంగా ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ సునీల్‌లుల్లా అన్నారు.