ప్రతి బుధవారం బచ్చన్ బోల్
ఇటు విజ్ఞానం.. అటు వినోదం... జీవితానికి ఈ రెండూ కావాలి. ఆ విషయం అమితాబ్ బచ్చన్‌కు బాగా తెలుసు. అందుకే, ఇన్నాళ్లూ తన ట్విట్టర్ ద్వారా బోల్డన్ని సరదా కబుర్లు పంచుకున్న అమితాబ్, ఇప్పుడు ఆలోచింపజేసే మాటలు, విజ్ఞానాన్ని పెంచే విషయాలు, చరిత్రకు సంబంధించిన నిజాలను పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, దీని కోసం వారంలో ఒక రోజును ప్రత్యేకంగా కేటాయించారు. ప్రతి బుధవారం తాను పంచుకునే విశేషాలకు సరదాగా ‘బచ్చన్ బోల్’ అని పేరు పెట్టుకున్నారు అమితాబ్. మొన్న మంగళవారం నాడు ‘రేపు బచ్చన్ బోల్‌లో ఆసక్తికరమైన విషయాలు చాలా చెబుతా’ అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన అమితాబ్ ఆ మాట నిలబెట్టుకున్నారు. ట్విట్టర్‌లో బచ్చన్ పొందుపరిచిన విశేషాల్లో కొన్ని ఈ
విధంగా...
జీవితంలో ఆచరించదగ్గ వాస్తవం ఒకటుంది. అదేంటంటే.. ఏదైనా సాధించాలనుకుంటే.. దాని మార్గాన్ని నువ్వే వెతుకు...ఎన్ని కష్టాలొచ్చినా నువ్వే సాధించు. అది ఇంటికి సంబంధించినదైనా.. ఆఫీసుకి సంబంధించినదైనా. నువ్వు సాధించాలనుకున్నది నీ పర్యవేక్షణలో జరిగితేనే వర్కవుట్ అవుతుంది.
అందరూ ఏదో సందర్భంలో బాధపడతారు. కానీ, ఎవరైనా పక్కవారి బాధను అర్థం చేసుకుంటారా? చేసుకోరు గాక చేసుకోరు
మన మనసులోకి ఒక ఆలోచన రావడం సులభం. దాన్ని ఆచరణలో పెట్టాలనుకోవడం కూడా సులభమే. కానీ, ఆచరించి చూపడం మాత్రం ఎంతో కఠినం. ఆరువేల ఏళ్ల క్రితం సింధు నదిలో నౌకాయానం (నావిగేషన్) మొదలైంది. అసలు నావిగేషన్ అనే పదం ఎక్కణ్ణుంచి పుట్టిందో చాలామందికి తెలియకపోవచ్చు.. ‘నవ్‌గతి’ అనే సంస్కృత పదం నుంచి ఈ మాట పుట్టింది.