మా పెళ్ళికి వాళ్ళిద్దరూ సాక్షులు! | Exclusive Interview with Singer Mano | Sakshi
Sakshi News home page

మా పెళ్ళికి వాళ్ళిద్దరూ సాక్షులు!

Published Sat, Oct 25 2014 11:12 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

మా పెళ్ళికి వాళ్ళిద్దరూ సాక్షులు!

మా పెళ్ళికి వాళ్ళిద్దరూ సాక్షులు!

 ఆయన వెండితెరకు పాడతారు... బుల్లితెరపై ఆడతారు... తెర మీది తారలకు స్వరప్రతిష్ఠ చేస్తారు... ఇప్పటికీ వేదికనెక్కితే చప్పట్లు మారుమోగేలా ‘చెల్లియో చెల్లకో...’ అంటూ పద్యాల్ని దంచి కొడతారు. ఏ పని చేసినా, దాన్ని దైవంగా భావిస్తారు. అందుకేనేమో 29 ఏళ్ళ తరువాత కూడా కొత్త కుర్రాడిలా ఇప్పటికీ సాధన చేస్తారు. ముఖం మీద చిరునవ్వు... మాటలో మంచితనం మర్చిపోని మనో ఇవాళ్టికీ హాట్‌కేకే. పేరుకు ముందూ, వెనుకా ఏమీ లేకపోయినా, ఎవరికీ వారసుడు కాకపోయినా సినిమాల్లోకి సింగిల్‌గా వచ్చిన ఈ సింహం దారి రహదారి. ఇవాళ్టితో యాభయ్యోపడిలో అడుగుపెడుతున్న జనమనోహర గాయకుడు మనో ఉరఫ్ నాగూర్‌బాబు అంతరంగ ఆవిష్కరణ...
 
 నమస్కారమండీ! ఈసారి పుట్టినరోజు ఎలా జరుపుకొంటున్నారు?
 ఈ సారి యూరప్‌లో ఉంటానండీ! పది రోజుల పాటు నేను, చిత్ర, సాధనా సర్గమ్, మధు బాలకృష్ణన్ కలసి యూరప్‌లో పర్యటిస్తున్నాం. గమ్మత్తేమిటంటే నాలుగేళ్ళుగా పుట్టినరోజుకు విదేశాల్లో ఉంటున్నా.
 
 కావాలనే ఇలా విదేశాల్లో పుట్టినరోజు వేడుకలు ప్లాన్ చేసుకుంటున్నారా?
 (నవ్వేస్తూ...) అలాంటిదేమీ లేదండి! ఎందుకనో అలా కొన్నేళ్ళుగా జరుగుతోంది. నిజానికి, నా పుట్టినరోజుకు నేనెప్పుడూ చేసే పని వేరొకటి ఉంది. చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుష్ఠు రోగుల ఇన్‌స్టిట్యూట్ ఉంది. అక్కడ వాళ్ళందరూ బలహీనంగా ఉంటారు. వాళ్ళకు నా పుట్టినరోజున మటన్ బిర్యానీ, డబుల్ కా మీఠా పంపిస్తుంటా. మా ఆవిడే స్వయంగా వండించి పంపుతుంది. నేను వాడిన దుస్తులూ అనాథాశ్రమాలకు పంపేస్తుంటా. చేతనైనంతలో సాయం చేయాలని నా కోరిక.
 
 మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు. అవేవీ మర్చిపోయినట్లు లేరు!
 లేదు. ఆ సంగతులు నాకిప్పటికీ గుర్తే. మా అమ్మ గారి నాన్న గారు నాగూర్ సాహెబ్ నాదస్వర విద్వాంసుడు. ఆయన, ప్రసిద్ధ నాదస్వర విద్వాంసుడు షేక్ చినమౌలానా ఒకే గురువు దగ్గర ఆ విద్య నేర్చుకున్నారు. మా అమ్మ పేరు షహీదా, మా పెద్దమ్మ పేరు వహీదా. వాళ్ళిద్దరి పేరుతో కార్యక్రమాలు జరిపేవారు. గుంటూరు జిల్లా యద్దనపూడి, దొండపాడు, తదితర గ్రామాల్లో మునసబు, కరణాల ఇళ్ళ దగ్గర, రచ్చబండ్ల దగ్గరకు వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. అక్కడ ఇచ్చిన బియ్యం, దుస్తులతో జీవితం గడిపేవాళ్ళు. ఒక్కమాటలో చెప్పాలంటే, పూట కూలీ కళాకారుల కుటుంబం మాది. మా తాత గారు 1964లో చనిపోయారు. మరుసటేడు అక్టోబర్ 26న నేను పుట్టా. అందుకే, నాగూర్‌బాబు అని ఆయన పేరే పెట్టారు.
 
 శివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ళకు కట్టిన ప్రభల్లో ఆడి, పాడేవారట!
 తిరునాళ్ళకు ప్రభలు కడితే, ఆ ప్రభల వెంట ఆటపాటలతో అందరినీ అలరించేవాళ్ళం. ‘‘ ‘శ్రీనివాస శివదుర్గా సత్యసాయి నాట్యమండలి’ వారిచే భరతనాట్యం కార్యక్రమం అండ్ లైట్ మ్యూజిక్’’ అంటూ ప్రచారం చేసేవాళ్ళం. అలా అన్ని గ్రామాల నుంచి ప్రభలు వస్తాయి. ప్రభల మధ్య పోటీ ఉంటుంది. మమ్మల్ని ప్రభల మీద తీసుకెళ్ళిన గ్రామస్థులు ఇచ్చిన డబ్బు వగైరానే వర్షాకాలంలో మాకు గ్రాసం. అక్కడ నుంచి పైకొచ్చాను నేను.
 
 అన్నింటినీ సహించి, భరించి ఇంత పైకి రావడం కష్టమేనే?
 నా దృష్టిలో ఉన్నదాంట్లో సంతోషపడేవాడి కన్నా అదృష్టవంతుడు లేడు. ఎలా సరిపోతుందని అసంతృప్తితో ఉంటే చివరకొచ్చేది రోగమే! (నవ్వుతూ) ఈ వాస్తవాన్ని తెలుసుకున్నవాడు - జ్ఞాని. తెలుసుకోనివాడు - అజ్ఞాని.
 
 మీ చిన్ననాటి రంగస్థల, సినీ అనుభవాలు చెప్పండి.
 నేను పుట్టింది గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో. కళాకారిణి అయిన అమ్మ షహీదా, ఆలిండియా రేడియోలో పని చేసే నాన్న రషీద్‌ల నుంచి నాకూ ఈ కళాభిరుచి వచ్చింది. పెరిగింది విజయవాడలో! చిన్నప్పుడే రంగస్థలం మీద పాత్రలు ధరించా. పాటో పద్యమో పాడితే, ప్రేక్షకులు దగ్గరకు వచ్చి, కాస్ట్యూమ్‌కు రూపాయి నోట్లు గుచ్చేవారు. చిన్నతనంలోనే నేదునూరి కృష్ణమూర్తి, రేవతీ రామస్వామి దగ్గర కొన్నాళ్ళు సంగీత శిక్షణ పొందా. విజయవాడలో సి.వి.ఆర్. హైస్కూల్‌లో చదువుకొన్నా. ఒక్క పదో తరగతే అయిదారుసార్లు చదివి, ఒంటికి పడక వదిలేశా (నవ్వులు...). ‘భలే బుల్లోడు’తో బాలనటుడిగా సినీ రంగంలోకి కాలుమోపా. దాసరి గారి ‘నీడ’, అలాగే ‘జాతర’, ‘తరం మారింది’ చిత్రాల్లో నటించా. కృష్ణంరాజు ‘రంగూన్ రౌడీ’లో, మోహన్‌బాబు ‘కేటుగాడు’లో బాల హీరో నేనే! తర్వాత సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా చేయడం, సినిమా సింగర్ రావడం - మరో కథ.
 
 సినీ రంగంలో మీకు తొలి అవకాశాలిచ్చినవారి గురించి...?
 సినీ సంగీతంలో ఓనమాలు దిద్దించింది - చక్రవర్తి గారు. నేను ఇన్ని విద్యలు నేర్చుకోవడానికి కారణం ఆయన. ఆ మహానుభావుడి దగ్గర నేను మొదటి అసిస్టెంట్‌నైతే, నాకు అసిస్టెంట్లుగా కీరవాణి, ‘వందేమాతరం’ శ్రీనివాస్ ఉండేవారు. అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం. ఇక, తమిళంలో నాకు పిలిచి, పాటలిచ్చి ప్రోత్సహించిన గొప్పవ్యక్తి - ఇళయరాజా. తెలుగులో మంచి పాటలిచ్చింది రాజ్. కొంత పాటల జాబితా మిస్ అవగా, ఇన్నేళ్ళలో ఇప్పటి దాకా అన్ని భాషల్లో కలిపి 24,742 పాటలు పాడినట్లు లెక్క ఉంది. ఇవికాక ప్రైవేట్ పాటలు వేరే! గాయకుడిగా నాకిది 29వ సంవత్సరం.
 
 ఇన్నేళ్ళ తరువాత కూడా అదే ఉత్సాహంతో ఎలా పాడుతున్నారు?
 చూడండి. ఇక్కడ సాధన ముఖ్యం. పాకిస్తాన్‌లో ప్రసిద్ధ గజల్ గాయకుడైన గులాం అలీ గారు తన బృందంతో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా, మళ్ళీ మధ్యాహ్నం భోజనం - విశ్రాంతి అయ్యాక మొదలుపెడితే రాత్రి దాకా హార్మోనీ మీద పాటలు సాధన చేస్తూనే ఉంటారు. ప్రతి రోజూ ఇదే దినచర్య. కళ మనకు జీవితాన్నిస్తోందన్న స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ సాధన చేస్తూనే ఉంటారు. నేనూ ప్రస్తుతం రోజూ ఉదయం లేవగానే ముప్పావు గంట గాత్ర సాధన చేస్తున్నా. దీనివల్ల వయసు మీద పడుతున్నా, గొంతు మీద పట్టు పోదు. దీర్ఘకాలం గాయకులుగా కొనసాగగలుగుతాం.
 
 మీ దృష్టిలో గానమంటే...
 అది కూడా ఒక యోగం. ఎందుకంటే, గానం కూడా శ్వాస మీద నియంత్రణకు సబంధించిన విషయమే కదా! రోజూ ఉదయం వేళ సాధన చేస్తుంటే, దేవుడికి అభిషేకం చేస్తున్న భావన కలుగుతుంది. ఒక పక్కన గానం ప్రాక్టీస్ చేస్తూనే, మరోపక్క టీవీలో ఉదయం వచ్చే భక్తి, స్తోత్ర కార్యక్రమాలను ఆడియో లేకుండా చూస్తుంటా. అలా దైవాన్ని చూస్తూ పాడడం వల్ల ఇటు సాధనా అవుతుంది. అటు ఆధ్యాత్మిక భావమూ కలుగుతుంది. హఠాత్తుగా హైపిచ్ పాట ఛాన్సొచ్చినా, ఇబ్బంది పడకుండా పాడేస్తాను.
 
 ఇవాళ టీవీలో చాలా సింగర్స్ షోలు వచ్చాయి. ఉపయోగం ఉందంటారా?
 నూతన సంగీత ప్రతిభావంతులకు మీడియా పెద్దపీట వేస్తోంది. వాళ్ళకు వేదిక లభిస్తోంది. అలాగే, వారు పాత పాటలు పాడడం వల్ల ఆ సినిమాలనూ, ఆర్టిస్టులనూ, గాయకులనూ గుర్తు చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతోంది. సీనియర్ గాయనీ గాయకులు జడ్జీలుగానో, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగానో మళ్ళీ వార్తల్లోకి వస్తున్నారు. వారికీ కాస్త పని దొరుకుతోంది. హిందీ టీవీ చానళ్ళలో మొదలైన ఈ సంస్కృతి ఇప్పుడు దక్షిణాది భాషలన్నిటిలో ప్రముఖంగా కొనసాగుతోంది. చాలా మంది కొత్తవాళ్ళు రావడంతో సినిమాలకే కాక, ప్రైవేట్ ఆల్బమ్స్‌కూ, గజల్స్‌కూ ఉపయోగమే.
 
 కానీ, ఇలా తెరపైకి వస్తున్నవాళ్ళలో నిలబడుతున్నవాళ్ళు ఎందరంటారు?
 మేము సినీ రంగానికొచ్చినప్పుడు అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. ఇవాళ ఇలా రకరకాల రంగాల వల్ల అవకాశాలు వచ్చినట్లు కనబడుతున్నాయి. కానీ, ఇప్పుడు నలుగురితో పాటు నారాయణలా ఉంటే ఉపయోగం లేదు. అదనపు ప్రతిభ ఉంటేనే ఎవరైనా నీ వైపు చూస్తారు. ప్రతి ఒక్కరికీ వాళ్ళకంటూ ఒక టైమ్ వస్తుంది. అప్పటి దాకా కృషి చేస్తూ, ఛాన్సొచ్చినప్పుడు అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకరికి జీవితంలోని ఫస్టాఫ్‌లో ఆ బ్రేక్ వస్తుంది. మరికొందరికి సెకండాఫ్‌లో వస్తుంది. హీరోలు విక్రమ్, రవితేజ లాంటి వాళ్ళకు ద్వితీయార్ధంలో బ్రేక్ వచ్చింది. ప్రతిభ, ప్రవర్తన బాగుండి, మంచితనం ఉంటే ఎవరూ మనల్ని మర్చిపోరు.
 
 మరి, మీ జీవితంలో ఫస్టాఫ్ బాగుందా? లేక సెకండాఫ్ బాగుందా?
 (నవ్వేస్తూ...) జీవిత ప్రథమార్ధంలో వచ్చిన ప్రతి కష్టాన్నీ సుఖంగా మలుచుకున్నా. ప్రభల్లో పాటలు పాడడం దగ్గర నుంచి సినీ నేపథ్య గాయకుడిగా 14 భారతీయ భాషల్లో పాడే స్థాయికి ఎదిగా. సింహళ, మలాయ్ భాషల్లోనూ పాడా. ఇక, ఇప్పుడీ సెకండాఫ్‌లో టీవీ చానల్స్‌లో కొత్తగా వస్తున్న పిల్లలకు పాటల్లో మెలకువలు చెప్పడం, జడ్జిగా సలహాలివ్వడం - ఇదంతా ఒక కొత్త అనుభూతి. సినీ గాయకుడిగా ఈ 29వ సంవత్సరంలో కూడా పాటలు పాడుతూ, రేసులోనే ఉన్నా.
 అంతకు మించి ఇంకేం కావాలి!
 
 ఇక్కడ నుంచి ఏ దిశగా మీ ప్రస్థానం?
 టీవీలో యాంకర్‌గా, జడ్జీగా కూడా బిజీగా ఉన్నా. త్వరలోనే పూర్తి స్థాయిలో గజల్ గాయకుడిగా, ఆల్బమ్‌ల నిర్మాతగా విస్తరించాలని ఆలోచన. ‘టీ’ సిరీస్ లాగా సంస్థ పెట్టి, ఔత్సాహిక కళాకారులతో భక్తి ఆల్బమ్‌లు రూపొందించాలని ఉంది. ఒకప్పటి లాగా క్యాసెట్లు, సీడీలు కాకపోయినా, పాటకు పైసా వంతున ఇంటర్నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొనే సౌకర్యం పెట్టి, దేశదేశాలకూ సంగీతాన్ని విస్తరించవచ్చు. దేవుడెటు నడిపిస్తాడో చూడాలి.
 
 కమలహాసన్, రజనీకాంత్ లాంటి వాళ్ళకు స్వరదానం అనుభవం మాటేమిటి?
 రజనీకాంత్ లాంటి స్టార్‌కు నేనే కాదు ఎవరు డబ్బింగ్ చెప్పినా, పాపులర్ అవుతారు. ‘నా దారి రహదారి’ లాంటి డైలాగులున్న ‘నరసింహ’లోని నా డబ్బింగ్ విని, ఆయన తమిళ శైలికి భిన్నంగా ఉన్న నా తెలుగు పద్ధతే కరెక్ట్ అని రజనీకాంతే మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే, ‘శివాజీ’, ‘రోబో’, తాజాగా హిందీ ‘కొచ్చడయాన్’కు కూడా నేనే డబ్బింగ్. కమల్‌కు సైతం ‘సతీ లీలావతి’, ‘బ్రహ్మచారి’ లాంటి వాటిల్లో చెప్పా. కమల్‌కు ఎక్కువగా డబ్బింగ్ చెప్పే ఎస్పీబీ నా కన్నా ఆ చిత్రాలకు మనోయే కరెక్ట్ అని సూచించారు. గోదావరి యాసలో డబ్బింగ్ ఎంతో పేరు తెచ్చింది.
 
 పిల్లలతో మీరు చేసిన ‘పిల్లలు... పిడుగులు’ బాగా పేరు తెచ్చింది. ఆపేశారేం?
 జెమినీ టీవీలో ఆ కార్యక్రమానికి పేరొచ్చిన మాట నిజమే. కానీ, రోజూ చాలా గంటలు నిలబడి ఆ షోను హోస్ట్ చేయడం శారీరకంగా చాలా శ్రమ. నాలుగైదేళ్ళ చిన్న పిల్లలను లాలిస్తూ, బుజ్జగిస్తూ, వాళ్ళు మంచి మూడ్‌లో ఉన్నప్పుడు కార్యక్రమం చిత్రీకరించడం అంత తేలికైన పని కాదు. అప్పటికీ ఏడాదిన్నర పైనే చేశాం. ఎంతో కష్టం ఉన్నా ఆ షో ఓ మంచి అనుభూతి.
 
 ఇన్ని చేశారు. సంగీత దర్శకత్వం మీద శ్రద్ధ పెట్టలేదేం?
 (నవ్వేస్తూ...) ఇచ్చిన పాటలు నేర్చుకొని పాడేయడంలో ఉన్న సౌకర్యం సినీ సంగీత దర్శకత్వంలో లేదు. అయినా రాబోయే రోజుల్లో చేపట్టే గజల్స్, భక్తి ఆల్బమ్‌ల ద్వారా బాణీలు అందించే అవకాశం ఎలాగూ ఉంది.
 
 ఇన్ని రకాల పాత్రలు పోషించిన మీకు అత్యంత సంతృప్తికరమైన అంశం?
 పాటలు పాడడమే! అంతకు మించి సంతృప్తి నాకు మరొకటి లేదు.  
 
 కానీ, సొంత ముద్రను మర్చిపోయేలా బాలూ గొంతు మీపై ముద్ర వేసిందే?
  బాలూ గారి ప్రభావం నా మీద ఎప్పుడూ ఉంటుంది. ఆయన వాయిస్ కల్చర్‌కు దగ్గరగా నాది ఉండేది. దాంతో, కెరీర్ తొలి రోజుల్లో నేను పాడిన పాటలు కూడా బాలూ గారి పాటలుగానే అంతా భావించేవారు. అది కొన్నిసార్లు మైనస్ అయినా, కొన్నిసార్లు ప్లస్ కూడా అయింది.
 
 కానీ మీరు బాలూను అనుకరించారంటూ...
 (మధ్యలోనే అందుకుంటూ...) అది అనుకరణ కాదు. పుట్టుకతోనే నా గొంతు స్వభావం ఆయన స్వరానికి దగ్గరగా ఉంటే అది నా తప్పంటారా? అందుకే, రెండు గొంతులూ ఒకే రకంగా వినిపించేవి. తర్వాతర్వాత జనం నా గొంతును విడిగా గుర్తించడం మొదలుపెట్టారు.
 
 ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, మీకు ఏమనిపిస్తుంది?
 ప్రతిరోజూ వెనక్కి తిరిగి చూసుకుంటూనే ముందుకెళుతున్నా. ఎక్కి వచ్చిన మెట్లు, చిన్ననాటి స్నేహాలు మర్చిపోలేదు. నా చిన్నప్పటి స్నేహితులు పది, 15 మంది ఇప్పటికీ నాకు ఆత్మీయ మిత్రులే. వాళ్ళలో ఒక రిక్షావాడు ఉన్నాడు. ఇప్పటికీ విజయవాడకు వెళితే నా హోటల్‌కు వచ్చి, నేరుగా మంచం మీద కూర్చొని, ‘ఏరా! నాగూర్!’ అనేంత చనువు మా మధ్య ఉంది. నాగూర్ నుంచి మనో అయిన తరువాత కూడా ఇప్పటికీ నాలో మార్పు లేదు. అహం లేదు. అవి గనక మొదలైతే వాళ్ళే మనల్ని దూరం పెడతారు.
 
 కొత్తగా వచ్చేవాళ్ళకు అనుభవాన్ని రంగరించి మీరు చెప్పే పాఠం?
 జీవితంలో ప్రతిచోటా సర్దుబాటుంటుంది. ఇక్కడా అంతే. అడ్డంకుల్ని నాజూగ్గా దాటుకొంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు ఒక మంచి మిత్రుడు చెప్పే మాట, ఇచ్చే సలహా ముఖ్యం. అలా కాకుండా, నోరు జారినా, కోపతాపాలు చూపించినా పైకి ఏమీ అనరు కానీ, అవకాశాలే రావు. ఎప్పుడడిగినా, ‘చూద్దాం... చేద్దాం’ అంటూ ఉంటారు. మనం ప్రవర్తనలో తేడా చూపించినదాని ఫలితం అది. ఆ సంగతి అర్థమయ్యేసరికి పుణ్యకాలమైపోతుంది. ఈ రంగంలో రోషం చూపితే ఏదీ సాధించలేమని ఒక పెద్దాయన చెప్పాక ప్రవర్తన మార్చుకున్నా. ఒక్క మాటలో, ఇక్కడ ‘నీ శాంతమే నీకు రక్ష’.
 
 మా పెళ్ళికి వాళ్ళిద్దరూ సాక్షులు!
 నాకు 19 ఏళ్ళ వయసులోనే పెళ్ళయింది. మా ఆవిడ పేరు - జమీలా. వాళ్ళది తెనాలి. ఆ ఊళ్ళోనే సంప్రదాయ ముస్లిమ్ పద్ధతిలో వివాహం జరిగింది. అది 1985 జూన్ 9వ తేదీ. నా జీవితంలో ఇప్పటికీ అది మరపురాని తేదీ. సాక్షాత్తూ మా గురువు చక్రవర్తి గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి, సాక్షి సంతకాలు చేశారు. మా పిల్లలకు కూడా సినిమా రంగంలో అభిరుచి ఎక్కువ. మా పెద్దవాడు షకీర్ ఇప్పటికే రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇంకో నాలుగైదు నెలల్లో అవి విడుదలవుతాయి. ఇక, చిన్నవాడు రతేశ్ కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. మా అమ్మాయి సోఫియా డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. అమ్మాయికి పాడడం మీద ఆసక్తి ఎక్కువ. నేర్చుకున్నది లేకపోయినా, మా రక్తంలో ఉన్న కళ ఎక్కడికి పోతుంది! ఇప్పటికే అమెరికా వచ్చి, ‘స్వరాభిషేకం’ కార్యక్రమంలో పాటలు పాడింది. నా వారసులుగా వీరంతా సినిమాల్లోకి వచ్చారు. వాళ్ళ గొంతులో నా పాట కొనసాగుతుంది.
 - రెంటాల జయదేవ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement