ఫ్యామిలీ బ్లడ్‌ | Family Relations In Bollywood | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ బ్లడ్‌

Published Wed, Mar 22 2017 11:25 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఫ్యామిలీ బ్లడ్‌ - Sakshi

ఫ్యామిలీ బ్లడ్‌

బ్లడ్‌ రిలేషన్‌ ఉంటే కానీ బాలీవుడ్‌లో వర్కవుట్‌ అయ్యేట్టు కనిపించడం లేదు. హీరోలు, హీరోయిన్లు, విలన్లు, రైటర్లు, కొరియోగ్రాఫర్లు, కెమేరామేన్లు.. లిస్ట్‌ నెవర్‌ ఎండింగ్‌. బాలీవుడ్‌లో తెర మీద, తెర వెనకా, పక్కనా... అంతా బ్లడ్డే. రక్తం చిందిస్తున్నారనుకోకండి! మరి ఏం చిందిస్తున్నారు? బంధుప్రీతిని చిలకరిస్తున్నారు. దీంట్లో ఏమీ తప్పు లేదు. బంధువులుంటే మాత్రమే గొప్పవారు కాదు. కానీ అవకాశం మాత్రం ‘రిలేటీవ్‌’లీ ఈజీ..

అక్తర్‌–ఆజ్మి... ఆల్‌ ఆర్‌ టాలెంట్‌ సుమీ
ప్రముఖ హిందీ రచయిత జావేద్‌ అక్తర్‌ తండ్రి జాన్‌ నిసార్‌ గేయ రచయిత. జావేద్‌ మొదటి భార్య హనీ ఇరానీ కూడా రైటరే. జావేద్‌–హనీల తనయుడే దర్శక–నటుడు ఫర్హాన్‌ అక్తర్‌. ఫర్హాన్‌ సోదరి జోయా అక్తర్‌ కూడా దర్శకురాలే. ఇదిలా ఉంటే.. జావేద్‌ మొదటి భార్య హనీ ఇరానీకి ఓ సోదరి ఉన్నారు. పేరు మేనకా ఇరానీ. ఈ మేనకా కూతురే ప్రముఖ నృత్య దర్శకురాలు–దర్శకురాలు ఫరాఖాన్‌. ఫరా సోదరుడు సాజిద్‌ఖాన్‌ కూడా దర్శక–నటుడే. ఇక, జావేద్‌ అక్తర్‌ రెండో వివాహం చేసుకున్న ప్రముఖ హిందీ నటి షబానా ఆజ్మిదీ సినిమా నేపథ్యమే. షబానా తండ్రి కైఫ్‌ ఆజ్మి పాటల రచయిత. తల్లి షౌకత్‌ కైఫ్‌ నటి. షబానా మేనకోడళ్ళు టబు, సయామీ ఖేర్‌లు కూడా ఫ్యామిలీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

బచ్చన్‌ అండ్‌...
ఎలాంటి రికమండేషన్లు లేకుండా కష్టపడి, పైకొచ్చిన నటుడు అమితాబ్‌ బచ్చన్‌. ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా అడుగుపెట్టారు. తండ్రీ కొడుకులు అమితాబ్, అభిషేక్‌... ఇద్దరూ వెండితెరపై తమకు జోడీగా నటించిన హీరోయిన్లు జయా బాధురి, ఐశ్వర్యా రాయ్‌లను పెళ్లాడారు. అమితాబ్‌ సోదరుడు అజితాబ్‌ నిర్మాతగా కొన్ని చిత్రాలు తీశారు. ఈయన కుమార్తె నైనా బచ్చన్‌ను యంగ్‌ హీరో కునాల్‌కపూర్‌ పెళ్లి చేసుకున్నారు. అమితాబ్‌ కుమార్తె శ్వేతా బచ్చన్‌ను కపూర్‌ కుటుంబంలోకి కోడలిగా పంపారు. అమితాబ్‌ అల్లుడు నిఖిల్‌ నందా ఎవరో కాదు... ప్రముఖ నటుడు రాజ్‌కపూర్‌ మనవడే.

భట్‌... బంచ్‌ ఆఫ్‌ టాలెంట్‌
బాలీవుడ్‌ దర్శకుల అడ్డా ఏదంటే... భట్‌ ఫ్యామిలీ అనే చెప్పాలి. దర్శకుడు నానాభాయ్‌తో బాలీవుడ్‌లో భట్‌ ఫ్యామిలీ పురుడు పోసుకుంది. ఓ 50 చిత్రాలు తీసిన నానాభాయ్‌ భట్‌కు ఎనిమిది మంది పిల్లలు. వాళ్లు, వాళ్ల పిల్లలూ పుట్టగొడుగుల్లా హిందీలో పాగా వేశారు. నానాభాయ్‌ కుమారుల్లో రాబిన్‌ రచయితగా, ముఖేశ్‌భట్‌ నిర్మాతగా, మహేశ్‌భట్‌ దర్శకుడిగా స్థిరపడ్డారు. ఈ ఫ్యామిలీ మూడోతరంలో ముఖేశ్‌ కుమారుడు విశేష్‌భట్‌ ‘మర్డర్‌–3’కి దర్శకత్వం వహించారు.

ఇక, మహేశ్‌భట్‌ మొదటి భార్య కుమార్తె పూజా భట్‌ నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా పలు శాఖల్లో ప్రతిభ చూపారు. మహేశ్‌భట్‌ రెండో భార్య కుమార్తె ఆలియా భట్‌ ప్రజెంట్‌ స్టార్‌ హీరోయిన్‌. యువదర్శకుడు మోహిత్‌ సూరి నానాభాయ్‌కు మనవడు. అంటే... కూతురి కొడుకు. ముఖేశ్, మహేశ్‌లకు మేనల్లుడు. బాలీవుడ్‌ సీరియల్‌ కిస్సర్‌ ఇమ్రాన్‌ హష్మి కూడా మహేశ్‌భట్‌కు మేనల్లుడి వరుస. ఇంకా ఈ ఫ్యామిలీలో నటీనటులు, దర్శకులు బోల్డంత మంది ఉన్నారు.

యస్‌... జోహార్‌ చోప్రా
యశ్‌చోప్రా... భారతీయ చిత్రసీమకు పరిచయం అక్కర్లేని పేరు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్థాపించి, దర్శక–నిర్మాతగా హిట్‌ సినిమాలు తీశారు. ఆయన అన్నయ్య బల్‌దేవ్‌ చోప్రా కూడా దర్శక–నిర్మాతే. యశ్‌చోప్రా సోదరుల్లో ధరమ్‌రాజ్‌ చోప్రా సినిమాటో గ్రాఫర్‌ కాగా, రాజ్‌చోప్రా డిస్ట్రిబ్యూటర్‌. బల్‌దేవ్‌ చోప్రా తనయుడు రవిచోప్రా ఫేమస్‌ టీవీ సీరియల్‌ ‘మహాభారత్‌’కు దర్శక–నిర్మాత. యశ్‌చోప్రా కుమారుల్లో పెద్దోడు ఆదిత్యా చోప్రా దర్శక–నిర్మాతగా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. చిన్నోడు ఉదయ్‌చోప్రా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు.

నటి, వ్యాఖ్యాత సిమి గరేవాల్‌.. ఆదిత్యాచోప్రా చిన్నమ్మ కూతురు. ఇవన్నీ పక్కన పెడితే... ‘నెపోటిజమ్‌’ పేరుతో కంగనా రనౌత్‌ వేలెత్తి చూపుతోన్న కరణ్‌ జోహార్‌ ఎవరో తెలుసా? యశ్‌చోప్రా మేనల్లుడు. కరణ్‌ తల్లి హీరూ జోహార్‌ ఎవరో కాదు... యశ్‌చోప్రా సొంత చెల్లెలు. కరణ్‌ తండ్రి యశ్‌ జోహార్‌ కూడా నిర్మాతే.  ఆయన ‘ధర్మ ప్రొడక్షన్స్‌’ సంస్థను స్థాపించారు.

కపూర్స్‌... క్యా టాలెంట్‌!
హిందీ సినిమాలనూ, కపూర్‌ కుటుంబాన్ని వేరు చేసి చూడలేం. కపూర్‌ ఫ్యామిలీకి పృధ్వీరాజ్‌ కపూర్‌ ఆద్యుడు. మూకీ చిత్రాల యుగం నుంచి ఆయన హీరోగా నటించారు. ఆయన తనయులు రాజ్‌కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్‌... ముగ్గురూ హీరోలుగా, దర్శకులుగా, నిర్మాతలుగా ఓ వెలుగు వెలిగారు. కపూర్‌ ఫ్యామిలీ మూడోతరంలో రాజ్‌కపూర్‌ కుమారులు రణధీర్‌ కపూర్, రిషి కపూర్, రాజీవ్‌ కపూర్‌... తండ్రిలా నటన, దర్శ కత్వం, నిర్మాణం మూడింటిలోనూ ప్రతిభ చూపారు.

షమ్మీ కపూర్‌ తనయుడు అదిత్యారాజ్‌ కపూర్‌ నటుడిగా, నిర్మాతగా సినిమాలు చేశారు. శశికపూర్‌ కుమారుల్లో పెద్దోడు కునాల్‌ కపూర్‌ యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ గా, చిన్నోడు కరణ్‌ కపూర్‌ మోడల్‌ కమ్‌ ఫొటోగ్రాఫర్‌ గా స్థిరపడ్డారు. నాలుగో తరంలో రణధీర్‌ కుమార్తెలు కరీష్మా, కరీనాలు బోల్డంత పేరు తెచ్చుకున్నారు. రిషి కపూర్‌ తనయుడు రణబీర్‌ కపూర్‌ స్టార్‌ హీరోగా దూసుకెళుతున్నారు.

ఇంకా..
 పైన చెప్పిన ఫ్యామిలీలతో పాటు డియోల్‌ (ధర్మేంద్ర) ఫ్యామిలీ వంటివి మరికొన్ని ఉన్నాయి. ప్రముఖ íహీరోలు సంజయ్‌దత్, సల్మాన్‌ ఖాన్, ఆమిర్‌ ఖాన్, అజయ్‌ దేవగన్,  సైఫ్‌ అలీఖాన్, హృతిక్‌ రోషన్, హీరోయిన్లు సోనమ్‌ కపూర్, సోనాక్షీ సిన్హా, శ్రద్ధాకపూర్‌... ఇలా సినీ నేపథ్యం ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement