థియేటర్లో టపాసుల మోత
ముంబై :
మన దేశంలో మూవీ స్టార్స్కు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా వారి చిత్రాలు రీలీజైతే ఫ్యాన్స్ చేసే హడావిడీ అంతా ఇంతా కాదు. థియేటర్లో హీరో మంచి డైలాగ్స్ చెబితే విజిల్స్ వేయడం, హీరో అధిరిపోయే స్టెప్పులు వేస్తే అభిమానులు కూడా స్క్రీన్ దగ్గరికెళ్లి డ్యాన్స్లు చేయడం, మరీ అయితే పేపర్లు చింపి విసరడం మనం సర్వసాధారణంగా థియేటర్లలో చూసే దృశ్యాలు. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అభిమానుల పిచ్చి మాత్రం పీక్స్కు చేరింది. ఏకంగా థియేటర్లో టపాసులు పేల్చి సినిమా చూడటానికి వచ్చిన మిగతా వారిని బెంబేలెత్తించారు.
మహారాష్ట్రలోని మాలేగావ్ లోని ఓ థియేటర్లో సల్మాన్ ఖాన్ మూవీ ట్యూబ్ లైట్ సినిమా నడుస్తోంది. చిత్రంలో హీరో సల్మాన్ ఎంట్రీ సీన్ రాగానే ఫ్యాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. బాంబులతో థియేటర్ను అదరగొట్టేశారు. ఒక్కసారిగా బాంబులు పేలుస్తూ, చిచ్చుబుడ్డీలతో హంగామా చేశారు. సల్మాన్ సల్మాన్ అంటూ అరుస్తూ టపాసుల మోత మోగించారు. కాగా, టపాసులు పేల్చినవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్లలో అభిమానులు టపాసులు పేల్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. థియేటర్లలో అగ్ని ప్రమాదం సంభవిస్తే ప్రాణనష్టం జరిగే అవాకాశాలు చాలా ఎక్కువని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.