బహుదూరపు ‘బాటసారీ’!నిను మరువదోయి గోదారి!
బహుదూరపు ‘బాటసారీ’!నిను మరువదోయి గోదారి!
Published Thu, Jan 23 2014 5:09 AM | Last Updated on Tue, Jul 31 2018 5:31 PM
తన అలలకే కొత్తకులుకు నేర్పిన ‘అందాలరాముడు’ తిరిగి రాని తీరాలకు తరలిపోయాడని గోదారి గొంతు మూగబోయింది. ఆ బహుదూరపు ‘బాటసారి’ తనతో గడిపిన మజిలీల స్మృతులు.. వరదవేళ అలల్లా ముప్పిరిగొనగా దుఃఖోద్విగ్నతతో ఉక్కిరిబిక్కిరైంది. క్షణానికి 24 ఫ్రేములుతరలిపోయే వెండితెరపై తరతరాలకూనిలిచే ‘ప్రేమనగర్’ కట్టిన ఆ ‘జమీందార్’కు తుదిక్షణం ప్రాప్తించిందన్న పాడు కబురుతో ఈ గడ్డ గుండె చెదిరిపోయింది. ‘నిండు నూరేళ్లు అలరిస్తూనే ఉంటా’నని నిన్నగాక మొన్ననే
‘చేతిలో చెయ్యేసి’ చెప్పిన ‘దసరా బుల్లోడు’-
మరో పదేళ్లు బాకీ పడి, ‘టాటా వీడుకోలు.. గుడ్‌బై ఇంక సెలవు’ అంటూ ‘మరో ప్రపంచాని’కి తరలిపోవడంతో.. ప్రతి ఎదా వ్యధతో బరువెక్కింది. ‘ముద్దబంతి పువ్వుల’ మార్దవాన్ని అనితర సాధ్యంగా అనుభూతికి తెచ్చి, ‘మూగమనసుల’ ఊసుల్ని ముగ్ధమనోహరంగా ‘కళ్లకు కట్టించిన’ ఆ సరంగు జీవన పయనానికి లంగరు దించేశాడన్న దుర్వార్తతో.. ఈ సీమలోని కాల్వలకు చెంపలపై కన్నీటి కాల్వలు తోడయ్యాయి. నటరాజుకు ప్రీతిపాత్రుడైన ఆ ‘దత్తపుత్రుడు’.. ‘మరుజన్మ’ ఉందో, లేదోనని సందేహించినా.. నూరుజన్మలు తిలకించినా తనివి తీరని అభినయసిరిని మిగిల్చి.. బతుకురంగస్థలంపై తన పాత్రను చాలించాడన్న నిజం ‘నిజం’ కారాదని, ‘మాయాబజారు’లో ఘటోత్కచుని గారడీలాంటి భ్రాంతి అయితే బాగుండునని అభిమానులు ఘోషించారు. తన కనుపాపలపై విషాదాన్ని కొలువు తీర్చి, శిలలతో సైతం శోకం పెట్టించిన ఆ ‘దేవదాసు’.. ఆ మృత్యుదేవతను కూడా బావురుమనిపించి, చావును గెలిచి.. ‘మళ్లీ పుడితే’ ఎంత బాగుండునని విలపించారు.
అమలాపురం, న్యూస్‌లైన్ :‘అక్కినేని’... తెలుగు సినిమా పాటకు ఆట నేర్పించారు. ఆ లెజెండ్ పాటల్లో అత్యంత ప్రజాదరణ పొందినది... ‘దసరాబుల్లోడు’లోని ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల.. నీ పైట కొంగుజారిందే చూడుమల్లా’ ఒకటి. ఆ పాటను చిత్రీకరించింది పైరు పచ్చని కోనసీమలోనే. కామనగరువులోని అమలాపురం ప్రధాన మురుగునీటి కాలువ (మురుక్కోడు) వద్ద ఆ పాట చిత్రీకరించారు. పాట తొలి పల్లవి మొదలయ్యేది ఈ కోడు గట్టు మీదే. ఈ పాట చిత్రీకరణ నాటి నుంచి ఈ కాలువ ‘దసరాబుల్లోడు కోడు’గా స్థిరపడిపోయింది. మరో మూడు సూపర్ హిట్ సాంగ్‌స కోనసీమలోనే చిత్రీకరించారు.
1971లో వీబీ రాజేంద్రప్రసాద్ ‘దసరాబుల్లోడు’ సినిమా చాలా వరకు కోనసీమలోనే చిత్రీకరించారు. అప్పుడు అక్కినేని, వాణిశ్రీ, నాగభూషణంతోపాటు నటులందరూ అమలాపురంలో ఆర్డీఓ కార్యాలయం పక్కనే చిక్కం చంచలరావు ఇంట్లో నెల్లాళ్లు బస చేశారు. అమలాపురం మురుక్కోడు వద్ద ‘పచ్చగడ్డి కోసేటి’తో పాటు ‘చేతిలో చెయ్యేసి చెప్పుబావ’, ‘ఎట్టాగ ఉన్నాది ఓలమ్మీ’ పాటల చిత్రీకరణ అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, శానపల్లిలంక, మడిపెల్ల, ముమ్మిడివరంలోని చిప్పలపాలెం ప్రాంతాల్లో జరిగింది. అప్పడు అమలాపురంలోని వెంకట రమణ థియేటర్ మేనేజర్ యర్రమిల్లి నారాయణస్వామి బంగ్లాలో యూనిట్ సభ్యులు ఉన్నారు. అయినవిల్లి మండలంలో చిత్రషూటింగ్ సమయంలో వీరవల్లిపాలెంలో అప్పటి ఉపసర్పంచ్ సలాది సత్యనారాయణమూర్తి ఇంట్లో ఆ చిత్ర యూనిట్ బృందం కొన్ని రోజులు విడిది చేసింది. అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గోదావరి లంకల్లోనూ చిత్రీకరించారు. ఇసుక తిన్నెల్లో అందమైన ఇంటి సెట్‌ను వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఏఎన్నార్ నటించిన మరో చిత్రమాణిక్యం ‘మూగమనసులు’ సైతం 1964లో కోనసీమలోని గోదావరి తీరంలో సఖినేటిపల్లి, ముక్తేశ్వరంరేవు, రాజోలులలో చిత్రీకరించారు. ఆ చిత్రంలోని ‘ముద్దబంతి పువ్వులో మూగకళ్ల ఊసులు’ పాట సఖినేటిపల్లి గోదావరి గట్టు, ఆ పరిసర నదీపరీవాహకాల్లో చిత్రీకరించారు. ‘గోదారి గట్టుందీ... గట్టుమీద చెట్టుంది’ పాట సఖినేటిపల్లి రేవు ఏటిగట్టుపై షూటింగ్ చేశారు.
మేకప్ మ్యాన్ అమలాపురం వాసే
ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకులను అలరించిన ఏఎన్నార్‌కు మేకప్ వేసిన మామిడిపల్లి శ్రీను అమలాపురం వాసే. ఆయన ఏఎన్నార్‌కు పలు చిత్రాలకు సహాయ మేకప్ మ్యాన్‌గా, మేకప్ మ్యాన్‌గా పనిచేశారు. ఏఎన్నార్ ఎప్పుడూ తనను ‘ఒరేయ్ అమలాపురం...’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారని శ్రీను చెప్పారు.
ఏఎన్నార్‌కు అల్పాహారం మా హోటల్ నుంచే...
అమలాపురంలో పుల్లయ్య హోటల్‌కు అప్పట్లో పెద్దపేరు. అమలాపురం పరిసర ప్రాంతాల్లో దసరా బుల్లోడు చిత్ర షూటింగ్ సమయంలో ఏఎన్నార్‌కు అల్పాహారం మా హోటల్ నుంచే వెళ్లేది. ఏఎన్నార్‌కు పెసరట్టు అంటే మహా ప్రీతి. ఆయనకు ఇష్టమని తెలుసుకుని కోనసీమ చేపల పులుసు, బొమ్మిడాయల పులుసు ప్రత్యేకంగా వండించి పంపించాను.
- సలాది రమణ,
పుల్లయ్య హోటల్ యజమాని
మూడు సినిమాలిక్కడే
కపిలేశ్వరపురం, న్యూస్‌లైన్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన గురుబ్రహ్మ, సూత్రధారులు, రాజేశ్వరి కల్యాణం సినిమాలలో అత్యధిక భాగం కపిలేశ్వరపురం దివాణం, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. సూత్రధారులు సినిమా సుమారు 40 రోజుల పాటు దివాణంలోనే చిత్రీకరించారు. ఆ సినిమా ప్రతినాయకుడు కైకాల సత్యనారాయణ నివాసంగా కపిలేశ్వరపురం దివాణంలో చిత్రీకరించారు. 1986లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో‘గురుబ్రహ్మ’ సినిమా షూటింగ్ కపిలేశ్వరపురం, అంగరలలోనే జరిగింది. 1993లో విడుద లైన నాగేశ్వరరావు, వాణిశ్రీ, మీనా నటించిన రాజేశ్వరి కల్యాణం సినిమా సుమారు పది రోజులు కపిలేశ్వరపురంలోనే చిత్రీకరించారు. గురుబ్రహ్మ షూటింగ్‌కు కపిలేశ్వరపురం వచ్చిన నటి శారద స్థానిక ఏటిగట్టు వద్ద ఉన్న వినాయకుని ఆలయంలోని ఉపాలయాన్ని ప్రారంభించారు.
మరపురాని క్షణాలు
రాజమండ్రి కల్చరల్ : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా అక్కినేనికి రాష్ట్రంలో జరిగిన తొలి సన్మానం 1991లో రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో జిత్ మోహన్ మిత్రా, ఇతర ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అక్కినేని నటించిన దేవదాసు, రోజులు మారాయి, సువర్ణసుందరి తదితర చిత్రాల శతదినోత్సవ వేడుకలు రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. అక్కినేని ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
పాలగంగరాజు కోవా అంటే ప్రీతి
రాజమండ్రిలోని కుమారి థియేటరు సమీపంలో ఉన్న పాలగంగరాజు దుకాణంలో లభించే పాలకోవా అంటే అక్కినేనికి చాలా ఇష్టం. ఆ దుకాణం యజమానులు గోవింద్, విజయ్‌లకు ఆయన స్వదస్తూరితో ఉత్తరం రాస్తూ,‘ మీ పాలకోవాలో ఉన్న తీపి కన్నా, మీ ఇద్దరి అభిమానం మరింత మధుర’మన్నారు.
మాయాబజార్ ‘కోట’
రామచంద్రపురం, న్యూస్‌లైన్ : పట్టణంలోని రాజుగారి
కోటలో రెండు చిత్రాల షూటింగ్‌లో అక్కినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు ‘మాయాబజార్’ (సాంఘిక చిత్రం) ఇక్కడే తీశారు. అక్కినేని సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణా స్టూడియోస్ ఆధ్వర్యంలో వైవీఎస్ చౌదరి తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘సీతారాముల కల్యాణం’ చిత్రం కూడా రాజుగారి కోటలో తీశారు. ఈ రెండు చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన పలు సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. మాయాబజార్ షూటింగ్‌కు సుమారు 10 రోజులు, సీతారాముల కల్యాణం చిత్రం షూటింగ్ సుమారు 20 రోజులు జరిగింది. ఆ సందర్భంగా అక్కినేని కాకినాడలో బస చేసేవారు. అక్కడ నుంచి ఆయన ప్రతి రోజూ షూటింగ్‌కు ఇక్కడకు వచ్చేవారు.
సహనటులను ప్రోత్సహించేవారు
బాపు, రమణల ‘బుద్ధిమంతుడు’లో నేను అక్కినేనితో నటించాను. పతాకసన్నివేశంలో దుష్టపాత్రధారిని నేను పోలీసు అధికారిగా అరెస్టు చేయాలి. అక్కినేని బాపు రమణలతో నాకు ఓ డైలాగు ఉండేటట్టు చేయమన్నారు. ఆ మహనటుడికి సాటి నటులను ప్రోత్సహించే అలవాటు ఉండేది. 1953లో రాజమండ్రిలో జరిగిన ‘దేవదాసు’ శతదినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆయన రాజమండ్రి వచ్చినప్పుడు, నా సోదరుడు శ్రీపాద పట్టాభి నన్ను ఆయనకు పరిచయం చేశారు. సమయపాలనకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. గురుబ్రహ్మ షూటింగ్ కపిలేశ్వరపురంలో జరిగింది. నిర్మాతలు ఉదయం ఆరు గంటలకు షూటింగ్ అంటే, ఆయన సరిగా ఆరుగంటలకే మేకప్‌తో సిద్ధమయ్యారు. హీరోయిన్ అక్కడికి రాలేదు. వెళ్లిపోతానన్నారు అక్కినేని. అక్కినేనిని సముదాయించే బాధ్యత నాపై పడింది. రాత్రి పొద్దుపోయేవరకు పని చేయడం ఆయన నైజానికి విరుద్ధం. కానీ, వేకువజామునే పని మొదలు పెట్టేవారు.
- జిత్ మోహన్ మిత్రా, నటుడు, రాజమండ్రి
హేయ్ గోదావరీ అనేవారు
సూత్రధారులు సినిమాలో ఒక పాటకు నేను నృత్యదర్శకత్వం వహించాను. ఎప్పుడు నేను అక్కినేనిని కలిసినా, హేయ్, గోదావరి అంటూ ఆప్యాయంగా పిలిచేవారు.
-సప్పా దుర్గాప్రసాద్, నాట్యాచార్యుడు,రాజమండ్రి
మా ఇంట్లోనే వారం షూటింగ్
రాజేశ్వరి కల్యాణం సినిమా షూటింగ్ సుమారు వారం రోజులు మా ఇంటిలో జరిగింది. నాగేశ్వరరావుగారు మా కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించేవారు.
- కమ్మ వీరవెంకట్రావు, కపిలేశ్వరపురం
Advertisement