
తమిళసినిమా: ఎంత పెద్ద నటుడి చిత్రం అయినా సరే నిర్ణయించిన టిక్కెట్ ధర కంటే అధికంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు అని రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి కడంబూర్ రాజా పేర్కొన్నారు. అలా వసూలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తాజా వినోదపు పన్ను విధానం ప్రకారం మల్టీప్లెక్స్ థియేటర్లలో టిక్కెట్ ధరను గరిష్టంగా రూ.204గా, కనిష్టంగా రూ.63 రూపాయలుగా నిర్ణయించారు.
అదేవిధంగా ఏసీ థియేటర్లలో గరిష్టంగా రూ.126, కనిష్టంగా రూ.40–50 గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై శనివారం పుదుకోట్టైలో ఎంజీఆర్ శతాబ్ది వేడుకల సందర్భంగా ఆయన చిత్ర పటాలను ఆవిష్కరించిన అనంతరం కడంబూర్ రాజా మాట్లాడుతూ థియేటర్ల టిక్కెట్ల ధర విషయంలో విధివిధానాలను మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అది ఎంత పెద్ద నటుడి చిత్రం అయినా సరే అని అన్నారు.
ఇక నటీనటుల పారితోషికం వంటి విషయాలను వారు చర్చించి పరిష్కరించుకోవాలని, అది నిర్మాతల మండలి, నడిగర్ సంఘం సమస్య అనీ పేర్కొన్నారు. కాగా నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ థియేటర్ల యాజమాన్యానికి టిక్కెట్లపై అధిక ధరలను విధించకూడదని, థియేటర్ క్యాంటీన్‌ల్లో ఎంఆర్‌పీ ధరలకే విక్రయించాలని, పార్కింగ్ రుసుం వసూలు చేయకూడదని, అమ్మ వాటర్‌నే విక్రయించాలి లాంటి కొన్ని షరతులను విధించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తాము పర్యవేక్షిస్తామని ఆయన ప్రకటించారు.
విశాల్ ఎవరు?
నిర్మాతల మండలి నిబంధనలు, మంత్రి కడంబూర్ రాజా ప్రకటనలపై చెన్నైలో శనివారం థియేటర్ల యాజమాన్యం సమావేశం అయ్యి చర్చించారు. అనంతరం చెన్నై థియేటర్ల అసోషియేషన్ అధ్యక్షుడు రామనాథన్ మాట్లాడుతూ చిన్న చిత్రాల విడుదల సమయంలో టిక్కెట్ ధరను కాస్త తగ్గిస్తామన్నారు. తినుబండారాలను బయట ఏ ధరకు విక్రయిస్తున్నారో అదే ధరకు తామూ విక్రయిస్తామని తెలిపారు. ఇక వాహనాల పార్కింగ్ వ్యవహారం కోర్టులో ఉంది గనుక ఆ విషయం గురించి ప్రస్తుతం మాట్లాడనన్నారు.
టిక్కెట్లను అధిక ధరలకు విక్రయించమని చెప్పారు. అదేవిధంగా బయటి తినుబండారాలను అనుమతించే విషయమై థియేటర్ల యాజమాన్యంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ విషయాల్లో నిబంధనలు విధించడానికి విశాల్ ఎవరని ప్రశ్నించారు. తమకంటూ సంఘం ఉందని, అదేవిధంగా వారికి సంఘం ఉందని అన్నారు. ఈ విషయంలో వారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదనీ, తమతో చర్చిస్తే బాగుండేదని అభిరామి రామనాథన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment