మొదటి రోజే ఐదు కోట్లకు పైగా కలెక్షన్లు
అర్జున్ కపూర్, దీపికా పదుకొనే జంటగా నటించిన బాలీవుడ్ ఎంటర్టైనర్ మూవీ 'ఫైండింగ్ ఫానీ' తొలిరోజే ఏకంగా ఐదు కోట్ల రూపాయల నెట్ వసూళ్లు సాధించింది. ఇదంతా కేవలం భారతదేశంలో మాత్రమే. ఇక వారాంతం రెండు రోజుల్లో కూడా దీనికి మంచి కలెక్షన్లు రావడం ఖాయమని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం విడుదలైన ఈ సినిమాలో ఇంకా నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా ముఖ్యపాత్రలు పోషించారు. ఐదుగురు వ్యక్తులు కలిసి మొదలుపెట్టిన రోడ్డు ప్రయాణం గురించి ఈ సినిమా ఉంటుంది. కేవలం నోటి ప్రచారంతోనే, అభిమానుల కారణంగానే ఈ సినిమా బాగా ఆడుతోందని, శనివారం ఉదయం ట్రెండును బట్టి చూస్తే మరిన్ని భారీ కలెక్షన్లు రావడం ఖాయమని చిత్ర వర్గాలు తెలిపాయి. దినేష్ విజన్‌కు చెందిన మడోక్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మించింది.