
లింగరాజ్ స్వామి ఆలయంలో రవీనా టండన్
ప్రముఖ హీరోయిన్ రవీనా టండన్‌పై ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో కేసు నమోదైంది. ఓ ప్రముఖ ఆలయంలోని నిషేదిత ప్రాంతంలో మొబైల్ ఫోన్ వినియోగించటంతో పాటు, హిందుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆమె మీద భువనేశ్వర్ డీసీపీ కేసు నమోదు చేశారు. గత ఆదివారం ఒరిస్సాలోని భువనేశ్వర్ శ్రీ లింగరాజ్ స్వామి ఆలయాన్ని రవీనా దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె ఆలయంలో ఓ యాడ్‌ను మొబైల్ ఫోన్‌లో షూట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆలయంలోకి సెల్‌ఫోన్స్ తీసుకెళ్లేందుకు అనుమతి లేకపోయినా.. రవీనా ఫోన్ తీసుకెళ్లటం నిషేదిత ప్రాంతంలో వీడియో తీయటం లాంటి కారణాలతో ఆమె మీద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై స్పందించిన రవీనా ‘మా కారణంగా ఆలయ నిర్వహకులు ఇబ్బంది పడ్డారు.
మా సిబ్బంది సెల్ ఫోన్లు వాడటం, వీడియోలు తీయటం, సెల్పీలు దిగటం వల్ల వారికి ఇబ్బంది కలిగింది. కానీ మాకు అక్కడ మొబైల్ వినియోగించటంపై ఆంక్షలు ఉన్నట్టుగా తెలీదు. అక్కడ మేం యాడ్ షూట్ లాంటిదేమీ చేయలేదు. కేవలం మొబైల్‌లో వీడియో తీశాం. అక్కడ ఉన్నవారు కూడా మాకు నిషేదం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’ అని క్లారిటీ ఇచ్చారు.