టాప్ హీరోపై సోషల్ మీడియాలో సెటైర్లు
చెన్నై: తమిళ టాప్ హీరో విజయ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. విజయ్ 'తమిళనాడు రాహుల్ గాంధీ' అంటూ నెటిజన్లు విసుర్లు ఎక్కుపెట్టారు. తన తాజా చిత్రం 'తెరీ' ఆడియో ఆవిష్కణ కార్యక్రమంలో చేసిన కామెంట్లపై నెటిజన్లు చురక అంటించారు.
ఆడియో ఫంక్షన్ లో విజయ్ మాట్లాడుతూ... దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరోయిన్లు సమంత, అమీ జాక్సన్ లపై ప్రశంసలు కురిపించాడు. తన సొంత సినిమా గురించి డబ్బా కొట్టుకోనని చెప్పాడు. ప్రతి ఒక్కరు నిజాయితీగా ఉండాలని, జీవితానికో లక్ష్యం ఉండాలని ఉద్బోధించాడు. అంతేకాదు ప్రఖ్యాత కమ్యూనిస్ట్ నేత మావో జెడాంగ్ జీవిత చరిత్రలోని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ మావో జెడాంగ్ ను రష్యా నాయకుడిగా పేర్కొనడంతోనే చిక్కొచ్చి పడింది. సభా ప్రాంగణంలో ఉన్నవారెవరూ విజయ్ వ్యాఖ్యలను సరిదిద్దే ప్రయత్నం చేయలేదు.
చైనా కమ్యూనిస్టు వ్యవస్థాపక నాయకుడు మావో జెడాంగ్ ను రష్యా నేతగా పేర్కొనడంతో విజయ్ పై నెటిజన్లు మండిపడ్డారు. సినిమావాళ్లు తమ అవివేకం, అజ్ఞానాన్ని ఎందుకు బయటపెట్టుకుంటారని ఒకరు ప్రశ్నించారు. సినీతారల్లో చాలా మంది టెన్త్ స్టాండర్డ్ దాటని వారు ఉన్నారని కామెంట్ చేశారు. 'వినోదం అందించడంలో విజయ్ పులి లాంటి వాడు. లోకజ్ఞానం విషయంలో అతడు ఎలుకగా మారాడు' అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకా నయం మావో జెడాంగ్ ను అమెరికా అధ్యక్షుడని చెప్పలేదని ఇంకొరు పేర్కొన్నారు.
సినిమా నటులు తాము మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించుకోవాలని మరొకరు సూచించగా.. మావో, మావో జెడాంగ్ ఒకరేనని మనలో ఎంతమందికి తెలుసునని ఇంకొరు ప్రశ్నించారు. సినిమాల ద్వారా వందలకోట్లు సంపాదించడం కాదు.. కాస్తా లోకజ్ఞానం అలవరచుకోవాలని సలహాయిచ్చారు. విజయ్ లాంటి వారు చాలా మంది రోల్ మోడల్ గా ఉండడం అవమానకరమని ఘాటుగా వ్యాఖ్యానించారు.