Tamil Hero Vijay
-
Actor Vijay: మతతత్వ, అవినీతి శక్తులే... మా శత్రువులు
సాక్షి, చెన్నై: కేంద్రంలో, తమిళనాట అధికార పార్టీలైన బీజేపీ, డీఎంకేలపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. ‘‘మతం, భాష అంటూ ప్రజల్ని చీల్చి రాజకీయం చేసే శక్తులు, ద్రవిడ నమూనా అంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న అవినీతిపరులే మా పార్టీకి ప్రధాన శత్రువులు’’ అని ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తమతో కలిసి వచ్చే వారిని అధికారంలో భాగస్వాములను చేస్తామని ప్రకటించారు. ఆయన 8 నెలల క్రితం సొంత పార్టీ ఏర్పాటు చేయడం తెలిసిందే. టీవీకే తొలి మహానాడు విల్లుపురం జిల్లా వీ సాలై గ్రామంలో ఆదివారం జరిగింది. సభకు అభిమానులు, కార్యకర్తలు అసంఖ్యాకంగా పోటెత్తారు. ఈ సందర్భంగా విజయ్ ఆవేశపూరితంగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘‘ద్రవిడ సిద్ధాంతకర్త ఈవీఆర్ పెరియార్, కర్మ యోగి కామరాజ్, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, వీర నారీ వేలూ నాచియార్ ఆదర్శంగా టీవీకే సాగుతుంది. లౌకిక, సామాజిక, న్యాయ సిద్ధాంతాలతో పార్టీని నడుపుతాం. అందరం సమానమని చాటే సరికొత్త రాజకీయాలను తమిళనాడులో చూస్తారు’’ అని అన్నారు. ‘‘నన్ను విమర్శించిన వాళ్ల పేర్లను ప్రస్తావించబోను. వాళ్లలా అమర్యాదకరంగా మాట్లాడబోను. సంస్కారయుత రాజకీ యాలు చేస్తా’’ అని చెప్పారు. ఎంజీఆర్, ఎన్టీఆరే స్ఫూర్తి తమిళనాడులో ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సినీ రంగం నుంచి రాజకీయంగా చరిత్ర సృష్టించారని విజయ్ గుర్తు చేశారు. ‘‘ఆ దిశగా తమిళనాడులో మరో కొత్త అధ్యాయం లిఖిస్తాం. శాస్త్రసాంకేతి రంగాల్లో మాత్రమే మార్పు రావాలా? రాజకీయాలూ మారాలి. కానీ నన్ను ఈ స్థాయికి తెచ్చిన ప్రజలకు ఏదోఒకటి చేయాలనే అన్నింటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి అడుగుపెట్టా. అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న సినిమా కెరీర్‌ను వదిలి వచ్చా’’. అన్నారు. నీట్ పరీక్ష విధానాన్ని విజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. తన చెల్లెలి మరణం ఎంతగా బాధించిందో ‘నీట్’ కారణంగా అరియలూర్‌లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ఉదంతమూ అంతే బాధించిందన్నారు.అశేష జనవాహిని మహానాడుకు నిర్వాహకులే ఊహించని రీతిలో జనసందోహం పోటెత్తింది. సభ సాయంత్రం నాలుగింటికి కాగా ఉదయం నుంచే వేలాదిగా అభిమానుల రాక మొదలైంది. దాంతో సభను ముందుగానే ప్రారంభించారు. రాత్రి ఏడింటికి సభ ముగిసినా రాత్రి 9 దాకా జనం వస్తూనే ఉన్నారు. దాంతో చెన్నై–తిరుచ్చి జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింంది. -
తల్లిదండ్రుల్ని పట్టించుకోని స్టార్ హీరో.. వారిని నిజంగానే అవమానించాడా?
దళపతి విజయ్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే వారసుడు మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తమిళంలో స్టార్ హీరోగా పేరు సంపాదించారు. ఆయన నటించిన వారీసు తమిళనాట భారీ విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. అయితే ఈ మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమంలో ఆయన చేసిన పని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈవెంట్లో ఆయన తల్లిదండ్రులను పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. వారికి కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్న వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా.. జనవరి 2న వారీసు ఆడియో లాంఛ్ చెన్నైలో జరిగిన సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు విజయ్ తండ్రి చంద్రశేఖర్, తల్లి శోభన కూడా పాల్గొన్నారు. విజయ్ అక్కడికి రాగానే అందరినీ పలకరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి పలకరించారు. అయితే సొంత తల్లిదండ్రుల్ని ఏదో మొక్కుబడిగా పలకరించారన్న వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై విజయ్ తల్లి శోభన స్పందించారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ వేడుక ‘వారీసు’ సినిమా కోసం జరిగిందని.. ఓ పెద్ద ఈవెంట్లో నా కుమారుడి నుంచి అంతకన్నా కోరుకునేది ఏముందని అన్నారు. కాగా.. గతంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ విజయ్ పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే, ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అప్పటినుంచి విజయ్‌కి కుటుంబంతో విభేదాలు మొదలయ్యాయని ప్రచారం నడుస్తోంది. -
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వారసుడు.. ఎన్ని కోట్లంటే?
తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. ఈ నెల 11వ తేదీన తెరపైకి వచ్చిన ఈ సినిమా తెలుగులో వారసుడు పేరుతో 14న రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇటీవల చెన్నైలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల వసూళ్ల చేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. అలాగే ఓవర్సీస్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటగా.. ఆస్ట్రేలియాలో 500 కె డాలర్ల వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో విజయ్ డ్యాన్స్, పాటలు, కామెడీ, యాక్షన్‌తో కలర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తోంది. #Varisu has crossed the A$500K mark in Australia 🇦🇺 pic.twitter.com/AaNXF48oHh — Ramesh Bala (@rameshlaus) January 17, 2023 #Varisu crosses the Million mark in USA 🇺🇸 pic.twitter.com/XPEWGkbt2K — Ramesh Bala (@rameshlaus) January 17, 2023 #Varisu has joined the ₹ 150 Crs Gross Club at the WW Box office.. pic.twitter.com/1i95Nk9f4Z — Ramesh Bala (@rameshlaus) January 17, 2023 -
దళపతి విజయ్‌కి విలన్‌గా సమంత?.. ఏ చిత్రమంటే..
నటుడు విజయ్‌తో సమంత ఢీకొన పోతున్నారా? అవుననే చర్చ కోలీవుడ్‌లో జరుగుతుంది. కోలీవుడ్‌లో విజయ్‌కు ఉన్న స్టార్డం అంతా ఇంతా కాదు. ఆయన చిత్రాలు జయాపజయాలకు అతీతంగా కలెక్షన్లు కొల్లగొడతాయి. ప్రస్తుతం ఈయన టాలీవుడ్‌ను టార్గెట్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న వారీసు(తెలుగులో వారసుడు) చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. మరో విషయం ఏమిటంటే ఇందులో నటి సమంత నటించనున్నట్లు సమాచారం. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు తెరి, మెర్సల్, కత్తి వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. కాగా నటి సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత చాలా బోల్డ్ పాత్రల్లో నటించడానికి సై అంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె పుష్ప చిత్రం కోసం చేసిన స్పెషల్ సాంగ్ కుర్రకారును గిలిగింతలు పెట్టే విషయం తెలిసిందే. ప్రస్తుతం శకుంతలం, యశోద వంటి హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటిస్తున్నారు. అలాంటిది విజయ్ 66 చిత్రంలో ఆయన్ని ఢీకొనే ప్రతినాయకి పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వైరల్ అవుతుంది. చదవండి: బికినీలో రచ్చ చేస్తున్న 'బ్యాచ్‌లర్' హీరోయిన్.. -
రజనీ సినిమాల తర్వాత అదే టాప్
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన 'తేరి' సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజు ఏకంగా రూ. 1.67 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు అక్కడ తమిళంలో విడుదలైన సినిమాల్లో రజనీకాంత్ నటించిన రోబో, లింగా సినిమాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'తేరి' నిలిచింది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా కొత్త సంవత్సరానికి సరైన బహుమతి అవుతుందని ఈ సినిమాకు ఉత్తర అమెరికా పంపిణీదారులు సినీగెలాక్సీ చెబుతోంది. అట్లీ దర్శకత్వం వహించిన తేరి సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా విడుదలైంది. అమెరికాలో బుధవారమే ప్రీమియర్లను తాకింది. బుధవారం నాటి ప్రీమియర్ షోలోనే ఇది రూ. 1.67 కోట్లు వసూలు చేసినట్లు సినీ గెలాక్సీ ప్రతినిధులు చెప్పారు. ఓ మాజీ పోలీసు అధికారికి, అతడి కూతురికి మధ్య సంబంధం గురించి చెప్పే ఈ సినిమాలో సమంత, అమీజాక్సన్ ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. -
టాప్ హీరోపై సోషల్ మీడియాలో సెటైర్లు
చెన్నై: తమిళ టాప్ హీరో విజయ్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. విజయ్ 'తమిళనాడు రాహుల్ గాంధీ' అంటూ నెటిజన్లు విసుర్లు ఎక్కుపెట్టారు. తన తాజా చిత్రం 'తెరీ' ఆడియో ఆవిష్కణ కార్యక్రమంలో చేసిన కామెంట్లపై నెటిజన్లు చురక అంటించారు. ఆడియో ఫంక్షన్ లో విజయ్ మాట్లాడుతూ... దర్శకుడు, సంగీత దర్శకుడు, హీరోయిన్లు సమంత, అమీ జాక్సన్ లపై ప్రశంసలు కురిపించాడు. తన సొంత సినిమా గురించి డబ్బా కొట్టుకోనని చెప్పాడు. ప్రతి ఒక్కరు నిజాయితీగా ఉండాలని, జీవితానికో లక్ష్యం ఉండాలని ఉద్బోధించాడు. అంతేకాదు ప్రఖ్యాత కమ్యూనిస్ట్ నేత మావో జెడాంగ్ జీవిత చరిత్రలోని ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ మావో జెడాంగ్ ను రష్యా నాయకుడిగా పేర్కొనడంతోనే చిక్కొచ్చి పడింది. సభా ప్రాంగణంలో ఉన్నవారెవరూ విజయ్ వ్యాఖ్యలను సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. చైనా కమ్యూనిస్టు వ్యవస్థాపక నాయకుడు మావో జెడాంగ్ ను రష్యా నేతగా పేర్కొనడంతో విజయ్ పై నెటిజన్లు మండిపడ్డారు. సినిమావాళ్లు తమ అవివేకం, అజ్ఞానాన్ని ఎందుకు బయటపెట్టుకుంటారని ఒకరు ప్రశ్నించారు. సినీతారల్లో చాలా మంది టెన్త్ స్టాండర్డ్ దాటని వారు ఉన్నారని కామెంట్ చేశారు. 'వినోదం అందించడంలో విజయ్ పులి లాంటి వాడు. లోకజ్ఞానం విషయంలో అతడు ఎలుకగా మారాడు' అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకా నయం మావో జెడాంగ్ ను అమెరికా అధ్యక్షుడని చెప్పలేదని ఇంకొరు పేర్కొన్నారు. సినిమా నటులు తాము మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించుకోవాలని మరొకరు సూచించగా.. మావో, మావో జెడాంగ్ ఒకరేనని మనలో ఎంతమందికి తెలుసునని ఇంకొరు ప్రశ్నించారు. సినిమాల ద్వారా వందలకోట్లు సంపాదించడం కాదు.. కాస్తా లోకజ్ఞానం అలవరచుకోవాలని సలహాయిచ్చారు. విజయ్ లాంటి వారు చాలా మంది రోల్ మోడల్ గా ఉండడం అవమానకరమని ఘాటుగా వ్యాఖ్యానించారు. -
మోడీని కలవనున్న హీరో విజయ్
చెన్నై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని తమిళ కథానాయకుడు విజయ్ కలవనున్నారు. కోయంబత్తూరులో ఈ సాయంత్రం మోడీని కలవనున్నట్టు విజయ్ ట్విటర్లో పేర్కొన్నారు. 'రాజకీయేతర సమావేశానికి మోడీ నన్ను ఆహ్వానించారు. ఆయనతో భేటీ కానుండడం చాలా సంతోషం కలిగించే విషయం' అని విజయ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. Indeed privileged to be invited to a non-political meeting with Narendra Modi ji, looking forward to meet him.. -Vijay anna — vijay (@Vijay_cjv) April 16, 2014 గతవారం చెన్నైలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను మోడీ కలిశారు. అయితే మర్యాదపూర్వకంగా తాము కలిసినట్టు రజనీ, మోడీ తెలిపారు. తెలుగు నటులు పవన్ కళ్యాణ్, నాగార్జున ఇప్పటికే మోడీని కలిశారు. పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ తరపున ప్రచారం కూడా చేస్తున్నారు. -
సినిమా షూటింగ్ కోసం ఫ్లైఓవర్ మూసివేత
హైదరాబాద్: సినిమా షూటింగ్ కోసం పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ను ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూసివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. తమిళ హీరో విజయ్ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ను ఈనెల 22 నుంచి చాంద్రాయణగుట్ట పరిసరాలలో తీస్తున్నారు. ఫ్లైఓవర్‌పై ఆదివారం ఏకంగా సెట్టింగ్‌లు వేసి చిత్రీకరణ చేశారు. దీంతో వాహనాలను కింది నుంచి దారి మళ్లించారు. ఇది బెంగళూర్ జాతీయ రహదారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించిపోయాయి. ఒకవైపు భానుడి భగభగలు....మరోవైపు ముందుకు కదలలేని పరిస్థితి కావడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌కు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, ఈ సినిమా షూటింగ్‌కు పోలీసు కమిషనర్ అనుమతులు ఉన్నాయని పోలీస్ అధికారులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఫ్లై ఓవర్ మూసేసిన అధికారులు ట్రాఫిక్ స్తంభించకుండా తగు చర్యలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం కనబరిచారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్‌పై షూటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.