
సినిమా షూటింగ్ కోసం ఫ్లైఓవర్ మూసివేత
సినిమా షూటింగ్ కోసం పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ను ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూసివేశారు.
హైదరాబాద్: సినిమా షూటింగ్ కోసం పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ను ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూసివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందిపడ్డారు. తమిళ హీరో విజయ్ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ను ఈనెల 22 నుంచి చాంద్రాయణగుట్ట పరిసరాలలో తీస్తున్నారు. ఫ్లైఓవర్‌పై ఆదివారం ఏకంగా సెట్టింగ్‌లు వేసి చిత్రీకరణ చేశారు. దీంతో వాహనాలను కింది నుంచి దారి మళ్లించారు. ఇది బెంగళూర్ జాతీయ రహదారి కావడంతో పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించిపోయాయి.
ఒకవైపు భానుడి భగభగలు....మరోవైపు ముందుకు కదలలేని పరిస్థితి కావడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌కు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా, ఈ సినిమా షూటింగ్‌కు పోలీసు కమిషనర్ అనుమతులు ఉన్నాయని పోలీస్ అధికారులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఫ్లై ఓవర్ మూసేసిన అధికారులు ట్రాఫిక్ స్తంభించకుండా తగు చర్యలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం కనబరిచారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై ఉన్న ఫ్లై ఓవర్‌పై షూటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.