బీజేపీ, డీఎంకేలపై ‘తళపతి’ విజయ్ వాగ్బాణాలు
2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని వ్యాఖ్యలు
టీవీకే తొలి మహానాడుకు భారీగా వచ్చిన జనం
సాక్షి, చెన్నై: కేంద్రంలో, తమిళనాట అధికార పార్టీలైన బీజేపీ, డీఎంకేలపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ తమిళ హీరో విజయ్ వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. ‘‘మతం, భాష అంటూ ప్రజల్ని చీల్చి రాజకీయం చేసే శక్తులు, ద్రవిడ నమూనా అంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న అవినీతిపరులే మా పార్టీకి ప్రధాన శత్రువులు’’ అని ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
తమతో కలిసి వచ్చే వారిని అధికారంలో భాగస్వాములను చేస్తామని ప్రకటించారు. ఆయన 8 నెలల క్రితం సొంత పార్టీ ఏర్పాటు చేయడం తెలిసిందే. టీవీకే తొలి మహానాడు విల్లుపురం జిల్లా వీ సాలై గ్రామంలో ఆదివారం జరిగింది. సభకు అభిమానులు, కార్యకర్తలు అసంఖ్యాకంగా పోటెత్తారు. ఈ సందర్భంగా విజయ్ ఆవేశపూరితంగా సుదీర్ఘ ప్రసంగం చేశారు.
‘‘ద్రవిడ సిద్ధాంతకర్త ఈవీఆర్ పెరియార్, కర్మ యోగి కామరాజ్, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, వీర నారీ వేలూ నాచియార్ ఆదర్శంగా టీవీకే సాగుతుంది. లౌకిక, సామాజిక, న్యాయ సిద్ధాంతాలతో పార్టీని నడుపుతాం. అందరం సమానమని చాటే సరికొత్త రాజకీయాలను తమిళనాడులో చూస్తారు’’ అని అన్నారు. ‘‘నన్ను విమర్శించిన వాళ్ల పేర్లను ప్రస్తావించబోను. వాళ్లలా అమర్యాదకరంగా మాట్లాడబోను. సంస్కారయుత రాజకీ యాలు చేస్తా’’ అని చెప్పారు.
ఎంజీఆర్, ఎన్టీఆరే స్ఫూర్తి
తమిళనాడులో ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సినీ రంగం నుంచి రాజకీయంగా చరిత్ర సృష్టించారని విజయ్ గుర్తు చేశారు. ‘‘ఆ దిశగా తమిళనాడులో మరో కొత్త అధ్యాయం లిఖిస్తాం. శాస్త్రసాంకేతి రంగాల్లో మాత్రమే మార్పు రావాలా? రాజకీయాలూ మారాలి. కానీ నన్ను ఈ స్థాయికి తెచ్చిన ప్రజలకు ఏదోఒకటి చేయాలనే అన్నింటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి అడుగుపెట్టా. అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న సినిమా కెరీర్‌ను వదిలి వచ్చా’’. అన్నారు. నీట్ పరీక్ష విధానాన్ని విజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. తన చెల్లెలి మరణం ఎంతగా బాధించిందో ‘నీట్’ కారణంగా అరియలూర్‌లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ఉదంతమూ అంతే బాధించిందన్నారు.
అశేష జనవాహిని
మహానాడుకు నిర్వాహకులే ఊహించని రీతిలో జనసందోహం పోటెత్తింది. సభ సాయంత్రం నాలుగింటికి కాగా ఉదయం నుంచే వేలాదిగా అభిమానుల రాక మొదలైంది. దాంతో సభను ముందుగానే ప్రారంభించారు. రాత్రి ఏడింటికి సభ ముగిసినా రాత్రి 9 దాకా జనం వస్తూనే ఉన్నారు. దాంతో చెన్నై–తిరుచ్చి జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింంది.
Comments
Please login to add a commentAdd a comment