తొలి సినిమా ‘ధడక్’తోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రీదేవి ముద్దుల తయన జాన్వీ కపూర్. తన అభిమాన నటుడు రాజ్‌కుమార్‌రావుతో కలిసి ఒక కామెడీ హారర్ సినిమాలో నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘సంచార జీవితం అంటే ఇష్టం’ అంటున్న జాన్వీ అంతరంగ తరంగాలు ఇవి....
మనసు పలికే..
చిన్నప్పుడు నేను ఎప్పుడూ నటి కావాలని అనుకోలేదు. మా అమ్మ కూడా నన్ను నటి చేయాలని ఎప్పుడూ ఆనుకోలేదు. ఒక దశలో చరిత్ర మీద బాగా ఆసక్తి కలిగింది. సృజనాత్మక రచనలు చేయాలనుకునేదాన్ని. ఎన్ని చేయాలనుకున్నా మనసు మాత్రం ‘నేను నటిని’ అని ఫిక్సైపోయింది.
సీక్రెట్ ఏజెంట్!
చిన్నప్పుడు స్కూల్లో కట్టుకథలు బాగా అల్లేదాన్ని.‘‘నేను మీలాంటి స్టూడెంట్‌ని కాను. సీక్రెట్ ఏజెంట్‌ని. ఒక వ్యక్తి మీద నిఘా వేయడానికి ఇక్కడ స్టూడెంట్‌గా నటిస్తున్నాను’’ అని చెప్పేదాన్ని. అదేమిటో...అందరూ నమ్మేవారు. ‘‘ఒక్క సారైతే... నాకు బెల్లీ డ్యాన్స్ నేర్పించడం కోసం షకీరా ముంబై వస్తుంది’’ అని చెప్పాను. నేను చెప్పింది ఫ్రెండ్స్ నమ్మడమే కాకుండా వాళ్ల ఇంట్లో కూడా విషయం చెప్పారు. అంతే...అమ్మకు వాళ్ల పేరెంట్స్ నుంచి ఒకటే ఫోన్లు... ‘‘గుడ్‌న్యూస్ తెలిసింది. మా అమ్మాయిని కూడా పంపమంటారా’’ అని రిక్వెస్ట్‌గా అడిగేవాళ్లు!
సంచారమే బాగుంటుంది!
నటి కాకపోతే...ప్రపంచాన్ని చుట్టేసేదాన్ని. కొత్తవ్యక్తులను కలుసుకునేదాన్ని. సృజనాత్మక రచనలు చేసేదాన్ని. సంచార జీవితం అంటే నాకు ఇష్టం. ‘ధడక్’ కోసం కథక్ నేర్చుకున్నాను. ఇది ఎంతో అందమైన నృత్యం. అమ్మ డ్యాన్స్ చూసి డ్యాన్స్‌లో చిన్నప్పుడు శిక్షణ తీసుకుందని అందుకే అంతా బాగా చేయగలుతుందని అనుకునేవారు. కానీ అది నిజం కాదు. డ్యాన్స్‌లో అమ్మ ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. డ్యాన్స్‌మాస్టర్‌లు చెప్పినట్లు అప్పటికప్పుడు అద్భుతంగా చేసేది...నిజంగా ఇది గొప్ప విషయం.
అమ్మ మాట
సినిమారంగంలోకి వచ్చిన తరువాత అమ్మ చెప్పిన ముఖ్యమైన మాట...‘మంచి నటి కావడానికి ముందు మంచి వ్యక్తి కావాలి. నిజాయితీ ఉండాలి. అది జరగనప్పుడు మనం ఏ పాత్రకూ న్యాయం చేయలేం’
నటనలో నాదైన ముద్ర కనిపించాలనే ఉద్దేశంతో ‘ఇలా నటించు...అలా నటించు’ అని సలహాలు ఇవ్వలేదు. ఎప్పుడూ సెట్స్‌కు రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment