
అమ్మకు... బాలయ్య కానుక!
కట్టుదిట్టమైన భద్రత మధ్య పెద్ద సినిమాల షూటింగ్ జరుగుతుంటుంది. తాము విడుదల చేసేవరకూ ఆ సినిమా తాలూకు ఫొటోలు, వార్తలు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా, ఎలా వచ్చేస్తాయో కానీ ఒకట్రెండు ఫొటోలు, చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ బయటికొచ్చేసి, చిత్ర బృందానికి షాకిస్తుంటాయ్. ఇప్పుడు బాలకృష్ణ టైటిల్ రోల్‌లో రూపొందుతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ యూనిట్‌కి కూడా ఈ షాక్ తగిలింది.
బాలకృష్ణ నూరవ చిత్రమిది. వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మాతలు. ఈ చిత్రానికి సంబంధించిన రెండు ఫొటోలు ఎలాగో బయటికొచ్చాయ్. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు ఓ రేంజ్‌లో వీర విహారం చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ గెటప్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. హేమ మాలిని, శ్రీయల గెటప్ ఎలా ఉంటుందో ఈ ఫొటోలు తెలియజేశాయి.
క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ తల్లిగా హేమమాలిని నటిస్తున్న విషయం విదితమే. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో తాజా షెడ్యూల్ మొదలైంది. షెడ్యూల్ తొలి రోజున హేమ మాలినికి బాలకృష్ణ లేపాక్షి చీరను బహుమతిగా ఇచ్చి, సర్‌ప్రైజ్ చేశారు. రీల్ సన్ ఇచ్చిన ఈ గిఫ్ట్‌కి రీల్ మదర్ ఆనందపడ్డారట.