నిర్మాతగా ఘంటాడి కృష్ణ
సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ నిర్మాతగా మారారు. యాక్షన్ కట్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ‘6టీన్స్-2’ చిత్రాన్ని నిర్మించనున్నారు. నేడు ఘంటాడి కృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘సినిమాల జయాపజయాలు టెక్నీషియన్స్‌పై ప్రభావం చూపుతాయి. నేను చేసిన పాటలు బాగున్నా... నా సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల కాస్త వెనుకబడ్డ మాట నిజం. త్వరలో నేను మొదలు పెట్టబోతున్న నా సొంత సినిమాలో అలనాటి ప్రముఖ హీరోయిన్ తనయుడు హీరోగా నటిస్తాడు. ఇదిలావుంటే... కోడి రామకృష్ణ దర్శకత్వంలో నేను సంగీతం అందించిన ‘అవతారం’ చిత్రం త్వరలో రానుంది. అలాగే ఓ ప్రముఖ సంస్థ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రానికి సంగీతం అందించబోతున్నాను’’ అని తెలిపారు ఘంటాడి కృష్ణ.